15 రకాల వస్తువులతో ప్యాకింగ్
15 రకాల వస్తువులతో ప్యాకింగ్
Published Sat, Aug 6 2016 6:48 PM | Last Updated on Sat, Sep 29 2018 6:06 PM
సిద్ధం చేస్తున్న డ్వాక్రా మహిళలు
డీఆర్‌డీఏ ఆధ్వర్యాన ఘాట్ల వద్ద తక్కువ ధరకే విక్రయం
హనుమాన్‌పాలెం(కొల్లిపర) :
కృష్ణా పుష్కరాల సందర్భంగా పిండ ప్రదానానికి అవసరమైన వస్తువులను మండలంలోని హనుమాన్‌పాలెం గ్రామంలో ప్యాకింగ్ చేస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన ఘాట్ల వద్ద పిండ ప్రదానాలకు అవసరమైన వస్తువులను భక్తులకు తక్కువ ధరకే అందుబాటులో ఉంచనున్నారు. ఇందుకు అవసరమైన వస్తువులను చక్కగా ప్యాకింగ్ చేసే బాధ్యతను అధికారులు డ్వాక్రా మహిళలకు అప్పగించారు. క్రమంలో హనుమాన్‌పాలెం గ్రామానికి చెందిన ఆసంటి రత్నకుమారికి 20 వేల ప్యాకెట్ల తయారీ బాధ్యతను అప్పగించారు. ఆమె గ్రామానికి సమీపంలో ఉన్న సుగాలీకాలనీకి చెందిన మహిళలతో ప్యాకింగ్ పని చేయిస్తున్నారు. మొత్తం 15 రకాల వస్తువులతో 20 వేల ప్యాకెట్లను తయారు చేస్తున్నారు. ఇక్కడ 25 మంది మహిళలు మూడు రోజులుగా ఈ పనిలో నిమగ్నమయ్యారు. వీరికి కొందరు పురుషులు కూడా సాయం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రకాల వస్తువుల ప్యాకింగ్‌ను పూర్తి చేశారు. ఈ నెల 10వ తేదీలోపు లక్ష్యాన్ని పూర్తి చేస్తామని రత్నకుమారి చెప్పారు.
ప్యాకెట్‌లో ఉండే వస్తువుల వివరాలు..
పసుపు, కంకుమ, హారతి కర్పూరం, సాంబ్రానీ కడ్డీలు, గంథం, ఇస్తరాకులు, బెల్లం, నూములు, బియ్యంపిండి, బియ్యం, వక్కలు, తమలపాకులు, అరటికాయ, అవునెయ్యి, అవుపాలు. వీటన్నింటిని విడివిడిగా ప్యాకింగ్ చేయడంతోపాటు అన్ని కలపి ఒక సంచిలో ప్యాకింగ్ చేస్తున్నారు.
Advertisement