![వరద దెబ్బకు ఏడుపాయల విలవిల - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/61475256108_625x300.jpg.webp?itok=dT8osuBc)
వరద దెబ్బకు ఏడుపాయల విలవిల
కూలిపోయిన బ్రిడ్జి.. పడి పోయిన గ్రిల్లింగ్
కొట్టుకుపోయిన హుండీలు..కూలిన స్తంభాలు
వనదుర్గా ఆలయం అస్తవ్యస్తం
సుమారు రూ.15 లక్షల నష్టం
దెబ్బతిన్న ప్రదేశాన్ని పరిశీలించిన డీఎస్పీ, ఈఓ
పాపన్నపేట:వరద ఉధృతికి ఏడుపాయల విలవిల్లాడింది. ఆలయం అంతా అస్తవ్యస్తంగా మారింది. కూలిపోయిన బ్రిడ్జి.. పడిపోయిన గ్రిల్లింగ్..కొట్టుకుపోయిన హుండీలు..కుప్పకూలిన క్యూలైన్లు..నేలకూలిన విద్యుత్ స్తంభాలు..విరిగిన ఫ్యాన్లు.. వారం రోజుల పాటు మంజీరా వరదల్లో మునిగి శుక్రవారం వెలుగు చూసిన ఏడుపాయల ఆలయ పరిస్థితి ఇది. ఈ వరదల విలయంలో దాదాపు రూ 15 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలో తేలిందని ఈఓ వెంకటకిషన్‌రావు తెలిపారు.అనంతరం మెదక్ డీఎస్పీ నాగరాజు, మెదక్ రూరల్ సీఐ రామకృష్ణ, పాపన్నపేట ఎస్‌ఐ సందీప్‌రెడ్డి ఏడుపాయల్లోని పరిస్థితులను పరిశీలించారు.
ఇటీవల ఎడతెరిపి లేనివర్షాలు పడటం..అదే సమయంలో సింగూరు నుంచి నీరు సుమారు 1.60 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయడంతో మంజీరమ్మ మహోగ్రరూపందాల్చి ఘనపురం ఆనకట్టపై నుంచి 6 ఫీట్ల ఎత్తున పొంగిపొర్లింది. దిగువన ఉన్న ఏడుపాయల దుర్గమ్మ ఆలయాన్ని ముంచెత్తింది. దీంతో ఆలయం సుమారు 75 శాతం వరదల్లో మునిగి పోయింది. వరద తాకిడికి ఆలయం ముందు ఉన్న బ్రిడ్జి కూలిపోయింది.క్యూలైన్లు కుప్ప కూలాయి. ఆలయంలో చుట్టూర ఉన్న గ్రిల్లింగ్ కొట్టుకు పోయింది.అమ్మవారి హుండీలు కొట్టుకుపోయాయి. ఆలయంమధ్యలో ఉన్న గ్రానైట్‌రాళ్లు అడ్రస్ లేకుండా పోయాయి.ఆలయం గ్రిల్లింగ్ చుట్టు గడ్డి పేరుకు పోయింది.కాగా అమ్మవారి విగ్రహానికి మాత్రం ఎలాంటి నష్టం జరుగలేదు.
సుమారు రూ15 లక్షల ఆస్తినష్టం
వరదల వల్ల సుమారు రూ.15 లక్షల ఆస్తినష్టం జరిగిందని ఈఓ వెంకటకిషన్‌రావు తెలిపారు.శుక్రవారం ఆయన మెదక్ డీఎస్పీ నాగరాజు, సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ సందీప్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి సిబ్బందితో కలిసి ఆలయ పరిసరాలను సందర్శించి నష్టాన్ని అంచనావేశారు.
నిధుల మంజూరుకు డిప్యుటీ స్పీకర్ హామీ
వరదల వల్ల దెబ్బతిన్న దుర్గమ్మ ఆలయానికి మరమ్మతులు చేయడానికి ఎన్ని నిధులైనా మంజూరి చేయడానికి డిప్యుటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు ఈఓ వెంకటకిషన్‌రావు తెలిపారు.
నీటి ప్రవాహం తగ్గాకే ఆలయానికి అనుమతి
ఏడుపాయల ఆలయం ముందు పూర్తి నీటి ప్రవాహం తగ్గాకే భక్తులకు అనుమతి ఇస్తామని మెదక్ డీఎస్పీ నాగరాజు తెలిపారు.అంతలోగా ఆలయ మరమ్మతులు జరుగుతాయన్నారు.
\