Edupayala
-
దుర్గమ్మపై ఆన.. లంచం తీసుకోలేదు
పాపన్నపేట (మెదక్): ఏడుపాయల వనదుర్గ ఆలయం గురువారం బీఆర్ఎస్ నాయకుల సవాళ్లు.. ప్రతి సవాళ్లు, ప్రమాణాలకు వేదికైంది. బీఆర్ ఎస్‌లోని రెండు వర్గాలు తడి బట్టలతో ఒకరు.. పసుపు బట్టలతో మరొకరు అమ్మవారి ఎదుట ప్రమాణాలు చేశారు. ‘నా రాజకీయ జీవితంలో ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోలేదని వన దుర్గమ్మ మాత ఎదుట ప్రమాణం చేస్తున్నా. తప్పు చేసినట్లు నిరూపిస్తే మెదక్ రాందాస్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తా’ అంటూ ఇఫ్కో డైరెక్టర్, మెదక్ ఎమ్మెల్యే పద్మ భర్త దేవేందర్‌రెడ్డి ఏడు పాయల వనదుర్గ అమ్మవారి ఎదుట గురువారం ప్రమాణం చేశారు. తాను ప్రకటించినట్లుగా 150 మంది కార్యకర్తలతో ఆలయానికి చేరుకున్నారు. మంజీరా నదిలో స్నానం చేసి రాజగోపురంలోని దుర్గమ్మ ఉత్సవ విగ్రహం వద్ద పూజలు చేసి ప్రమా ణం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడు తూ కోనాపూర్ సొసైటీలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, భూకబ్జాలు, ఇసుక దందాలు, భూపంచాయితీలు, సెటిల్మెంట్లు చేయలేదన్నారు. సామాజికసేవ కోసం కాంట్రాక్టర్లు, అధికారుల సహాయం తీసుకున్నానే తప్ప ఎవరినీ బెదిరించలేదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని చెప్పారు. వందల ఎకరాల భూములు కొన్నారు... దైవ సన్నిధిలో చేసిన అసత్య ప్రమాణాలతో దేవేందర్‌రెడ్డి పతనం ప్రారంభమైందని బీఆర్ఎస్ అసమ్మతి నేతలు అన్నారు. దేవేందర్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించిన అసమ్మతి నాయకులు మడూర్ ఏఎంసీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, చిన్నశంకరంపేట మాజీ ఎంపీపీ అరుణ, సర్పంచ్ రాజారెడ్డి, అడ్వొ కేట్ జీవన్‌రావు తదితరులు 100 మందితో కలిసి గురువారం ఏడుపాయలకు చేరుకున్నారు. పసుపు బట్టలతో ఆలయంలోకి వచ్చి పూజలు చేసి అమ్మ వారి సన్నిధిలో ప్రమాణం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేవేందర్‌రెడ్డి తన భూదందాలు, ఇసుక మాఫియా, లంచాలు, కోనాపూర్ సొసైటీ వ్యవహారం, అక్రమ సంపాదనపై జవాబు చెప్పకుండా అమ్మవారి ఎదుట అసత్య ప్రమాణం చేశారని ఆరోపించారు. దీనికి సంబంధించిన అఫిడవిట్‌తో తాము వచ్చామని పేర్కొన్నారు. రూ.కోట్ల అవినీతిపై కాకుండా కేవలం ఏడుపాయల విషయంపై స్పందించడాన్ని ప్రజలు గమనించాలన్నారు. శంకరంపేట, నర్సాపూర్, మెదక్‌తో పాటు కామారెడ్డి జిల్లాల్లో వందల ఎకరాల భూములు కొన్నారని ఆరోపించారు. ఏ హోదాలో కలెక్టర్ పక్కన కూర్చొని సమావేశాల్లో సమీక్షలు చేస్తున్నారని ప్రశ్నించారు. మెదక్ డెయిరీ పేరిట కార్యకర్తల నుంచి రూ. లక్ష చొప్పున వసూలు చేసిన రూ. కోటి సొమ్మును ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మెదక్ నుంచి పద్మాదేవేందర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని మార్చకపోతే రెబల్ అభ్యర్థిని పోటీకి దింపక తప్పదని హెచ్చరించారు. -
వీడియో: వానల ఎఫెక్ట్.. ఎల్లమ్మ గుడిలోకి వరద నీరు
సాక్షి, నిర్మల్: కొద్దిరోజులుగా తెలంగాణలో వానలు దండికొడుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. వరదల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రాజెక్ట్‌ల్లోకి నీరు వచ్చి చేరుకుంది. ► ఇక, భారీ వరదల కారణంగా ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్‌లో ఉన్న పుసాయి ఎల్లమ్మ దేవాలయంలోకి వరద నీరు చేరుకుంది. దేవాలయాన్ని వరద ముంచెత్తింది. ► నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో, ప్రాజెక్ట్ 14 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 88,554, ఔట్ ఫ్లో 84,487 క్యూసెక్కులుగా ఉంది. ► అటు, ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో మంజీర పరవళ్లు తొక్కుతోంది. దీంతో, ఏడుపాయల ఆలయంలోకి వరద నీరు చేరుకుంది. ఆలయ పరిసరాల్లో మంజీరా ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో మూడో రోజు కూడా దర్శనాలను నిలిపివేశారు. రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. భారీ వర్షసూచన -
గోదావరి జలాలతో దుర్గమ్మ కాళ్లు కడుగుతాం
పాపన్నపేట(మెదక్): గోదావరి జలాలతో ఏడుపాయల దుర్గమ్మ కాళ్లు కడుగుతామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున వన దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించి మెదక్ జిల్లా పాపన్నపేటలో ఏడుపాయల జాతరను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ మదిలో ఊపిరి పోసుకున్న అద్భుతమైన ఆలోచన కాళేశ్వరం ప్రాజెక్టు అని నేడు అది శివుడి జడల నుంచి గంగమ్మ పొంగి పొర్లినట్లు, 618 మీటర్ల ఎత్తుకు నీటిని పంపిణీ చేస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్, కొండపోచమ్మల నుంచి సింగూరు ప్రాజెక్టుకు నీరు వస్తుందని, దీంతో మంజీర పాయల్లో గోదావరి జలాలు పరుగులు తీసి దుర్గమ్మ ఆలయాన్ని తాకుతూ ముందుకు పరుగులు పెడతాయన్నారు. మెతుకుసీమలో నీటి కరువు ఉండదని 10 జిల్లాలు లబ్ధి పొందుతాయన్నారు. రాష్ట్రంలో పర్యాటక కేంద్రాల అభివృద్ధి కోసం రూ.1,500 కోట్లు కేటాయించారని అందులో నుంచి ఏడుపాయల, ఘనపురం ప్రాజెక్టు అభివృద్ధికి రూ.100 కోట్లు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారని తెలిపారు. ప్రతీ జాతరకు రూ. కోటి: తలసాని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ హేమలత, కలెక్టర్ హరీశ్ జాతర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రతీ ఏడుపాయల జాతరకు ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేస్తుందన్నారు. ఏడుపాయల ఆదాయం కూడా పెరిగిందని, మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చొరవతో ఏడుపాయల పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు. -
ఏడుపాయల క్షేత్రంలో చోరీ
పాపన్నపేట (మెదక్): మెదక్ జిల్లా ఏడుపాయల దుర్గమ్మ క్షేత్రంలో చోరీ జరిగింది. అమ్మవారికి భక్తులు కానుకగా ఇచ్చిన వెండి గడప తొడుగును ఈవో కార్యాలయంనుంచి దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనలో ఆలయ సిబ్బందిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్‌లో మంజీర నదికి వరదలు వచ్చిన సమయంలో ఆలయ అర్చకులు గర్భగుడి గడపకు ఉన్న వెండి తొడుగు తీసి ఈఓ కార్యాలయంలో భద్రపర్చారు. అయితే మూడు రోజుల క్రితం వెండి తొడుగు కనిపించక పోవడంతో కార్యాలయంలో వెతికారు. ఎంత వెతికినా వెండి తొడుగు దొరక్కపోవడంతో ఈఓ శ్రీనివాస్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ సంగయ్య తెలిపారు. వెండి గడప తొడుగు సుమారు రెండు కిలోల వంద గ్రాముల బరువు, రూ.84 వేల విలువ చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం వెండి తొడుగు దాచి ఉంచిన కార్యాలయంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగతనం జరగడం గమనార్హం. గతంలోనూ చోరీలు.. ఏడుపాయల క్షేత్రంలో గతంలోనూ పలు దొంగతనాలు జరిగాయి. ఆలయ హుండీని పగులగొట్టి సొత్తును దోచుకెళ్లారు. రెండేళ్ల క్రితం ఇనుప స్క్రాప్ మాయమైంది. ఇటీవల ఘనపురం ఆనకట్టకు వెళ్లే దారిలో బిగించిన సీసీ కెమెరాలను సైతం దొంగలు ఎత్తుకెళ్లారు. ఇప్పటివరకు దొంగలు దొరకలేదు. పలు దొంగతనాల్లో ఆలయ సిబ్బంది ప్రమేయంపై ఆరోపణలు వచ్చాయి. -
జమ్మిచెట్టును ఊరూరా పెంచండి : రచ్చరవి
పాపన్నపేట(మెదక్): మన రాష్ట్ర వృక్షమైన జమ్మిచెట్టును ఊరురా పెంచాలని జబర్దస్త్ హస్యనటుడు రచ్చరవి కోరాడు. మండలంలోని ఎడుపాయాల నవ దుర్గామాతను మంగళవారం ఆయన దర్శించుకున్నాడు. త్రిదండి చినజీయర్ స్వామి మంగళ శాసనాలతో త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి ఆశీస్సులతో ‘మన జమ్మిచెట్టు’ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మణ్ విష్ణువర్దన్‌రెడ్డికి జమ్మిచెట్టును అందించారు. -
దుబాయ్ వెళ్తూ.. ‘దుర్గమ్మ’ వద్ద మృతి
పాపన్నపేట(మెదక్) : నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన ఓ యువకుడు దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమై ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చి చెక్‌డ్యాంలో దిగి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం ఏడుపాయల్లో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. బాన్సువాడకు చెందిన కుమ్మరి దుర్గేశ్(30) బతుకు దెరువు కోసం దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈమేరకు బుధవారం ఇంటి నుంచి బొంబాయి వెళ్లాల్సి ఉంది. ఈలోగా ఇష్టదైవమైన దుర్గమ్మ తల్లిని దర్శించుకునేందుకు ఆదివారం బావ శ్రీనివాస్‌తో కలిసి ఏడుపాయలకు వచ్చాడు. సాయంత్రం స్నానం చేసేందుకు చెక్‌డ్యాంలోకి దిగాడు. ఈ క్రమంలో స్నానం చేస్తుండగా నీట మునిగి చనిపోయాడు. ఈ విషయం గమనించని బావ శ్రీనివాస్ చెక్‌డ్యాం పరిసరాల్లో వెతకగా దుర్గేశ్ బట్టలు ఒడ్డున కనిపించాయి. దీంతో ఏడుపాయల సిబ్బందికి సమాచారం అందించగా గజ ఈతగాళ్లు చెక్‌డ్యాంలో వెతికి దుర్గేశ్ శవాన్ని బయటకు తెచ్చారు. వెంట వచ్చిన బావమర్ధి దుర్గమ్మ తల్లి దర్శనం కాకుండానే దుర్మరణం చెందడంతో శ్రీనివాస్ కన్నీరు మున్నీరయ్యాడు. తమ బతుకులు బాగుచేస్తాడనుకున్న దుర్గేశ్ మరణ వార్త భార్య లలిత, తండ్రి బాలయ్య, తల్లి తులసమ్మలకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. దుర్గేశ్‌కు కొడుకు, కూతురు ఉన్నట్లు తెలిసింది. -
ఏడుపాయల అభివృద్ధికి కృషి
పాపన్నపేట(మెదక్): తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని కలెక్టర్ «ధర్మారెడ్డి ప్రకటించారు. ఆదివారం ఆయన మొదటి సారి ఏడుపాయలకు వచ్చి దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పాలక వర్గ చైర్మన్ ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు శాస్త్రయుక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ఏడుపాయల పూర్వ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, వాటి ఆదాయ మార్గాలు, సిబ్బంది సంఖ్య, సేవలు, భక్తులకు మౌలిక సౌకర్యాల గురించి అడిగి తెలసుకున్నారు. బకాయిలు చెల్లించాలి.. చైర్మన్ మాట్లాడుతూ ఏడుపాయలకు 12.5 ఎకరాల అటవీ భూమి అవసరమైనందున, ఈ మేరకు అటవీభూమిని కేటాయించాల్సిందిగా కోరారు. అయితే ఈ విషయమై అటవీ శాఖ అధికారులతో మాట్లాడుతానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఏడుపాయలకు ఏటా వచ్చే ఆదాయం, ఖర్చు, నగదు డిపాజిట్లు, చేపట్టిన మౌలిక సౌకర్యాల గురించి ఆరా తీశారు. మొండి బకాయిలపై అవసరమైతే పోలీసు కేసులు నమోదు చేయించాలన్నారు. ఏడుపాయల్లో పరిశుద్ధ్యాన్ని పరిరక్షించేందుకు ప్లాస్టిక్ నిషేధించాలని ఆదేశించారు. ఇందులో తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలని సూచించారు. అనంతరం ఘనపురం ఆనకట్టను పరిశీలించారు. ప్రాజెక్టు నిల్వ నీటి సామర్థ్యం, నీటి విడుదల తదితర విషయాలను తెలసుకున్నారు. కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ మెంచు నగేశ్, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ ప్రసాద్, ఈఓ వెంకట్ కిషన్‌రావు, డైరెక్టర్లు జ్యోతి అంజిరెడ్డి, దుర్గయ్య, నాగప్ప, నారాయణ, సంగప్ప, గౌరీ శంకర్, గౌరీశంకర్, సిబ్బంది రవికుమార్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
వరద దెబ్బకు ఏడుపాయల విలవిల
కూలిపోయిన బ్రిడ్జి.. పడి పోయిన గ్రిల్లింగ్ కొట్టుకుపోయిన హుండీలు..కూలిన స్తంభాలు వనదుర్గా ఆలయం అస్తవ్యస్తం సుమారు రూ.15 లక్షల నష్టం దెబ్బతిన్న ప్రదేశాన్ని పరిశీలించిన డీఎస్పీ, ఈఓ పాపన్నపేట:వరద ఉధృతికి ఏడుపాయల విలవిల్లాడింది. ఆలయం అంతా అస్తవ్యస్తంగా మారింది. కూలిపోయిన బ్రిడ్జి.. పడిపోయిన గ్రిల్లింగ్..కొట్టుకుపోయిన హుండీలు..కుప్పకూలిన క్యూలైన్లు..నేలకూలిన విద్యుత్ స్తంభాలు..విరిగిన ఫ్యాన్లు.. వారం రోజుల పాటు మంజీరా వరదల్లో మునిగి శుక్రవారం వెలుగు చూసిన ఏడుపాయల ఆలయ పరిస్థితి ఇది. ఈ వరదల విలయంలో దాదాపు రూ 15 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలో తేలిందని ఈఓ వెంకటకిషన్‌రావు తెలిపారు.అనంతరం మెదక్ డీఎస్పీ నాగరాజు, మెదక్ రూరల్ సీఐ రామకృష్ణ, పాపన్నపేట ఎస్ఐ సందీప్‌రెడ్డి ఏడుపాయల్లోని పరిస్థితులను పరిశీలించారు. ఇటీవల ఎడతెరిపి లేనివర్షాలు పడటం..అదే సమయంలో సింగూరు నుంచి నీరు సుమారు 1.60 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయడంతో మంజీరమ్మ మహోగ్రరూపందాల్చి ఘనపురం ఆనకట్టపై నుంచి 6 ఫీట్ల ఎత్తున పొంగిపొర్లింది. దిగువన ఉన్న ఏడుపాయల దుర్గమ్మ ఆలయాన్ని ముంచెత్తింది. దీంతో ఆలయం సుమారు 75 శాతం వరదల్లో మునిగి పోయింది. వరద తాకిడికి ఆలయం ముందు ఉన్న బ్రిడ్జి కూలిపోయింది.క్యూలైన్లు కుప్ప కూలాయి. ఆలయంలో చుట్టూర ఉన్న గ్రిల్లింగ్ కొట్టుకు పోయింది.అమ్మవారి హుండీలు కొట్టుకుపోయాయి. ఆలయంమధ్యలో ఉన్న గ్రానైట్‌రాళ్లు అడ్రస్ లేకుండా పోయాయి.ఆలయం గ్రిల్లింగ్ చుట్టు గడ్డి పేరుకు పోయింది.కాగా అమ్మవారి విగ్రహానికి మాత్రం ఎలాంటి నష్టం జరుగలేదు. సుమారు రూ15 లక్షల ఆస్తినష్టం వరదల వల్ల సుమారు రూ.15 లక్షల ఆస్తినష్టం జరిగిందని ఈఓ వెంకటకిషన్‌రావు తెలిపారు.శుక్రవారం ఆయన మెదక్ డీఎస్పీ నాగరాజు, సీఐ రామకృష్ణ, ఎస్ఐ సందీప్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి సిబ్బందితో కలిసి ఆలయ పరిసరాలను సందర్శించి నష్టాన్ని అంచనావేశారు. నిధుల మంజూరుకు డిప్యుటీ స్పీకర్ హామీ వరదల వల్ల దెబ్బతిన్న దుర్గమ్మ ఆలయానికి మరమ్మతులు చేయడానికి ఎన్ని నిధులైనా మంజూరి చేయడానికి డిప్యుటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు ఈఓ వెంకటకిషన్‌రావు తెలిపారు. నీటి ప్రవాహం తగ్గాకే ఆలయానికి అనుమతి ఏడుపాయల ఆలయం ముందు పూర్తి నీటి ప్రవాహం తగ్గాకే భక్తులకు అనుమతి ఇస్తామని మెదక్ డీఎస్పీ నాగరాజు తెలిపారు.అంతలోగా ఆలయ మరమ్మతులు జరుగుతాయన్నారు. \ -
ఆ 24 మంది క్షేమం.. సీఎం కేసీఆర్ ఆనందం!
మెదక్: వరద నీటి ఉధృతిలో చిక్కుకొని బిక్కుబిక్కుమంటున్న 24 మందిని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) సురక్షితంగా కాపాడింది. మెదక్ జిల్లా ఏడుపాయల గ్రామం సమీపంలో వరద నీటిలో మధ్యలో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతానికి చేర్చింది. మంజీర నది రెండు పాయల మధ్య ఉన్న బోడెలో బ్రిడ్జి నిర్మాణం సాగుతోంది. ఈ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కూలీలు పాల్గొంటున్నారు. అక్కడే తాత్కాలిక నివాసం ఏర్పరుచుకొని పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా భారీ వర్షాలతో వరదలు చుట్టుముట్టాయి. దీంతో ప్రాణాలు అరచేత పట్టుకొని తమను కాపాడేవారి కోసం వారు ఎదురుచూస్తున్నారు. వారిని హెలికాప్టర్లో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఐఏఎఫ్ సిబ్బంది శనివారం ప్రయత్నించినప్పటికీ వాతావరణం బాగాలేకపోవడంతో కుదరలేదు. వరద ఉధృతిలో చిక్కుకుపోయిన ఒడిశా, మధ్యప్రదేశ్ కూలీలను హెలికాప్టర్లో సురక్షితంగా తరలించడంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆనందం వ్యక్తం చేశారు. కూలీలు చిక్కుకుపోయిన విషయంలో సీఎం కేసీఆర్ జోక్యంచేసుకోవడంతో వారిని కాపాడేందుకు ఐఏఎఫ్ రంగంలోకి దిగిందని సీఎంవో ట్విట్టర్లో తెలిపింది. ఇక, గతకొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలం అవుతోంది. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిప్రవహిస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో జిల్లాల్లో మంత్రి హరీష్ రావు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. -
దుర్గమ్మను దర్శించుకున్న హీరో శ్రీకాంత్
మెదక్ : మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయలలో కొలువైన దుర్గమ్మను టాలీవుడ్ సినీ హీరో శ్రీకాంత్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ఆలయానికి వచ్చిన హీరో శ్రీకాంత్‌కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం దుర్గమ్మకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు శ్రీకాంత్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు. -
వనమార్గం... ఏడుపాయల...
మనదగ్గరే...! తెలుగు రాష్ట్రాలలో ఒక్కో జిల్లాలో ఒక్కో విశిష్టత ఉన్న దేవాలయాలు, దర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయి. మెదక్ జిల్లాలో వైవిధ్యం కల దర్శనీయ క్షేత్రం ఏడుపాయల. ఇక్కడ వనదుర్గా భవాని మాత కొలువై ఉండటంతో ఏడుపాయల వనదుర్గా భవాని మాతగా ఖ్యాతి గడించింది. ఘనపూర్ ఆనకట్ట సమీపంలో పర్వతారణ్యాల మధ్య మంజీర నది తీరాన ఉండంతో ఏడుపాయల క్షేత్రం అత్యంత ప్రాశస్త్యాన్ని పొందింది. ఇక్కడ మరో ఆరు చిన్న వాగులు మంజీరా నదిలో కలుస్తుంటాయి. దీంతో ఈ క్షేత్రం ఏడుపాయలుగా ప్రసిద్ధి చెందింది. ఈ ఏడుపాయలను నాటి రోజుల్లో జమదగ్ని, అత్రి, కాశ్యపి, విశ్వామిత్ర, వశిష్ట, భరద్వాజ, గౌతమి అనే సప్తరుషుల పేర్లతో పిలిచేవారు. ఎన్నో కథనాలు... గరుడగంగగా పిలువబడే మంజీరా నది పుట్టుక, ఏడుపాయలుగా చీలిపోవడం గురించి భిన్న కథనాలున్నాయి. జనమేజయ మహారాజు తన తండ్రి పరీక్షిత్తు మరణానికి కారణమైన సర్పజాతినంతటిని అంతం చేయాలని సప్తరుషులతో యాగం చేయించాడని, ఆ యాగం జరిగిన ప్రదేశమే నేటి ఏడుపాయల అని చెబుతుంటారు. ఇక్కడ ఉన్న రాళ్లపై గుండ్రటి ఆకారంలో గుంతలు ఉంటాయి. ఈ క్షేత్రానికి కొద్ది దూరంలో ఉన్న ఎల్లాపూర్ గ్రామ పరిసరాల్లో మంజీరా నది ఒడ్డున ఇసుక మేటలు తవ్వితే విభూతి మాదిరిగా ఉండే తెల్లటి మట్టి కనిపిస్తుంది. దీని ఆధారంగా ఇక్కడే యాగం జరిగిందంటారు. మరో కథనం ప్రకారం సర్పజాతికి మోక్షం ప్రాప్తించడానికి గరుత్మంతుడు గంగాదేవి వద్దకు వెళితే, ఆమె తన అందె (మంజీరం) గరుత్మంతునికి ఇచ్చి దానిని తీసుకొని ముందుకు వెళుతుంటే తాను అనుసరిస్తానని చెప్పిందట. ఈ క్రమంలో మంజీరా నది ఏడుపాయలుగా చీలి సర్పయాగ స్థలం వద్ద ఉరుకులు పరుగులు తీసింది అని, ఆ పుణ్యనదీ జలాల స్పర్శతో మృత్యువాత పడిన సర్పాలకు ఊర్ధ్వలోకం ప్రాప్తించిందని చెబుతారు. అందుకే ఏడుపాయల క్షేత్రలో మాఘ అమావాస్య రోజున పుణ్యనది స్నానాలు చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. గుర్తులెన్నో చూపే గుహాలయం... ముందుగా వనదుర్గాభవాని మాతను దర్శించుకోవడానికి భక్తులు ఇక్కడ పాపాల మడుగులో స్నానాలాచరిస్తుంటారు. ఇంకా ఏకోత్తర శతకుండలం, మునిపుట్ట, తపోభూమి సందర్శించవచ్చు. పూర్వకాలంలో ఈ ప్రాంతం ఒక గుహాలయంగా ఉండేది. కాలక్రమంలో గుహలను తొలచి ఆలయంగా తీర్చిదిద్దారు. ఈ గుహాలయం నదీ తీరాన దిగువభాగంలో ఉండగా దీని పైభాగాన ఒక పుట్ట, ఆ పుట్టకు సమీపాన ఒక చిన్న గుహ ఉంది. ఈ గుహలోనే పూర్వం మునులు తపస్సు చేశారని చెబుతారు. అలనాటి మునులకు చిహ్నంగా ఇక్కడ ఒక ముని విగ్రహం కూడా ఉంది. భక్తులు ముందు వనదుర్గాభవానిని దర్శించి, తర్వాత కొండపైకి వెళ్లి ముని విగ్రహాన్ని, గుహను, మునిపుట్టను దర్శిస్తారు. ఇలా వెళ్లచ్చు... జిల్లాలోని పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లి గ్రామంలో వనదుర్గ కొలువై ఉంది. మెదక్ జిల్లా నుండి 20 కి.మీ దూరం, సంగారెడ్డి నుండి 90 కి.మీ, హైదరాబాద్ నుండి 130 కి.మీ దూరంలో ఏడుపాయల ఉంది. ఈ ప్రాంతానికి చేరుకోవాలనుకునేవారికి హైదరాబాద్, సంగారెడ్డి నుండి బస్సు సౌకర్యం ఉంది. - డి. శ్రీనివాస్, పౌరసంబంధాల శాఖ, సంగారెడ్డి, మెదక్ జిల్లా -
ధూంధాంగా ఏడుపాయల జాతర
పాపన్నపేట: ‘‘మాస్టర్ ప్లాన్‌తో ఏడుపాయలకు మెరుగులు దిద్దుతాం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక జరుగుతున్న తొలి అతిపెద్ద జాతర ఏడుపాయలే. ఇక నుంచి ఏడుపాయల వనదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తాం. మాస్టర్ ప్లాన్ సర్వే కోసం రూ.20 లక్షలు తక్షణమే మంజూరు చేస్తున్నాం. జానపదుల జాతరగా పేరొందిన ఏడుపాయల జాతరను ధూంధాంగా నిర్వహించి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేందుకు శాయశక్తులా కృషి చేస్తాం’’ అని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఏడుపాయల్లో మాఘ అమావాస్య ఉత్సవాలను ప్రారంభించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఏడుపాయల జాతరను తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబంగా నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు ఎస్.కుమార్ ఆర్కిటెక్చర్ కంపెనీతో ఒప్పందం జరిగినట్లు చెప్పారు. వెంటనే యాక్షన్‌ప్లాన్ తయారు చేసేందుకు ప్రభుత్వం తరఫున రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి అతిపెద్ద జాతర ఏడుపాయల జాతరేనన్నారు. ఇకనుంచి ప్రతి మహాశివరాత్రి జాతరకు ప్రభుత్వం తర ఫున దుర్గమ్మతల్లికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామని, ఈ మేరకు దేవాదయ శాఖ మంత్రితో మాట్లాడామని చెప్పారు. ఈ మహాజాతరను కన్నుల పండువగా నిర్వహించేందుకు ఈనెల 24న కలెక్టర్, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక నుంచి ప్రతిరోజు ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏడుపాయల్లో విశాలమైన రోడ్లు, అందరికీ సరిపడ తాగునీరు, విద్యుత్ కాంతులు, పచ్చని హరిత వనాలు ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. జైకా నిధుల కింద అమ్మవారి ఆలయం ఎదుట బ్రిడ్జిని, 33/11కేవీ సబ్‌స్టేషన్‌ను, ఔట్‌పోస్టును ఏర్పాటు చేస్తామన్నారు. వనదుర్గ ప్రశస్తిని తెలంగాణలోని పల్లెపల్లెకూ విస్తరింపజేస్తామన్నారు. అమ్మవారి పవిత్రతను కాపాడుతూ యజ్ఞశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. డిప్యూటీ స్పీకర్ వెంట పాలక మండలి చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఆర్డీఓ మెంచు నగేష్, ఈఓ వెంకట కిషన్‌రావులు ఉన్నారు. -
ఏడుపాయల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాపన్నపేట: ఏడుపాయలను పర్యాటక కేంద్రంగా...ఆధ్యాత్మిక నిలయంగా మారుస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆమె హైదరాబాద్ - ఏడుపాయల బస్సును ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటోందన్నారు. ఏడుపాయల అభివృద్ధికోసం ఇప్పటికే ఓ మాస్టర్ ప్లాన్ రూపొందించామని, అందుకనుగుణంగా పనులు ప్రారంభించినట్లు చెప్పారు. రోడ్డు వెడల్పు కోసం పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. ఏడుపాయల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, కాటేజీలు నిర్మిస్తామన్నారు. ఘనపురం ఆనకట్టను అభివృద్ధి చేసి పర్యటన క్షేత్రంగా తీర్చిదిద్దుతామన్నారు. స్నానఘాట్లు ఏర్పాటు చేస్తామని, హోమశాల నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. టీఆర్ఎస్ సర్కార్ అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. మెదక్ జిల్లాలో తాగునీటికోసం మూడు గ్రిడ్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. అర్హులందరికీ పింఛన్లు, ఆహారభద్రత కార్డులు అందజేయనున్నట్లు డిప్యూటీ స్పీకర్ తెలిపారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పింఛన్ల పంపిణీ ఏడుపాయల దుర్గమ్మ తల్లికి పూజలు చేసిన అనంతరం పద్మాదేవేందర్‌రెడ్డి మండలంలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. మిన్పూర్లో తాగునీటి పథకానికి శంకుస్థాపన, తమ్మాయిపల్లిలో పింఛన్ల పంపిణీ, చీకోడ్, కొంపల్లి, రాంతీర్థం గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ పవిత్ర దుర్గయ్య, జెడ్పీటీసీ స్వప్న, టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్, కోకన్వీనర్, ఆశయ్య, విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్‌లు వెంకట్రాములు, విజయలక్ష్మి , ప్రతాప్‌రెడ్డి, సంజీవరెడ్డి, ఈఓ వెంకట కిషన్‌రావు, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, మంగ రమేష్, చింతల నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
ఏడుపాయల వద్ద భక్తులపై కాల్పులు
-
మెదక్ జిల్లా ఏడుపాయల వద్ద భక్తులపై కాల్పులు
మెదక్: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గామాత ఆలయం వద్ద గుర్తుతెలియని దుండగులు భక్తులపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడ్డ ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఓ కుటంబమే లక్ష్యంగా దాడి చేసినట్టు అనుమానిస్తున్నారు. దుండగులు వాది వద్ద నుంచి 14 తులాల బంగారం దోచుకెళ్లారు. బాధితులు నిజామాబాద్ కు చెందినవారిగా గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.