
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న మంత్రి హరీశ్‌రావు దంపతులు
పాపన్నపేట(మెదక్): గోదావరి జలాలతో ఏడుపాయల దుర్గమ్మ కాళ్లు కడుగుతామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున వన దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించి మెదక్ జిల్లా పాపన్నపేటలో ఏడుపాయల జాతరను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ మదిలో ఊపిరి పోసుకున్న అద్భుతమైన ఆలోచన కాళేశ్వరం ప్రాజెక్టు అని నేడు అది శివుడి జడల నుంచి గంగమ్మ పొంగి పొర్లినట్లు, 618 మీటర్ల ఎత్తుకు నీటిని పంపిణీ చేస్తుందన్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్, కొండపోచమ్మల నుంచి సింగూరు ప్రాజెక్టుకు నీరు వస్తుందని, దీంతో మంజీర పాయల్లో గోదావరి జలాలు పరుగులు తీసి దుర్గమ్మ ఆలయాన్ని తాకుతూ ముందుకు పరుగులు పెడతాయన్నారు. మెతుకుసీమలో నీటి కరువు ఉండదని 10 జిల్లాలు లబ్ధి పొందుతాయన్నారు. రాష్ట్రంలో పర్యాటక కేంద్రాల అభివృద్ధి కోసం రూ.1,500 కోట్లు కేటాయించారని అందులో నుంచి ఏడుపాయల, ఘనపురం ప్రాజెక్టు అభివృద్ధికి రూ.100 కోట్లు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారని తెలిపారు.
ప్రతీ జాతరకు రూ. కోటి: తలసాని
పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ హేమలత, కలెక్టర్ హరీశ్ జాతర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రతీ ఏడుపాయల జాతరకు ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేస్తుందన్నారు. ఏడుపాయల ఆదాయం కూడా పెరిగిందని, మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చొరవతో ఏడుపాయల పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment