ఆ 24 మంది క్షేమం.. సీఎం కేసీఆర్‌ ఆనందం! | 24 workers stranded at Edupayala stream lifted by Air Force helicopter | Sakshi
Sakshi News home page

ఆ 24 మంది క్షేమం.. సీఎం కేసీఆర్‌ ఆనందం!

Published Sun, Sep 25 2016 5:05 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

ఆ 24 మంది క్షేమం.. సీఎం కేసీఆర్‌ ఆనందం! - Sakshi

ఆ 24 మంది క్షేమం.. సీఎం కేసీఆర్‌ ఆనందం!

మెదక్‌: వరద నీటి ఉధృతిలో చిక్కుకొని బిక్కుబిక్కుమంటున్న 24 మందిని భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) సురక్షితంగా కాపాడింది. మెదక్‌ జిల్లా ఏడుపాయల గ్రామం సమీపంలో వరద నీటిలో మధ్యలో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్‌ ద్వారా సురక్షిత ప్రాంతానికి చేర్చింది. మంజీర నది రెండు పాయల మధ్య ఉన్న బోడెలో బ్రిడ్జి నిర్మాణం సాగుతోంది. ఈ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఒడిశా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన కూలీలు పాల్గొంటున్నారు. అక్కడే తాత్కాలిక నివాసం ఏర్పరుచుకొని పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా భారీ వర్షాలతో వరదలు చుట్టుముట్టాయి.

దీంతో ప్రాణాలు అరచేత పట్టుకొని తమను కాపాడేవారి కోసం వారు ఎదురుచూస్తున్నారు. వారిని హెలికాప్టర్‌లో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఐఏఎఫ్‌ సిబ్బంది శనివారం ప్రయత్నించినప్పటికీ వాతావరణం బాగాలేకపోవడంతో కుదరలేదు. వరద ఉధృతిలో చిక్కుకుపోయిన ఒడిశా, మధ్యప్రదేశ్‌ కూలీలను హెలికాప్టర్‌లో సురక్షితంగా తరలించడంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ఆనందం వ్యక్తం చేశారు. కూలీలు చిక్కుకుపోయిన విషయంలో సీఎం కేసీఆర్‌ జోక్యంచేసుకోవడంతో వారిని కాపాడేందుకు ఐఏఎఫ్‌ రంగంలోకి దిగిందని సీఎంవో ట్విట్టర్‌లో తెలిపింది.

ఇక, గతకొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్‌ జిల్లా అతలాకుతలం అవుతోంది. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిప్రవహిస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో జిల్లాల్లో మంత్రి హరీష్‌ రావు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement