ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి
ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి
Published Sun, Mar 19 2017 10:59 PM | Last Updated on Mon, Aug 20 2018 5:04 PM
- ఎవరైనా కించపరిచేలా మాట్లాడితే సహించం
- ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు సంతకాల సేకరణ
- ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు టీజీ భరత్
కర్నూలు(అర్బన్): ఆర్యవైశ్యుల్లోని పేదల అభ్యున్నతికి కృషి చేస్తామని ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు టీజీ భరత్ తెలిపారు. ఆర్యవైశ్యులను కించపరిచేలా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. స్థానిక హోటల్ మౌర్యాఇన్ పరిణయ హాలులో ఆదివారం జిల్లా ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు దేశంలోనే ప్రత్యేక స్థానం ఉందన్నారు. నిజాయతీగా పన్నులు చెల్లించేది ఆర్యవైశ్యులే అయినా అనేక మంది పేదలున్నారని, వారి కోసం రూ.1000 కోట్లతో ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం అవసరమైతే లక్షల సంఖ్యలో సంతకాలు సేకరించడంతో పాటు పాలక, ప్రతిపక్ష నేతలకు ఉత్తరాలు రాస్తామని తెలిపారు. డిమాండ్ల సాధన కోసం విజయవాడలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
తక్కువ శాతం ఉన్న బ్రాహ్మణులకు రూ.75 కోట్లు, కాపులకు రూ.1000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం 10 శాతంగా ఉన్న ఆర్యవైశ్యులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి తీరాలన్నారు. ఈ నేపథ్యంలోనే సమితి నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికైన ఇల్లూరు సుధాకర్, ఎం విఠల్‌శెట్టి, కోశాధికారి సత్యనారాయణ, అదనపు కార్యదర్శిగా జవహర్‌బాబుతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇల్లూరు లక్ష్మయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఇల్లూరు సుధాకర్ మాట్లాడుతూ పేద ఆర్యవైశ్యులకు ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా కృషి చేస్తామన్నారు. ఉన్నత విద్య కోసం పేద విద్యార్థులకు పూచీకత్తు లేకుండా బ్యాంకు రుణాలు ఇప్పిస్తామన్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇల్లూరు లక్ష్మయ్య మాట్లాడుతూ చిన్న వ్యాపారులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలన్నారు. ఆర్యవైశ్యులను ఎకనామికల్ బ్యాక్‌వర్డ్‌గా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన మండల కమిటీ నేతలతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో టీజీ శివరాజ్, పెండేకంటి కిరణ్, విట్టా రమేష్, మహిళా అధ్యక్షురాలు టి. జ్ఞానేశ్వరి, పట్టణ అధ్యక్షుడు సోమిశెట్టి కిరణ్, ఇల్లూరు రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Advertisement