మంచినీటి సమస్య పరిష్కారానికి కృషి
- కర్నూలు ఎంపీ బుట్టా రేణుక
హాలహర్వి/ఆలూరు: కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. సోమవారం హాలహర్వి, బాపురం, గూళ్యం గ్రామాల్లో ఆమె పర్యటించారు. ముందుగా హాలహర్విలో వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఊరేగింపుగా వెళ్లారు. హాలహర్విలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు దాదాపు రూ.6 కోట్లు కేంద్రం నిధులతో మంచినీటి సమస్య పరిష్కారానికి బోర్లు వేయించామన్నారు. గ్రామీణప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులను మంజూరు చేయించామన్నారు. క్షేత్రగుడి నుంచి మోకా మీదుగా బళ్లారికి వెళ్లే 3 కి.మీ. రోడ్డు నిర్మాణానికి కేంద్రం నిధులు రూ.6 కోట్లు మంజూరయ్యాయన్నారు. కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఖర్చు చేయడం సీఎం చంద్రబాబునాయుడుకే చెల్లిందన్నారు. అమరావతి జపం చేస్తూ రైతులను చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. గూళ్యం వేదావతి నదిపై ప్రాజెక్టు నిర్మాణానికి, కర్ణాటక, ఆంధ్ర సరిహద్దు మధ్య బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. గూళ్యంలో ఎంపీ నిధుల కింద రూ.24 లక్షలతో ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలపై వివక్ష
సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలపై వివక్ష చూపుతున్నారని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆరోపించారు. వేదావతి నదిపై ప్రాజెక్టు నిర్మాణానికి రూ.600 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి మాటతప్పారన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను, పొదుపు మహిళలను మోసం చేశారన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను అవినీతి డబ్బుతో కొనుగోలు చేస్తూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. హంద్రీనీవాకు నీటిని విడుదల చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కిందన్నారు. రెండున్నరేళ్ల పాలనలో చంద్రబాబు.. ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఎంపీపీ బసప్ప, వైఎస్ ఎంపీపీ కల్యాణ్‌గౌడ్, హాలహర్వి, హోళగుంద మండలాల కన్వీనర్లు భీమప్పచౌదరి, షఫీఉల్లా, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు, కోనంకి జనార్దన్‌నాయుడు, నాయకులు విక్రాంత్‌రెడ్డి, అర్జున్, సిద్దప్ప, గాదిలింగప్ప, దిబ్బలింగ తదితరులు పాల్గొన్నారు.