ప్ర‘జల’ కష్టం పట్టదా?
ప్ర‘జల’ కష్టం పట్టదా?
Published Sat, Apr 22 2017 10:47 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM
పాలకులకు ముందుచూపులేకపోవడంతోనే నగరంలో తాగునీటి సమస్య
– హంద్రీజలాల వినియోగంలో నిర్లక్ష్యం
– కర్నూలు నగరంలో నీటి సమస్యపై 24న కలెక్టరేట్ వద్ద ధర్నా
– ధర్నాను జయప్రదం చేయండి
- ప్రజలకు, పార్టీశ్రేణులకు వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పిలుపు
కర్నూలు(ఓల్డ్‌సిటీ): కర్నూలు నగరంలో మంచినీటి ఎద్దడితో ప్రజలు పడుతున్న ఇబ్బందులు పాలకులు, అధికారులకు పట్టడం లేదని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి విమర్శించారు. దీనికంతటికి వారికి ముందుచూపు లేకపోవడమే కారణమని ఆరోపించారు. పక్కన నదులు పారినా నీటిని ఎందుకు నిల్వ చేసుకోలేకపోయారని ప్రశ్నించారు. నీటి సమస్య పరిష్కారానికి ఈనెల 24వ తేదీ ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. శనివారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
గౌరు వెంకటరెడ్డితో పాటు పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది నీటి ఎద్దడి నెలకొందన్నారు. హంద్రీ జలాలు వాడుకునేందుకు మూడు నెలల క్రితమే అవకాశం ఉన్నా పాలకులు పట్టించుకోలేదని మండిపడ్డారు. నాయకులు, కార్యకర్తలు 24న ఉదయం 9.00 గంటలకు పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని, అక్కడి నుంచి 10 గంటలకు ర్యాలీగా కలెక్టరేట్‌కు బయలుదేరుతామన్నారు. 10.30 నుంచి 11.30 గంటల ప్రాంతంలో ధర్నా ఉంటుందన్నారు.
నీటి విడుదలలో వివక్ష- ఎమ్మెల్యే గౌరుచరిత
నగరానికి మంచినీటి సమస్య పొంచి ఉన్న విషయాన్ని జనవరి నెల నుంచే అధికారుల దృష్టికి తీసుకెళుతున్నా పట్టనట్లు వ్యవహరించారని పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి మండిపడ్డారు. అరోరానగర్‌కు నీరు సరఫరా అయి మాధవీనగర్‌కు రాకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. అధికారులు నీటిసరఫరాలో పక్షపాతం వహిస్తున్నారని, అశోక్‌నగర్, ఎన్నార్‌పేటలో మాత్రం కొరత లేకుండా చూసుకుంటున్నారని ఆరోపించారు. కల్లూరు అర్బన్ పరిధిలోని 14 వార్డుల ప్రజలు నీటిపన్ను కట్టడం లేదా అని ప్రశ్నించారు.
అధికారులకు తెలియదా?కొత్తకోట
అక్టోబర్ తర్వాత వర్షాలు రాలేదని, నగరానికి నీటి సమస్య ఏర్పడుతుందని అధికారులకు ముందే తెలియదా అని మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి ప్రశ్నించారు. సమస్య పరిష్కారానికి కలిసికట్టుగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
నీళ్లకంటే మద్యం పుష్కలం
చంద్రబాబు పాలనలో మంచినీళ్ల కంటే మద్యం పుష్కలంగా లభిస్తుందని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య ఎద్దేవా చేశారు. కర్నూలు ఎమ్మెల్యే సమ్మర్ స్టోరేజీ, సుంకేసులప్రాజెక్టును పరిశీలించడం తప్ప ఏం చేశారని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం ఆదాయ మార్గాలకు ఇచ్చే ప్రాధాన్యత ప్రజల కష్టాలకు ఇవ్వదన్నారు.
వాటర్ మేనేజ్‌మెంట్ పాటించడం లేదు..
అధికారులు వాటర్ మేనేజ్‌మెంట్ పాటించడం లేదని పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ విమర్శించారు. 10 నిమిషాలసేపు వచ్చే నీటి కోసం ప్రజలు రాత్రంతా జాగరణలు చేస్తున్నారని, రోజూ సరఫరా చేస్తున్నట్లు పాలకులు ప్రకటించుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
అధికారుల మెడలు వంచుదాం
మంచినీటి సమస్యపై భారీ ధర్నా నిర్వహించి అధికారుల మెడలు వంచుదామని పార్టీ నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్ పేర్కొన్నారు. వినతులు ఇస్తే అధికారులు మాట వినడం లేదన్నారు.
దోమల నివారణ తరహాలో ఉద్యమిద్దాం..
దోమల నివారణ కోసం చేపట్టిన మహాధర్నా తరహాలోనే పార్టీ శ్రేణులు మంచినీటి ఎద్దడిపై గళం విప్పాలని పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి, సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యంయాదవ్, మైనారిటీసెల్, ఎస్సీసెల్‌ల రాష్ట్ర కార్యదర్శులు ఎస్.ఎ.రహ్మాన్, సి.హెచ్.మద్దయ్యలు, మైనారిటీసెల్, కిసాన్‌సెల్‌ల రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు బి.జహీర్‌అహ్మద్‌ఖాన్, పిట్టం ప్రతాప్‌రెడ్డిలు, మైనారిటీసెల్ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శౌరి విజయకుమారి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ నగర నాయకులు ఈశ్వర్, మహేశ్వరరెడ్డి, ఎస్.ఎ.అహ్మద్, బుజ్జి, సఫియాఖాతూన్, మంగమ్మ, విజయలక్ష్మి, వాహిద, పేలాల రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Advertisement