ఏమిటీ అరాచకం
ఏమిటీ అరాచకం
Published Fri, Oct 21 2016 1:18 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
తాడేపల్లిగూడెం : రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని.. టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు నియంతృత్వ ధోరణితో ప్రజలు, ప్రతిపక్ష నేతలపై దమనకాండకు పూనుకుంటున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని ధ్వజమెత్తారు. గురువారం తాడేపల్లిగూడెంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ బ్లాక్‌మెయిలింగ్ విధానాలను మానుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ అరాచకాలకు పాల్పడుతోందని, ప్రశాంతంగా ఉండే మన జిల్లాలోనూ ఇటీవల ప్రజలు, వారిపక్షాన పోరాడుతున్న ప్రతిపక్ష నాయకులపై
కేసులు పెడుతూ బ్లాక్‌మెయిలింగ్ రాజ కీయాలకు పాల్పడుతున్నారని నాని ఆందోళన వ్యక్తం చేశారు. తుందుర్రు ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజలపైన, పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులపైన, ఇసుక మాఫియాను అడ్డుకుంటూ ప్రజల పక్షాన ఉంటూ వారికి న్యాయం చేయాలని కోరుతున్న వైఎస్సార్ సీపీ నాయకులపైన టీడీపీ ప్రజాప్రతిని« దులు విరుచుకుపడుతూ భయాందోళనలు రేకెత్తిస్తున్నారన్నారు. ఇలాంటి ఘటనల్ని సహిం చేది లేదని, సామాన్య ప్రజలపైన, తమ పార్టీకి చెందిన వారిపైన దాడులు జరిగితే పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందిస్తారని చెప్పారు.
మంత్రివర్యా.. ఇది తగునా
తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న విషయంలో దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జోక్యం చేసుకుని.. ప్రతిపక్ష నాయకుడైన మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణపై హత్యాయత్నం కేసు పెట్టించి అరెస్ట్ చేయాలని పోలీసుల్ని ఉసిగొల్పడం దారుణమని ఆళ్ల నాని ధ్వజమెత్తారు. తుందుర్రులో 144 సెక్షన్ అమలు, సామాన్యుల్ని అక్రమంగా జైలుకు పంపడం, ఇసుక మాఫియాను నిలదీస్తే కేసులు పెట్టడం, పుట్టిన రోజు వేడుక సందర్భంగా ఫ్లెక్సీలు కట్టుకునే విషయంలో రాజకీయం చేసి వైఎస్సార్ సీపీ నాయకులపై దాడులకు తెగబడటం, వారిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసులు పెట్టడం వంటి ఘటనలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఫ్లెక్సీ కట్టుకునే విషయంలో మంత్రి మాణిక్యాలరావు పోలీసులను అసభ్య పదజాలంతో దూషించి వారిని పావులుగా వాడుకుంటున్నారన్నారు. ఈ వివాదంలో ఇరువర్గాలపై కేసులు పెట్టకుండా కేవలం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను ఏ1గా పేర్కొంటూ మరో ఏడుగురు కార్యకర్తలపైనే కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. మరో వర్గానికి చెందిన ఏ నాయకుడిపై కేసు నమోదు చేశారో పోలీసులు చెప్పాలన్నారు. మంత్రి హోదాలో ఉన్న మాణిక్యాలరావుకు ఇలాంటి దిగజారుడు రాజకీయాలు తగవన్నారు. ఫ్లెక్సీలు కట్టుకునే విషయంలో అభ్యంతరాలుంటే చెప్పాలే గానీ.. దాడులు చేసి పోలీసులను ఉసిగొల్పి కేసులు పెట్టడం దారుణమన్నారు. దాడులు, వేధింపులు, నియంతృత్వ ధోరణుల్ని తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు. పోలీసులు కూడా అధికారపక్ష సభ్యులకు వంత పాడకుండా న్యాయబద్ధంగా వ్యవహరించాలని సూచించారు.
గౌరవించే సంస్కృతి ఉండాలి
వైఎస్సార్ సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త వంకా రవీంద్ర మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నా.. ప్రజాప్రతినిధులు వాటిని గాలికొదిలి వివాదాలకు వెళితే ప్రజలు హర్షించరన్నారు. ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో ప్రతిపక్ష సభ్యుల్ని శత్రువుల్లా చూడకుండా వారిని గౌరవించాలని చెప్పారని గుర్తు చేశారు. అటువంటి సంస్కృతి అలవర్చుకోవాలని సూచించారు. బీజేపీకి చెందిన మంత్రి మాణిక్యాలరావు విరుద్దంగా ప్రవర్తించడం తగదన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు హర్షించేలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణపై కేసులు పెట్టాలనడం వివేకవంతుడి లక్షణం కాదన్నారు.
బీజేపీ కార్యకర్తలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు
తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ అభివృద్ధి విషయమై తనను ఎదుర్కోలేక ఫ్లెక్సీలు చింపడం వంటి చౌకబారు పనులతో బీజేపీ కార్యకర్తలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారన్నారు. ఇరువర్గాలు తీవ్ర ఘర్షణపడి ఉంటే రెండు వర్గాలకు చెందిన ఫ్లెక్సీలు పాడయ్యేవన్నారు. తాడేపల్లిగూడెంలో ఫెక్సీల సంస్కృతి ఎప్పటినుంచో ఉందని, తాను పుట్టిన రోజు జరపుకుంటున్న సమయంలో ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడటం విచారకరమన్నారు. తమ కార్యకర్తలు బీజేపీ వారిలా ప్రవర్తించి ఉంటే ఆ వర్గానికి చెందిన ఫ్లెక్సీ కూడా నాశనమయ్యేదన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు నిమ్మల నాని, కర్రి సుధాకరరెడ్డి, తాళ్లూరి మురళీకృష్ణ, గోకా వెంకటేశ్వరరావు, జట్లపాలెం మాజీ ఎంపీటీసీ కట్టుబోయిన కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.
Advertisement