ఏమిటీ పాట్లు!
జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెంలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన 90 ఏళ్ల ఈ బామ్మ పేరు కుప్పాల లక్ష్మి. నడవలేని స్థితిలో నేలపై ఇలా పాకుతూ పింఛను సొమ్ము కోసం నగర పంచాయతీ కార్యాలయానికి వచ్చింది. ఆమె ఖాతాలో పింఛను సొమ్ము జమ కాలేదు. ఈ బామ్మ ఎక్కడికి వెళ్లాలన్నా ఎవరో ఒకరు తోడు రావాలి. ఆటోలో వెళ్లాలి. ఈ పరిస్థితుల్లో 13 రోజులుగా సహాయకురాలితో కలిసి నగర పంచాయతీ కార్యాలయానికి వస్తోంది. ఇప్పటివరకు వీరిద్దరికీ కలిపి ఆటో చార్జీల రూపంలో రూ.650 వరకు ఖర్చయ్యింది. అయినా.. పింఛను సొమ్ము రూ.1,000 ఆమె ఖాతాలో జమ కాలేదు. జంగారెడ్డిగూడెం పట్టణంలో 3 వేల మందికి పైగా పింఛనుదారులు ఉండగా, సుమారు 600 మందికి పింఛను సొమ్ము రాలేదు. దీంతో వారంతా నగర పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. నగర పం చాయతీ పరిధిలో 3వేలకు పైగా పింఛను దారులు ఉండగా, ఇంకా 600 మందికి వారి ఖాతాల్లో సొమ్ము జమ కాలేదు. దీంతో వారంతా నగర పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. పెద్దనోట్లు రద్దు కావడానికి ముందు ప్రతినెలా 5వ తేదీలోపే వీరందరికీ పింఛన్ సొమ్ము చేతికి అందేది. ప్రస్తుతంలో బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు జమకాక ఇలాంటి వారెందరో అవస్థలు పడుతున్నారు. బ్యాంకు ఖాతాల పునరుద్ధరణ, వాటిని అధికారులకు అందజేయడం తదితర ప్రక్రియ పింఛనుదారులకు శాపంగా మారింది.