మల్బరీ ఉంటే ఉద్యోగమే | employeement on mulbery crop | Sakshi
Sakshi News home page

మల్బరీ ఉంటే ఉద్యోగమే

Published Wed, Aug 3 2016 1:48 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

మల్బరీ ఉంటే ఉద్యోగమే - Sakshi

మల్బరీ ఉంటే ఉద్యోగమే

అనంతపురం అగ్రికల్చర్‌ : రెండు ఎకరాల మల్బరీ తోట ఉందంటే ఆ ఇంట్లో ఉద్యోగం ఉన్నట్లేనని పట్టుపరిశ్రమశాఖ ‘అనంత’ డివిజన్‌ సాంకేతిక సేవా కేంద్రం (టీఎస్‌సీ) టెక్నికల్‌ ఆఫీసర్‌ (టీవో) ఎస్‌ఏ ఫిరోజ్‌బాషా (98495 63802) అంటున్నారు. నెలనెలా జీతం వచ్చేలా ప్రణాళిక ప్రకారం పండిస్తే దీనికి మించిన లాభదాయకమైన మరొక పంట లేదన్నారు. పల్లెసీమల ప్రగతికి పట్టుగొమ్మలా ‘అనంత’లో రేషంసాగు విస్తరిస్తోందన్నారు. ప్రభుత్వం, పట్టుపరిశ్రమశాఖ పెద్ద ఎత్తున రాయితీలు, ప్రోత్సాహం ఇస్తున్నందున ఔత్సాహిక రైతులు ముందుకు రావాలని కోరారు.  


ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ : మల్బరీ ఒకసారి నాటుకుంటే 15 నుంచి 20 ఏళ్లపాటు ఏటా కనీసం ఐదు పంటలు తీసుకోవచ్చు. రెండున్నర ఎకరాలు ఉంటే రెండు విడతలుగా చేసుకుంటే ఏడాదికి పది పంటలు సులభంగా పండించవచ్చు. ఎంతలేదన్నా సంవత్సరానికి రూ.5 లక్షల ఆదాయం పొందవచ్చు. చీడపీడలు, తెగుళ్లు తక్కువ కావడంతో పురుగు మందుల ఖర్చు ఉండదు. ఈ ఏడాది ఉపాధిహామీ పథకం కూడా అనుసంధానం చేయడంతో మల్బరీ రైతులకు చాలా లాభదాయకం.

అమలు చేస్తున్న రాయితీ పథకాలు
= ఒక్కో మొక్క నాటుకునేందుకు రూ.1.50 ప్రకారం గరిష్టంగా రెండున్నర ఎకరాలకు అంటే 12,500 మొక్కలకు రూ.18,750 ఇస్తారు.
= షెడ్డు నిర్మాణానికి రూ.82,500 రాయితీ వర్తిస్తుంది.
= పురుగుల పెంపకానికి పెద్ద షూట్‌స్టాండ్‌ ఏర్పాటుకు రూ.22,800, చిన్నదానికి రూ.19,125 పొందవచ్చు.
= తట్టలు, ప్లాస్టిక్‌ నేత్రికలు (చంద్రికలు), మందులు, ఆకుల కత్తిరింపుకు సికెట్‌ (కత్తెర), బ్రష్‌కట్టర్స్, స్ప్రేయర్‌కు 50 శాతం సబ్సిడీ వర్తిస్తుంది.
= షెడ్డు చుట్టూ ‘ఎల్‌’ ఆకారంలో వరండా నిర్మాణానికి రూ.22,500 ఇస్తారు.
= వేసవిలో ఉష్ణోగ్రతలు తగ్గించుకునేందుకు కూలింగ్‌ సిస్టమ్‌కు షెడ్డుపై ట్యాంక్‌ అమర్చుకుంటే రూ.9,750 వర్తిస్తుంది.
= చాకీ సెంటర్ల ద్వారా రెండవ జ్వరం వరకు పట్టుశాఖ ద్వారా పురుగులు మేపి రైతులకు అందించే వెసులుబాటు ఉంది.
= పట్టుగూళ్లకు మార్కెట్‌లో లభించే ధరలతో సంబంధం లేకుండా సీబీ గూళ్లకు కిలోకు రూ.10, బైవోల్టీన్‌ గూళ్లకు కిలోకు రూ.37.50 ప్రకారం అదనంగా చెల్లించడం జరుగుతుంది.
= జాబ్‌కార్డు కలిగిన రైతులకు ఉపాధిహామీ పథకం కింద రాయితీలు వర్తిస్తాయి.  

‘అనంత’లో మల్బరీ విస్తరణకు కృషి
హిందూపురం, మడకశిర, కదిరి, కళ్యాణదుర్గం, ధర్మవరం, పెనుకొండ లాంటి డివిజన్లలో మల్బరీ సాగుకు రైతులు ముందుకు వస్తున్నా ‘అనంత’, గుంతకల్లు, గుత్తి, శింగనమల లాంటి డివిజన్లలో సాగు తక్కువగా ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది అనంతపురం డివిజన్‌లో 200 ఎకరాల కొత్త తోటలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో ఇప్పటికే 60 ఎకరాలు సాధించాం. మొత్తమ్మీద రానున్న కాలంలో పట్టుశాఖ జేడీ సి.అరుణకుమారి, డివిజన్‌ ఏడీ శ్యామూల్‌దాస్‌ సహకారంతో అనంతపురం డివిజన్‌లో కూడా పట్టుసాగు విస్తరణకు కృషి చేస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement