ప్రతి మండలంలో లక్ష మందికి ‘ఉపాధి’
ప్రతి మండలంలో లక్ష మందికి ‘ఉపాధి’
Published Mon, Feb 27 2017 9:38 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
– జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్
కర్నూలు (అర్బన్): ప్రతి మండలంలో నాలుగు వారాల్లోగా లక్ష మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించాలని ఎంపీడీఓలను జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేవలం 10 శాతం పనులు కల్పించడంలోనే ఉన్నారని, పరిస్థితి చాలా అధ్వానంగా ఉందన్నారు. పనులు జరగడం లేదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పొలాల్లో పంటలు లేవని, రైతులకు ఉపయోగపడే పనులతో పాటు చెక్‌డ్యామ్‌లు, పూడికతీత పనులు చేపడితే పెద్ద ఎత్తున కూలీలు పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, జీరో ప్రగతి ఉన్న గ్రామాలపై నిఘా పెంచాలని డ్వామా పీడీ పుల్లారెడ్డికి సూచించారు. బండిఆత్మకూరు, రుద్రవరం, నంద్యాల, గోస్పాడు మండలాల్లో పది శాతం కూలీలకు మాత్రమే పనులు కల్పిస్తున్నారని.. సంబంధిత అధికారులపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.
మండలాల్లో ఉండని ఏపీఓ, టీఏలపై వేటు తప్పదని హెచ్చరించారు. కోడుమూరు మండలంలో అధికారుల పనితీరు బాగాలేదని, కచ్చితంగా కూలీల సంఖ్యను పెంచి వలసలను నివారించాలన్నారు. అనేక గ్రామాల్లో ఉపాధి పనుల కల్పన జీరో శాతం ఉందన్నారు. 23 మండలాల్లో వంకలు, వాగులు ఉన్నాయని, జంగిల్ క్లియరన్స్ కోసం ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ, ఇరిగేషన్ ఎస్‌ఈ చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement