ఎంప్లాయ్‌మెంట్ రిజిస్ట్రేషన్ నిరుద్యోగులకు వరం
–హెడ్ పోస్టాఫీసులో ప్రారంభించిన పోస్టుమాస్టర్ జనరల్ సంజీవ్ రంజన్
కర్నూలు (ఓల్డ్‌సిటీ): పోస్టాఫీసుల్లో ఎంప్లాయ్‌మెంట్ రిజిస్ట్రేషన్ విధానం ప్రవేశపెట్టడం జిల్లాలోని నిరుద్యోగులకు వరమని పోస్టుమాస్టర్ జనరల్ సంజీవ్ రంజన్ అన్నారు. ఆదివారం స్థానిక హెడ్ పోస్టాఫీసులో ఆయన ఎంప్లాయ్‌మెంట్ రిజిస్ట్రేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కర్నూలుతో పాటు నంద్యాల, తిరుపతి, అనంతపురం, విజయవాడ హెడ్ పోస్టాఫీసుల్లో ఈ రిజిస్ట్రేషన్ కేంద్రాలు ప్రారంభించామన్నారు. నేషనల్ కేరీర్ సర్వీసెస్ పోర్టల్‌కు అనుసంధానం చేసిన ఈ కేంద్రం నిరుద్యోగులకు, యాజమాన్యాలకు మధ్య వారధిలా పనిచేస్తుందన్నారు.
నిరుద్యోగుల అర్హతలు, నైపుణ్యతల వివరాలను నమోదు చేసి ఆన్‌లైన్‌లో ఉంచుతామని తెలిపారు. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు వారికి అవసరమైన అర్హతలు, నైపుణ్యాలు కలిగిన యువతీ యువకులను పోర్టల్ ద్వారా ఎంపిక చేసుకుంటారని చెప్పారు. యాభైరెండు సెక్టార్లలోని మూడు వేల రకాల ఉద్యోగాలు పోర్టల్ పరిధిలోకి వస్తాయని తెలిపారు. మార్చి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కోర్ సిస్టమ్ ఇంటగ్రేషన్ (సీఎస్‌ఐ) విధానం ద్వారా భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ మ్యాచ్ కావడం లేదనే సమస్య ఉండదని చెప్పారు.
పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు మాట్లాడుతూ అభ్యర్థులు తమ వివరాలను కొత్తగా నమోదు చేసుకునేందుకు రూ. 15, అప్‌డేట్ చేసుకునేందుకు రూ. 5 ఫీజు చొప్పున రుసుం చెల్లించాల్సి ఉంటుందని, నమోదైన వివరాల ప్రింటర్ కాపీ పొందాలనుకుంటే మరో రూ. 10 చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. మొదటి రోజునే జిల్లాలోని 25 మంది నిరుద్యోగులు తమ వివరాలను నమోదు చేయించుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ మల్లికార్జునశర్మ, ఏఎస్పీలు సి.హెచ్.శ్రీనివాస్, నాగానాయక్, హెడ్ పోస్టుమాస్టర్ వై.డేవిడ్, ఏఐపీవోలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.