డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలి
టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ సందీప్ కుమార్ సుల్తానియా
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిం చడంలో భాగంగా బ్యాంకుల ద్వారా ఖాతాదారులకు రూపే కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ సందీప్‌కుమార్ సుల్తానియా బ్యాంకర్లను ఆదేశించారు. ఇప్పటికే ఖాతాదారుల వద్ద అందుబాటులో ఉన్న రూపే కార్డులన్నీ యాక్టివేట్ చేయాలన్నారు. డీమానిటైజేషన్‌పై ఏర్పాటైన టాస్క్ ఫోర్సు కమిటీ గురువారం సచివాలయంలో తొలిసారిగా సమావేశమయ్యింది. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ మాట్లాడుతూ వాడుకలో లేని కార్డులను బ్యాంకులు హోల్డ్‌లో పెట్టాయని, వీటిని తిరిగి వాడుకలోకి తీసుకురావాలన్నారు.
రూపే కార్డులకు పిన్ నంబర్లను ఖాతాదారుల ఈమెయిల్‌కు పంపించాలని, ప్రతీ ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఆర్బీఐ తదుపరి కేటాయింపుల్లో పోస్టాఫీసులకు కనీసం రూ.100 కోట్లు కేటాయించాలని, ఆసరా పింఛన్ దారులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ మొత్తంలో చిన్న నోట్లను పంపిణీ చేసి రైతులు, కార్మికులు, కూలీలు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. కొత్త జిల్లాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాల నిర్వహణ కోసం 21 మంది జిల్లా కోఆర్డినేటర్లను నియమించమని ఆర్బీఐని కోరాలని టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ణయించింది.
నవంబర్ 8 తరువాత డిజిటల్ లావాదేవీల పెరుగుదల వివరాలను సమర్పించా లని బ్యాంకర్లను కోరారు. ప్రీపెయిడ్ కార్డుల జారీపై కూడా కమిటీ చర్చించి వీటి వినియోగాన్ని పెంచాలని అభిప్రాయపడింది. ఎస్బీఐ జనరల్ మేనేజర్ గిరిధర్, ఆంధ్రా బ్యాంక్ డీజీఎం రమణయ్య, ఆర్బీఐ ఏజీఎం సుబ్రమణ్యం, ఎస్‌ఎల్‌బీసీ సీజీఎం జేబీ సుబ్రమణ్యం, చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ బి చంద్రశేఖర్, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రెటరీ సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.