అన్యాక్రాంతమైన భూమి స్వాధీనం
పెనుగుదురు (కరప): దశాబ్ద కాలంగా అన్యాక్రాంతమైన పంటభూమిని ఎట్టకేలకు ట్రిబ్యునల్ తీర్పుతో దేవాదాయశాఖ సోమవారం స్వాధీనం చేసుకుంది. పెనుగుదురులోని వేణుగోపాలస్వామి దేవస్ధానానికి సంబంధించిన 1.45 ఎకరాల పంటభూమిని ఒకవ్యక్తి అనధికారికంగా సాగు చేసుకుంటున్నాడు. ఈ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినా, కుదరక పోవడంతో దేవాదాయశాఖ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ట్రిబ్యునల్ తీర్పు దేవాదాయశాఖకు అనుకూలంగా వచ్చింది. దీంతో దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ డీఎల్‌వీ రమేష్‌బాబు పలువురు ఈఓలు, సిబ్బందితోపాటు వీఆర్వోలు, పోలీసు బందోబస్తుతో వెళ్లి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. చుట్టూ పెన్సింగ్ ఏర్పాటుచేసి, ఎర్రజెండాలుపాతి, దేవాదాయశాఖకు చెందిన భూమిగా బోర్డును ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా డీసీ రమేష్‌బాబు మాట్లాడుతూ 20 రోజుల వ్యవధిలోనే మూడేళ్ల కాలపరిమితికి కౌలుహక్కుకోసం బహిరంగ వేలంపాట నిర్వహిస్తామన్నారు. ఆసక్తిఉన్న రైతులు రూ.10వేలు డిపాజిట్ చెల్లించి, వేలంపాటలో పాల్గొనవచ్చన్నారు. వెంటనే బహిరంగ వేలంపాటకు ఏర్పాట్లు చేయాలని కాకినాడ ఇన్‌స్పెక్టర్ డేగల సతీష్‌కుమార్‌ను డీసీ ఆదేశించారు. కరప ఎస్‌ఐ మెల్లం జానకీరాం ఆధ్వర్యంలో ఏఎస్‌ఐ కేఏవీఎస్‌ఎస్ ఆచార్యులు, సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.