‘ఊర్వశి’ గుట్టు రట్టు..!
Published Sun, Nov 20 2016 3:47 AM | Last Updated on Wed, Sep 5 2018 1:38 PM
దామరచర్ల: ప్రభుత్వానికి పన్ను ఎగవేస్తూ యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్న ఓ సబ్బుల కంపెనీ గుట్టు రట్టయ్యింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించి సదరు కంపెనీ యాజమాన్యం నుంచి ఇప్పటికే రూ.3కోట్లు వసూలు చేసి లోతైన విచారణ జరుపుతున్నారు. వివరాలు.. పాండిచ్చేరికి చెందిన ఊర్వశి కంపెనీ తమ ఉత్పత్తులైన సబ్బులు,సర్ఫు ప్యాకెట్లను ఉమ్మడి రాష్ట్రంలో ఒకే వేబిల్లుపై విక్రయించేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం కూడా తెలంగాణలోఅమ్మకాలను కొనసాగించారు.
అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకే అనుమతులు తీసుకుని అక్రమంగా తెలంగాణాలోకి ప్రవేశించి వ్యాపారాలు సాగించారు. తెలంగాణ నుంచి వె ళ్లిన సిమెంట్, ఇతర వస్తువుల వాహణాల్లో సబ్బులు,సర్ఫుప్యాకెట్లను ఈ ప్రాంతానికి తీసుకువచ్చేవారు. రెండేళ్లుగా ఈ దందా గుట్టు చప్పుడు కాకుండా సాగింది. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన రూ.కోట్ల ఆదాయానికి గండి పడింది. ఇప్పటి వరకు ఆ కంపెనీ యాజమాన్యం సుమారు రూ.38కోట్ల మేర డిటర్జంట్ల అమ్మకాలు సాగించినట్టు అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
విశ్వసనీయ సమాచారంతో..
పన్నులు చెల్లించక పోవడంతో ఊర్వశి కంపెనీ యాజమాన్యం తక్కువ ధరకే తమ ఉత్పత్తులను తెలంగాణలో విక్రయించింది. దీంతో పోటీ కంపెనీకి చెందిన ప్రతినిధులు వాణిజ్య పన్నుల శాఖకు ఉప్పందించారు. దీంతో రంగంలోకి దిగిన వాణిజ్య పన్నుల శాఖ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారుల బృందం ఈనెల 1న ఏక కాలంలో నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి,బషీర్‌బాగ్‌ల లో కంపెనీ ఉత్పత్తుల లోడ్‌తో వెళుతున్న లారీలను పట్టుకుని సీజ్ చేశారు. విషయం బయటికి పొక్కకుండా గుట్టుచప్పుడు కాకుండా విచారణ చేశారు. గతంలో కూడా సంబంధిత కంపెనీ డిటర్జెంట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి వాడపల్లి, నాగార్జునసాగర్, కోదాడ, ఖమ్మం, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాలకు ఎటాంటి బిల్లులు లేకుండా దిగుమతులు అవుతున్నట్లు గుర్తించారు.
రంగంలోకి స్థానిక అధికారులు
వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఊర్వసి కం పెనీ ఉత్పత్తులను అమ్ముతున్న 38 మం ది డీలర్ల దుకాణాలపై స్థానిక అధికారు లు దాడులు చేసి సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారం గా రూ.38కోట్లకు పైగా అమ్మకాలు సా గించినట్లు గుర్తించారు. ప్రభుత్వానికి కంపెనీ నుంచి నికర బిల్లువాల్యుపై రా వాల్సిన 14.5 శాతం, అమ్మకాల తర్వా త వచ్చిన ఆదాయంపై రావాల్సిన 14.5 శాతాన్ని చెల్లించాలని కంపెనీకి నోటీసులు ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకూ రూ.3కోట్ల పన్నులు సంబంధిత డీలర్ల ద్వారా వాణిజ్య పన్నుల శాఖ వ సూలు చేసిందని అధికారులు చెబుతున్నారు.
దామరచర్ల కేంద్రంగా..
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలాన్ని కేంద్రంగా చేసుకున్న ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన ఓ డీలరు శ్రీనివాస ఏజన్సీ పేరిట ఊర్వశి సబ్బులు,సర్ఫు ప్యాకెట్లను జిల్లాలో సరఫరా చేశాడు. ఈనెల1 రాత్రి ఏజన్సీపై దాడులు చేసిన అనతంరం సదరు డీలరు గుట్టు చప్పుడు కాకుండా ఉడాయించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాణిజ్య పన్నుల శాఖకు డీలర్లు కట్టిన రూ3కోట్లలో దామరచర్ల శ్రీనివాస ఏజెన్సీ డీలరే అత్యధికంగా రూ.1.18కోట్లు చెల్లిండం గమనార్హం. దీంతో పాటుగా హైదరాబాద్,రంగారెడ్డి,వరంగల్,ఖమ్మం,కరీంనగర్,జగిత్యాల తదితర ప్రాంతాలకు చెందిన 38 మంది డీలర్లను ఇప్పటి వరకు అధికారులు గుర్తించినట్లు సమాచారం.
విచారణ జరుపుతున్నాం..
తెలంగాణ రాష్ట్రంలో ఊర్వశి సబ్బులు,సర్ఫుప్యాకెట్ల క్రయ, విక్రయాలపై విచారణ సాగిస్తున్నాం. పాండిచ్చేరి నుంచి అక్రమంగా ఎలా ప్రవేశించారు.. అన్న దానిపై ప్రాథమిక విచారణ పూర్తయ్యింది. ఇప్పటికే సంబంధిత డీలర్ల నుంచి రూ.3కోట్ల పన్నులు వసూలు చేశాం. విచారణ పూర్తయితే పూర్తి సమాచారం వస్తుంది. అక్రమార్కులపై దాడులు కొనసాగిస్తాం.
- భిక్షమయ్య (ఏసీటీఓ)
Advertisement
Advertisement