వారు రమ్మంటున్నా.. వీరు పొమ్మంటున్నారు! | engeneering seats not filled | Sakshi
Sakshi News home page

వారు రమ్మంటున్నా.. వీరు పొమ్మంటున్నారు!

Published Sun, Aug 7 2016 12:44 AM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

వారు రమ్మంటున్నా.. వీరు పొమ్మంటున్నారు!

వారు రమ్మంటున్నా.. వీరు పొమ్మంటున్నారు!

వెలవెలబోతున్న,ఇంజనీరింగ్‌, కళాశాలలు
రెండో దశలోనూ పూర్తిస్థాయిలో భర్తీ కాని సీట్లు
ఇంకా ఖాళీగానే ఉన్న 38 శాతం సీట్లు
కొన్ని కళాశాలల్లో బ్రాంచ్‌కు 5 నుంచి 10 మందే..
మరికొన్నింటిలో బోణీ కొట్టని బ్రాంచ్‌లు
 
బాలాజీచెరువు (కాకినాడ) :
ఒకప్పుడు ఇంజినీరింగ్‌ సీటు సంపాదించడం ఎంతో అరుదైన ఘనతగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. కళాశాలలు రా...రమ్మని పిలుస్తున్నా.. విద్యార్థులు పో...పొమ్మంటున్నారు. కళాశాలలు ఎక్కువ కావడమే దీనికి కారణం. ఉన్న కళాశాలల్లో మంచివాటిని గుర్తించి అటువైపే విద్యార్థులు అడుగులు వేయడంతో స్థాయి లేని కళాశాలలు వెలవెలబోతున్నాయి.
జేఎన్‌టీయూకేకి అనుబంధంగా జిల్లాలో 33 ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉండగా, వీటిలో 12 వేలకు పైగా సీట్లున్నాయి. ఎంసెట్‌–2016 ఇంజినీరింగ్‌ విభాగానికి జిల్లావ్యాప్తంగా 16,535 మంది హాజరవగా వీరిలో 11,067 మంది అర్హత సాధించారు. కానీ ఉన్న సీట్లలో 7,400 మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే జిల్లా మొత్తంలో ఉన్న సీట్లలో 62 శాతం మాత్రమే భర్తీ కాగా, మిగిలిన 38 శాతం సీట్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయన్నమాట. ఫలితంగా కొన్ని కళాశాలలు మూతపడే పరిస్థితి నెలకొంది. మరికొన్ని కళాశాలల్లో బ్రాంచ్‌కు 5 నుంచి 10 మంది చొప్పున చేరడంతో ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి ఆయా యాజమాన్యాల్లో నెలకొంది. ఇక బ్రాంచ్‌కు 30 శాతం చొప్పున నిండిన కళాశాలలు కూడా సందిగ్ధంలో పడ్డాయి. కేవలం గుర్తింపు పొందిన ఆరు కళాశాలల్లో మాత్రమే నూరు శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మరికొన్ని కళాశాలల్లో టాప్‌ బ్రాంచ్‌గా ఉన్న ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్‌ తప్ప మిగిలిన బ్రాంచ్‌లు బోణీ కొట్టలేదు. దీంతో రెండో దశపై ఆశలు పెట్టుకున్న కళాశాలలకు నిరాశే మిగిలింది.
కళాశాలల పెరుగుదలే కారణం
జిల్లాలో 1989 వరకూ ఒక ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలతోపాటు మరో రెండు ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు మాత్రమే ఉండేవి. సాంకేతిక విద్యను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 1998 నుంచి 2006 వరకూ ఇంజినీరింగ్‌ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులను సులభతరం చేసింది. దీంతో జిల్లాలో అదనంగా దాదాపు 20 కళాశాలలు ఏర్పాటయ్యాయి. దీంతో అప్పటివరకూ జిల్లాలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో వందల్లో ఉన్న సీట్ల సంఖ్య వేలకు చేరింది. ప్రస్తుతం దాదాపు ప్రతి రెండు మండలాలకు ఒక ఇంజినీరింగ్‌ కళాశాల చొప్పున ఉన్న పరిస్థితి.
వసతుల లేమి
ఒకపక్క కళాశాలలు పెరిగినా వాటిలో పూర్తిస్థాయిలో వసతులుండటం లేదు. అయినా సరే విద్యార్థులను తమవైపు తిప్పుకోవడానికి అందుబాటులో ఉన్న సాంకేతికతనంతా ఉపయోగించినా ఫలితం లేకపోయింది. డొనేషన్లు తీసుకునే విధానం పోయి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఉపకార వేతనాల ఆఫర్లతో అడ్మిషన్లు కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరైన ప్రమాణాలతోపాటు నిష్ణాతులైన అధ్యాపకులు లేకపోవడమే దీనికి కారణం. కేవలం బీటెక్‌ అర్హత కలిగినవారితో తరగతులు నిర్వహించేస్తున్నారు. ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం 1.15 నిష్పత్తిలో అధ్యాపకులతోపాటు నాన్‌టీచింగ్, నాన్‌ టెక్నికల్‌ విభాగంలో ఏదైనా డిగ్రీ ఉండాలని నిబంధన ఉన్నా అవేమీ పాటించకపోవడం మరో కారణం.
మూసివేయాలన్నా ఇబ్బందే..
ఏదైనా కళాశాలను మూసివేయాలి వస్తే  ఏఐసీటీఈ బోర్డుకు సంబంధిత యాజమాన్యం రూ.3 లక్షలు చెల్లించాలి. ముందుగా ఆ బోర్డు నుంచి అనుమతి తీసుకోవాలి. తన విద్యార్థులను ఏ కళాశాలకు మార్చుతున్నదీ, అధ్యాపక, అధ్యేపకేతర సిబ్బంది వివరాలను యూనివర్సిటీకి తెలియజేయాలి. కళాశాల మూసివేతకు తమకేమీ అభ్యంతరం లేదని విద్యార్థుల నుంచి అనుమతి పత్రం తీసుకోవాలి.
కొలువుల ఎంపిక మాటేమిటి?
ప్రస్తుతం జిల్లాలో ఉన్న 33 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కేవలం జేఎన్‌టీయూకేతోపాటు పేరొందిన ఏడెనిమిది కళాశాలల్లో మాత్రమే ఏటా క్యాంపస్‌ ఇంటర్వూ్యలు నిర్వహిస్తున్నారు. మిగిలిన కళాశాలల్లో ఆ ఊసే లేదు. ఫలితంగా ఆయా కళాశాలల్లో సీట్లు ఖాళీగా మిగులుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement