ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
హత్నూర (సంగారెడ్డి): వ్యవసాయ పాలిటెక్నిక్ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం తుర్కల ఖానాపూర్ పంచాయతీ రత్నపురి వ్యవసాయ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా.. కల్వకుర్తికి చెందిన అనకాపల్లి రాజశేఖర్, అరబింద దంపతుల కుతూరు సహస్ర(17) రత్నపురి వ్యవసాయ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతుంది. కొద్ది నెలల నుంచి కళాశాలలో సీనియర్ విద్యార్థినులు తనను తరచూ ఇబ్బంది పెడుతున్నానని, తనకు కళాశాల కూడా నచ్చడం లేదని సహస్ర తండ్రి రాజశేఖర్‌కు చెప్పింది.
దీంతో 15 రోజుల కిందట రాజశేఖర్ కళాశాల ఏఓ భిక్షపతితో మాట్లాడారు. ఈ మేరకు హాస్టల్‌లో మహిళా వార్డెన్ లేకపోవడంతో తన ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలే తెలియక సహస్ర ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. ఇదే గదిలో ఉంటున్న తోటి విద్యార్థిని స్రవంతి ఫ్యాన్‌కు వేలాడుతున్న సహస్రను చూసి కేకలు వేయగా మిగతా మేల్కొని ఆమెను రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వెంటనే ఏఓ భిక్షపతి వచ్చి యాజమన్యంతో పాటు విద్యార్థిని తండ్రి రాజశేఖర్‌కు ఫోన్‌లో సమాచారమిచ్చారు. దీంతో వారు చేరుకుని కన్నీరుమున్నీరుగా రోదించారు. కాగా, సహస్ర మతదేహం వద్ద సూసైడ్ నోట్ లభించింది.
‘ఈ కళాశాల నచ్చడం లేదు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే స్నేహితులు లేరు. ఈ కాలేజీ నుంచి బయటకు వెళ్తుదామంటే.. ఫ్యామిలీ ఇబ్బందులు.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్న. వీలైతే నన్ను క్షమించండి. తమ్ముడిని బాగా చూసుకోండి. వాడిని మాత్రం హాస్టల్‌లో వేయకండి’ అంటూ ఉందని పోలీసులు తెలిపారు. అయితే, కళాశాల యాజమాన్యం, ఏఓ భిక్షపతి వేధింపులే తన కుతూరు ఆత్మహత్యకు కారణమని సహస్ర తండ్రి రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.