అంగన్‌వాడీల్లో అటకెక్కిన ‘ఆంగ్ల’ విద్య
అంగన్‌వాడీల్లో అటకెక్కిన ‘ఆంగ్ల’ విద్య
Published Tue, Aug 23 2016 10:45 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM
ఇందూరు :
అంగన్‌వాడీ కేంద్రాలను పటిష్టం చేయడానికి గత కలెక్టర్ రొనాల్డ్ రోస్ హయాంలో ఐసీడీఎస్ నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలో చేపట్టిన ఆంగ్ల విద్య కార్యక్రమం అటకెక్కింది. ఆయన బదిలీ అనంతరం ఐసీడీఎస్ అధికారులు ఈ కార్యక్రమాన్ని పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి గత కలెక్టర్ రొనాల్డ్ రోస్ చర్యలు చేపట్టారు. అతి తక్కువ హాజరు శాతం నమోదవుతున్న ఐసీడీఎస్ నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టును ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. నగరంలోని పులాంగ్ చౌరస్తాలో గల అంగన్‌వాడీ కేంద్రంలో 2015 జూలైలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించారు. ఎలాంటి ఖర్చు లేకుండా ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులతో ఆంగ్ల మాధ్యమంలో పాఠాలు చెప్పించడానికి చర్యలు చేపట్టారు. నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టులో పరిధిలో మొత్తం 152 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. అయితే మొదటి విడతగా 30 అంగన్‌వాడీ కేంద్రాలను ఎంపిక చేసిన రొనాల్డ్ రోస్.. ఒక్కో కేంద్రానికి ఇద్దరు చొప్పున మొత్తం 60 మంది మెడికల్ విద్యార్థులను కేటాయించారు. వీరికి కేటాయించిన కేంద్రాలకు విద్యార్థులు వారంలో ఒక సారి (ప్రతి శుక్రవారం) వెళ్లి 3 నుంచి 5 ఏళ్లలోపు విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్య అందించాల్సి ఉంది. ఇలా చిన్న పిల్లలకు బోధించడం తమకూ ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో మెడికల్ విద్యార్థులు కూడా కార్యక్రమానికి ఒప్పుకున్నారు. కానీ రొనాల్డ్ రోస్ ప్రారంభించిన ఆంగ్ల విద్య కార్యక్రమం కొన్ని రోజులకే అటకెక్కింది. ఆయన గతేడాది ఆగస్టులో బదిలీ కావడంతో ఆంగ్ల విద్య నిలిచిపోయింది. మెడికల్ విద్యార్థులు కూడా అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చి పిల్లలను విద్య నేర్పించడం మానేశారు.ప్రైవేట్ పాఠశాలల్లో ప్రీ స్కూల్ విద్య అందిస్తుండడంతో చాలా మంది తమ పిల్లలను రెండున్నర ఏళ్లకే ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు. దీంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య రానురాను తగ్గిపోతోంది. దీనిని గుర్తించిన గత కలెక్టర్ రొనాల్డ్‌రోస్.. అంగన్‌వాడీల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధించడానికి ఏర్పాట్లు చేశారు. మొదట నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టును ఎంపిక చేశారు. ఈ ప్రయోగం విజయవంతమైతే అన్ని అంగన్‌వాడీల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని భావించారు. ఆయన బదిలీతో ఈ కార్యక్రమం ఆగిపోయింది. దీనిని కొనసాగించడానికి ఐసీడీఎస్ అధికారులూ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రస్తుత కలెక్టర్ దీనిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా
– డెబోరా, నిజామాబాద్ అర్బన్ సీడీపీవో
నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టులో ఆంగ్ల విద్యను అమలు చేసిన విషయం నాకు తెలియదు. అప్పుడు నేను ఇక్కడ పని చేయలేదు. అయితే అంగన్‌వాడీల్లో పిల్లల సంఖ్య పెంచడానికి ఈ విధానం ఎంతో మేలు చేస్తుంది. నగరంలో నిలిచిపోయిన ఆంగ్ల విద్యను ప్రారంభించాలని జిల్లా ఉన్నతాధికారులను కోరతా..
Advertisement
Advertisement