జాతీయస్థాయి పురస్కార గ్రహీత.. హైదరాబాద్‌ నయా బాస్‌గా రోనాల్డ్‌ రాస్‌ | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి పురస్కార గ్రహీత.. హైదరాబాద్‌ నయా బాస్‌గా రోనాల్డ్‌ రాస్‌

Published Wed, Jul 5 2023 8:04 AM | Last Updated on Wed, Jul 5 2023 12:04 PM

- - Sakshi

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ నూతన కమిషనర్‌గా డి.రోనాల్డ్‌రాస్‌ నియమితులయ్యారు. రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయనను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్న డీఎస్‌ లోకేశ్‌కుమార్‌ను గతవారమే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అడిషనల్‌ సీఈఓగా నియమించగా, అందుకనుగుణంగా రాష్ట్రప్రభుత్వం తాజాగా ఉత్వర్వులు జారీ చేసింది. రోనాల్డ్‌రాస్‌ గతంలో జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌ (టౌన్‌ప్లానింగ్‌)గా, సెంట్రల్‌ జోన్‌ (ఖైరతాబాద్‌)కమిషనర్‌గా పని చేశారు.

అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో, కూల్చివేయడంలో చురుగ్గా వ్యవహరించేవారు. రోనాల్డ్‌రాస్‌ 2006 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో శిక్షణ తీసుకున్న ఆయన నర్సాపూర్‌ సబ్‌కలెక్టర్‌గా, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా, డ్వాక్రా డైరెక్టర్‌గా, గ్రామీణ పేదరిక నిర్మూలన ప్రాజెక్టు అడిషనల్‌ సీఈఓగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత నిజామాబాద్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఆర్థికశాఖతో పాటు సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా, గనులు, భూగర్భశాఖ కార్యదర్శిగా కూడా ఉన్నారు. బుధవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారిగా..
రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం జరుగుతున్న బదిలీల్లో భాగంగానే ఈ బదిలీలు చోటు చేసుకున్నాయి. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమితులైన రోనాల్డ్‌రాస్‌ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్నారు. నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేసినప్పుడు ఓటరు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడంలో చేసిన కృషికి ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా జాతీయస్థాయి పురస్కారాన్ని అందుకున్నారు.

ఆయా జిల్లాల్లో పని చేసినప్పుడు చిన్నారుల చదువు కోసం, విద్యాశాఖ ప్రక్షాళనకు, అవినీతి నిర్మూలనకు కృషి చేశారు. ఇసుక అక్రమ రవాణాను నిలువరించారు. ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి కాల్‌సెంటర్‌ వంటివి ఏర్పాటు చేశారు. పేదల బాగుకోసం తపించే అధికారిగా పేరుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement