ఆధ్యాత్మిక సిరి..సింహగిరి
శ్రీ వరాహ లక్షీనసింహస్వామి దర్శనానికి మంగళవారం సింహగిరిపై భక్తులు పోటెత్తారు. 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసి స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఒకవైపు....ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారి ఆలయ ప్రదక్షిణలు చేసేందుకు వచ్చిన భక్తులు మరోవైపు.... ఎటు చూసినా సింహగిరి ఆధ్యాత్మిక సిరిని సంతరించుకుంది.
–సింహాచలం
విశేషంగా ఆలయ ప్రదక్షిణలు
ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని మంగళవారం శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామి ఆలయ ప్రదక్షిణలు విశేషంగా జరిగాయి. ఐదువేల మంది వరకు భక్తులు ఆలయ ప్రదక్షిణ చేశారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి భక్తులు ఈ ఆలయ ప్రదక్షిణలకు తరలివచ్చారు. ఆషాఢ పౌర్ణమి ముందురోజు సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్లు చేసే గిరి ప్రదక్షిణకు సమానంగా మూడు ఆషాఢ పౌర్ణమి రోజుల్లో శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామి ఆలయం చుట్టూ 108 సార్లు చొప్పున చేసే ప్రదక్షిణలు కూడా సమానం కావడంతో ఈ ఏడాది కూడా భక్తులు ఆలయ ప్రదక్షిణల్లో విశేషంగా పాల్గొన్నారు.
సింహగిరిపై అప్పన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్లు సోమవారం గిరి ప్రదక్షిణ ప్రారంభించి వచ్చిన భక్తులందరికీ మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి స్వామి దర్శనాలు కల్పించారు. లక్ష మంది వరకు భక్తులు స్వామి దర్శనాన్ని చేసుకున్నట్లు దేవస్థానం అధికారులు అంచనా వేశారు.
కిక్కిరిసిన మెట్లమార్గం
32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసి సింహగిరికి చేరుకునే భక్తులతో మెట్లమార్గం కిక్కిరిసింది. భక్తులు ఒకరినొకరు తప్పించుకోలేని పరిస్థితి మెట్లమార్గంలో నెలకుంది. గిరి ప్రదక్షిణ పూర్తిచేసి తిరిగి సింహాచలం చేరుకున్న భక్తులు కొండదిగువ తొలిపావంచా వద్ద కొబ్బరికాయలు కొట్టి మెట్లమార్గం ద్వారా సింహగిరికి చేరుకున్నారు.
విశేషంగా ఏర్పాట్లు
-
గిరి ప్రదక్షిణను పురస్కరించుకుని సింహగిరికి వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో అధికారులు విశేషంగా ఏర్పాట్లు చేశారు.
-
గిరి ప్రదక్షిణ చేసి దర్శనానికి వచ్చిన భక్తులు, ఆలయ ప్రదక్షిణలు చేసే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కల్యాణమండపం నుంచి ఉత్తర రాజగోపురం వరకు బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. బ్రిడ్జిపై నుంచి దర్శనానికి వెళ్లే భక్తులను, కిందనుంచి ఆలయ ప్రదక్షిణలు చేసే భక్తులను అనుమతించారు. అలాగే దర్శనానంతరం బయటకు వెళ్లే దక్షిణ రాజపురం మార్గంలో కూడా
శాస్త్రోక్తంగా ఆఖరి విడత చందన సమర్పణ
ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామికి మంగళవారం ఆఖరి విడత చందన సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది. తెల్లవారుజామన రెండు గంటలకు స్వామిని సుప్రభాతసేవతో మేల్కొలిపి మూడు మణుగుల(125 కిలోలు) చందనాన్ని స్వామికి సమర్పించారు. అనంతరం ఆరాధన చేశారు.
చందనంతో దర్శనమిచ్చిన ఉత్సవమూర్తి
శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి చందనంతో శ్రీదేవి, భూదేవి స్వరూపుడై భక్తులకు దర్శనమిచ్చాడు. భోగమండపంలోని మండపంలో వేంజేసిన స్వామిని అధికసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.