పవర్‌హౌజ్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, ఆర్డీఓ, సింగరేణి అధికారులు
-
సింగరేణి భవనాలను పరిశీలించిన ఎమ్మెల్యే జలగం
కొత్తగూడెం : నూతనంగా ఏర్పడనున్న కొత్తగూడెం జిల్లాకు కలెక్టరేట్ కార్యాలయంగా ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న సింగరేణి ఈఆర్‌సీ శాప్ భవనాన్ని సిద్ధం చేస్తున్నట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు తెలిపారు. ఆదివారం ప్రభుత్వ కార్యాలయాల నిమిత్తం ఖాళీగా ఉన్న సింగరేణి భవనాలు, ఖాళీ స్థలాలను రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. బస్టాండ్‌కు దగ్గరగా ఉన్న ఈఆర్‌సీ భవనాన్ని కలెక్టరేట్‌గా, సింగరేణి ప్రధాన వైద్యశాలలో ఉన్న డిస్పెన్సరీ తదితర భవనాలను ఎస్పీ కార్యాలయానికి ఎంపిక చేశారు. సీపీఓ వంటి ప్రాధాన్యత గల భవనాలకు పవర్‌హౌజ్‌లో ఉన్న ఖాళీ భవనాలను పరిశీలించారు. ఇప్పటికే త్రీ ఇంక్లైన్‌లోని సీటీసీని పరిశీలించి ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు సిద్ధంగా ఉంచారు. ఇదే ప్రాంతంలోని సింగరేణి అధికారుల నివాస స్థలాల్లో, కలెక్టర్, ఎస్పీ, జేసీ క్యాంపు కార్యాలయాలకు, నివాస గృహాలకు అనువుగా ఉన్నట్లు ఎమ్మెల్యే, ఆర్డీఓ ఎంవీ రవీంద్రనాథ్‌లు పేర్కొన్నారు. ఎస్పీ క్యాంపు కార్యాలయం కూడా ఇదే ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఈ నెలాఖరులోగా జిల్లా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో కసరత్తు ప్రారంభించామని, సింగరేణి సంస్థలో నిరుపయోగంగా ఉన్న ఖాళీ భవనాలు, ఖాళీ స్థలాలను కొలతలతో సహా నివేదిక రూపొందిస్తున్నట్లు వివరించారు. వీటన్నింటినీ ఉన్నతాధికారులకు పంపించిన అనంతరం ఆమోదం పొందిన తరువాత ఏ కార్యాలయానికి ఏ భవనం వినియోగించాలన్నది నిర్ణయిస్తామని, ప్రస్తుతం ప్రతి భవనం రూపురేఖలు, అవి ఏఏ ప్రాంతాల్లో ఉన్నాయో, వాటిని ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్యాలయాల భవనాలకు కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వన్‌టౌన్ పరిధిలోని ఐఎంఏ భవనం కూడా ప్రభుత్వ కార్యాలయాలకు తాత్కాలికంగా వినియోగించుకుంటామన్నారు. ఇదే ప్రాంతంలోని పవర్‌హౌజ్ భవనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సీఐలు రాజగోపాల్, శ్రీనివాస్, సింగరేణి అధికారులు అంతోని రాజా, నరేందర్, టీఆర్‌ఎస్ నాయకులు జి.వి.కె.మనోహర్, కంచర్ల చంద్రశేఖర్ పాల్గొన్నారు.
పవర్‌హౌజ్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, ఆర్డీఓ, సింగరేణి అధికారులు