
భవనాన్ని ప్రారంభిస్తున్న వీసీ నాగేశ్వర రావు
ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): ఆంధ్రవిశ్వవిద్యాలయం సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి నూతనంగా నిర్మించిన అదనపు భవన సదుపాయాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 2.38 కోట్ల వ్యయంతో 11 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం చేయడం జరిగిందన్నారు. కార్పొరేట్ భవనాలను తలపించే రీతిలో ఆధునికత ఉట్టేపడే విధంగా భవన నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. బోధన విభాగంలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను సబ్ కమిటీ సూచనలకు అనుగుణంగా ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు.
విశ్వవిద్యాలయాలలో సుదీర్ఘ కాలం తరువాత నియామకాలు చేపట్టడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ జగదీష్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి.ఎస్ అవధాని, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.రామమోహనరావు, పాలక మండలి సభ్యుడు డాక్టర్ పి.సోమనాథరావు, సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ఆచార్య జి.వి.ఆర్ శ్రీనివాస రావు, వజీర్ మహ్మద్, ఎం.జి మాధవబాబు తదితరులు పాల్గొన్నారు.