ఆధ్యాత్మికతతోనే శాంతిస్థాపన
ఇస్కాన్ వ్యాసరచన పోటీలు
వన్‌టౌన్ :
సమాజంలో ఆధ్యాత్మికతతోనే శాంతిస్థాపన సాధ్యమవుతుందని ఇస్కాన్ కృష్ణాజిల్లా కార్యనిర్వహకులు మురళీధర్‌నాథ్ దాస్ అన్నారు. ఇస్కాన్ వ్యవస్థాపకులు శ్రీల ప్రభుపాద జీవితంపై కృష్ణాజిల్లా వ్యాప్త వ్యాసరచన పోటీ పరీక్షా కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో ఆదివారం జరిగింది. సుమారు 250 మంది విద్యార్థులు హాజరయ్యారు. దాస్ మాట్లాడుతూ ఇస్కాన్ స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మానవ సమాజానికి ఆనందభరితమైన జీవితాన్ని, చక్కని ఆరోగ్యాన్ని ప్రశాంతమైన మనస్సును, అన్ని ఉన్నతమైన లక్షణాలను భగవత్ చైతన్యం ద్వారా అందించటానికి ఇస్కాన్ ప్రయత్నిస్తోందన్నారు. తొలుత జిల్లావ్యాపితంగా పరీక్షలను నిర్వహించి చివరిలో రాష్ట్ర వ్యాప్త పరీక్షను నిర్వహిస్తున్నామన్నారు. విజేతలకు జిల్లా స్థాయిలో పది వేలు, ఏడున్నర వెయ్యి, ఐదు వేలు, రాష్ట్ర స్థాయిలో లక్ష, రూ.75వేలు, రూ.50 వేలు చొప్పున నగదు బహుమతులను అందజేస్తామన్నారు. విజయవాడలోనే బహుమతి ప్రదానోత్సవం ఉంటుందని తెలిపారు.