అమలాపురం: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రభుత్వం చట్టంలో నిర్దేశించిన విధంగా ఖర్చు చేయకుండా దళితులను మోసగిస్తోందని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆరోపించారు.
అమలాపురంలో కోనసీమ దళిత నాయకులు, యువకులతో గురువారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. సబ్‌ప్లాన్ నిధులను ఇతర అవసరాలకు మళ్లించి దళిత, గిరిజన వాడల్లో అభివద్ధి జాడలు లేకుండా చేస్తున్నారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద తొలి బడ్జెట్‌లో రూ.8 వేలకోట్లు, రెండో బడ్జెట్‌లో రూ.6 వేలకోట్లు కేటాయించారని చెప్పారు. ఈ నిధులను వేరే అవసరాలకు మళ్లించి దళిత ప్రాంతాల అభివద్ధిని చంద్రబాబు పూర్తిగా తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు.
గత రెండు బడ్జెట్లో కేటాయించిన సబ్‌ప్లాన్ నిధుల ఖర్చులు, ప్రణాళికపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సామాజికాభివృద్ధికి సబ్‌ప్లాన్ విధానం ప్రవేశపెట్టి దానిని చట్టం కూడా చేసిందని గుర్తు చేశారు. దేశంలో ఇలాంటి చట్టం ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. సబ్‌ప్లాన్ విషయంలో ఎస్సీ, ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 15న అమలాపురంలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు హర్షకుమార్ ప్రకటించారు. ఆలోగా రాష్ట్ర ప్రభుత్వం సబ్‌ప్లాన్ నిధుల వినియోగంపై శ్వేతపత్రం ప్రకటించాలని, లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
'చంద్రబాబు ఎస్సీ, ఎస్టీలను మోసగిస్తున్నారు'
Published Thu, Nov 5 2015 7:04 PM | Last Updated on Thu, Sep 13 2018 5:22 PM
Advertisement