ప్రగతి పరవళ్లు
►ఇదే రాష్ట్ర ప్రభుత్వం ముందున్న లక్ష్యం
►త్వరలో టీ–హబ్ 2 ఏర్పాటు
►వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నాం
►అన్నివర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నాం
►డిసెంబర్ నెలాఖరులోగాఇంటింటికీ తాగునీరు అందిస్తాం
►డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వెల్లడి
►ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
రంగారెడ్డి జిల్లా: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మగా భావించే వ్యవసాయానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. అనుబంధ వృత్తులకూ ఆర్థిక ప్రేరణ కలిగిస్తున్నామని చెప్పారు. అందుకోసం సమగ్ర ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నామని వెల్లడించారు. తద్వారా పల్లెల్లో ప్రగతిని పరవళ్లు తొక్కించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియం ఆవరణలో శుక్రవారం రాష్ట్ర అవతరణ వేడుకలను జిల్లా యంత్రాంగం వైభవంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత అక్కడ ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ రఘనందర్‌రావు, ఎమ్మెల్యేలు ఆర్.కృష్ణయ్య, తీగల కృష్ణారెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, సంయుక్త సీపీ తరుణ్ జోషితో కలిసి జాతీయ జెండాను ఎగురవేసిన డిప్యూటీ సీఎం.. అనంతరం రాష్ట్రం, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆయన ప్రసంగించారు.
పేదరిక నిర్మూలనే లక్ష్యం..
రాష్ట్రంలో వివిధ వనరుల ద్వారా సమకూరే సంపద పేదరిక నిర్మూలన కోసం ఉపయోగపడాలన్నదే తమ లక్ష్యం డిప్యూటీ సీఎం అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నుంచి ఒంటరి మహిళలకు జీవనభృతి కల్పిస్తున్నామన్నారు. మాతా శిశు సంరక్షణ కోసం ఉద్దేశించిన కేసీఆర్ కిట్ శనివారం నుంచి అమలవుతుందని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవిస్తే రూ.12 వేలు ప్రోత్సాహకంగా అందజేస్తాం. ఆడబిడ్డ పుడితే మరో రూ.వెయ్యి అదనంగా అందిస్తాం. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేయనున్నామన్నారు. అన్ని వర్గాలకు ప్రభుత్వం బాసటగా నిలుస్తోందని మహమూద్ అలీ చెప్పారు. గొల్ల, కురుమ, యాదవులకు 75 శాతం సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేయనున్నామన్నారు. దీనికి పెద్ద ఎత్తున స్పందన వస్తోందని.. చేపల పెంపకం ద్వారా మత్స్య కార్మికులకూ అండగా నిలిచామని చెప్పారు. నాయీ బ్రాహ్మణులు నవీన క్షౌ రశాలలు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక సహాయం అందజేస్తున్నామని చెప్పారు.
అన్నింటా ప్రగతి..
పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న సదుద్దేశంతో డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తున్నామని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చెప్పారు. జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి 1,400 చొప్పున ఇళ్లు మంజూరయ్యాయని.. వీటిని త్వరలోనే నిర్మించి అర్హులకు అప్పగిస్తామని చెప్పారు. మిషన్ కాకతీయ పథకం కింద తొలి విడతలో 309 చెరువులను అభివృద్ధి పరిచినట్టు చెప్పారు. రెండో విడతలో 144 చెరువుల పనులు పూర్తయ్యాయని.. జిల్లాలో 526 పరిశ్రమల పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇచ్చామన్నారు. గ్రీన్ ఫార్మాసిటీ, ఇతర పారిశ్రామిక సంస్థల ఏర్పాటు కోసం 7,939 ఎకరాల భూమిని సేకరించామని.. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో త్వరలోనే టీ హబ్–2ను నెలకొల్పనున్నామని డిప్యూటీ సీఎం చెప్పారు. 200 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జిల్లాకే గర్వకారణమన్నారు. జిల్లాను గుడుంబారహిత జిల్లాగా తీర్చిదిద్దుతున్నామని.. రైతులకు మంజూరు చేస్తున్న సబ్సిడీలను నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయడానికి జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నుకుని విజయవంతంగా పూర్తిచేశామని చెప్పారు.
816 మంది చిన్న సన్నకారు రైతులు సాదాబైనామాల ద్వారా కొనుగోలు చేసిన భూములను క్రమబద్ధీకరించి యాజమాన్య హక్కులు కల్పించినట్టు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో పంటనష్టం జరిగిన రైతులకు రూ. 26కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేసి ఆదుకున్నామని.. షాద్‌నగర్, శంకర్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీలను నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ పథకం కింద ఎంపిక చేశామని మహమూద్ అలీ చెప్పారు. ఈ మార్కెట్లలో ఆన్‌లైన్ ద్వారా క్రయవిక్రయాలు జరిపేందుకు అవసరమైన వసతులు సమకూర్చామన్నారు. మైనార్టీలు, బీసీలకు 9 చొప్పున, ఎస్సీ, ఎస్టీలకు మరో 9 గురుకుల పాఠశాలలను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. మహిళా సాధికారత కింద జిల్లాలో 2016–17లో 12,950 మహిళా సంఘాలకు రూ. 285.48 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను అందజేసినట్టు ఆయన వివరించారు.
తెలంగాణ సాధన అనేది తొలిమెట్టు మాత్రమే. అంతటితో తృప్తి చెందితే సరిపోదు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుకోవాలి. అభివృద్ధి పథంలో జిల్లాను నడిపించాలి. ఇందుకు అందరి కృషి అవసరమే కాదు.. సమష్టిగా పని చేయాల్సిన బాధ్యతా ప్రతి ఒక్కరిపై ఉంది’
– డిప్యూటీ సీఎం మహమూద్ అలీ