పుష్కరాలకు 1.50 కోట్ల మంది రాక?
Published Fri, Jul 29 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: గత పుష్కరాల సందర్భంగా (2004లో) జిల్లాలో ఏర్పాటు చేసిన 11 ఘాట్లలో స్నానం చేసేందుకు వచ్చిన భక్తులు కేవలం 43లక్షల మందే. కానీ, ఈసారి నెలకొన్న ‘ప్రత్యేక’ పరిస్థితుల్లో అంతకు మూడు రెట్ల మంది.. అంటే కనీసం 1.40 కోట్ల మంది భక్తులు పుష్కర స్నానం కోసం వస్తారనే అంచనా మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కానీ, గత ఏడాది కరువు, ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే వెలవెలబోతున్న కృష్ణమ్మ... జిల్లాలో పరవళ్లు తొక్కుతుందా? ఎగువన వర్షాలు కురిసి సాగర్ నిండి బిరబిరా పరుగులిడుతుందా..?’ అనే సందేహాలు అటు అధికారులను, ఇటు జిల్లా వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సమయం దగ్గరపడుతున్న కొద్దీ కృష్ణానదిలో నీటి లభ్యత, పుష్కర స్నానం ఎక్కడ చేయాలన్న దానిపై భక్తుల్లో ఉత్కంఠ కూడా పెరుగుతోంది.
ఎగువ నుంచి నీళ్లు లేవు
వాస్తవానికి, గత పుష్కరాల సమయంలోనూ చివరి నిమిషంలోనే కృష్ణమ్మకు నీరు వచ్చింది. ఈసారి కూడా అదే రీతిలో వస్తాయనే ఆశలున్నా.. వాతావరణ పరిస్థితులు భక్తుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. వారం, పది రోజుల క్రితమే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు నిండిన నేపథ్యంలో ఈపాటికి శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండి సాగర్‌కు నీరు విడుదల చేసి ఉంటే పుష్కరాల సమయానికి సాగర్ బ్యాక్‌వాటర్, ఎగువన, దిగువన జలకళ ఉండేది. కానీ, మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు నిండిన తర్వాత పూర్తిస్థాయిలో ఎగువ నుంచి వరద తగ్గిపోవడం, ఆ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో లేక అవుట్‌ఫ్లో కూడా విడుదల చేయకపోవడంతో ఇప్పటికీ శ్రీశైలం ప్రాజెక్టు వెలవెలబోతోంది. ఈ పరిస్థితుల్లో పెద్ద ఎత్తున వర్షాలు స్థానికంగా కురిసి, ఎగువన బీభత్సమైన వరదలు వస్తే తప్ప శ్రీశైలం ప్రాజెక్టు నిండి సాగర్‌కు నీళ్లు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు జూరాల, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండినందున కొన్ని నీళ్లు అక్కడి నుంచి ఇస్తే.. శ్రీశైలం నుంచి విద్యుదుత్పాదనకైనా నీళ్లు వదిలితే కొంత మేర సాగర్‌లో నీటిమట్టం పెరిగే అవకాశాలున్నాయి. అప్పుడు కనీసం టెయిల్‌పాండ్, పులిచింతలలో నిల్వ ఉంచుకునేందుకైనా ఓ 20 టీఎంసీల మేర నీటిని కిందికి వదిలితే జిల్లాలోని కృష్ణమ్మ చెంతన ఉన్న పుష్కర ఘాట్లు భక్తులతో కళకళలాడే అవకాశాలున్నాయి. మరి, అందుకు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు ఎలాంటి ఆలోచనతో ఉన్నాయి? అసలు ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయి నీటి మట్టం లేకుండా పుష్కరాల కోసం నీటిని విడుదల చేసేందుకు కృష్ణాబోర్డు అంగీకరిస్తుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా...!
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే పుష్కరాల కోసం నిర్మిస్తున్న ఘాట్లు నీళ్లు లేక కృష్ణానదికి చాలా దూరంలో ఉన్నాయి. కృష్ణాబ్యాక్‌వాటర్ కింద ఈసారి పుష్కరాల కోసం నిర్మించిన చందంపేట మండలంలోని పెదమునిగల్ ఘాట్‌కు కృష్ణానది ఆరు కిలోమీటర్ల దూరంలో, కాచరాజుపల్లి ఘాట్‌కు 2 కిలోమీటర్ల దూరంలో, పీఏపల్లి మండలం అజ్మాపూర్ ఘాట్‌కు 3 కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తోంది. ఇక, సాగర్ ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో ఉన్న పొట్టిచెల్మ ఘాట్‌కు కృష్ణమ్మ 1.5 కిలోమీటర్ల దూరంలో, మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వాడపల్లిలో మాత్రం ఘాట్‌కు కొన్ని అడుగుల దూరంలోనే కృష్ణమ్మ ప్రవహిస్తోంది. ఇక, మట్టపల్లిలోని ఘాట్లకు కూడా 200–300 మీటర్ల దూరంలో కృష్ణానది ప్రవహిస్తోంది. ఈ పరిస్థితుల్లో పుష్కరాల నాటికి కూడా నీళ్లు రాని పక్షంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే, ఎప్పటిలాగే ఈసారి కూడా షవర్లు ఏర్పాటు చేస్తున్నామని, ఇవి, వృద్ధులకు, చిన్నారులకు ఉపయోగపడుతాయని, అయితే, నీళ్లు రాని పక్షంలో ఈ షవర్‌స్నానాలే అందరూ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. మరోవైపు పైపుల ద్వారా ఘాట్ల వద్దకు నీళ్లు తెచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నామని, మరో నాలుగైదు రోజుల తర్వాత పరిస్థితులను అంచనా వేసి పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకుంటామని కృష్ణా పుష్కర ఏర్పాట్లలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి వెల్లడించారు.
ఆ మూడింటికే కోటి మందికి పైగా...
ఈ పుష్కరాలలో స్నానం చేసేందుకు భక్తులు కనీసం కోటిన్నర మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నా కేవలం మూడు ప్రాంతాల్లోనే పెద్ద ఎత్తున భక్తులు వస్తారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గత పుష్కరాల సమయంలోనూ ఈ మూడు చోట్లకే ఎక్కువ మంది భక్తులు వచ్చారు. నాగార్జునసాగర్, వాడపల్లి, మఠంపల్లి కలిపి గత పుష్కరాల సమయంలో 33.7లక్షల మంది భక్తులు రాగా, ఈసారి మాత్రం 1.15 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. అందులోనూ మఠంపల్లి, వాడపల్లికి 40లక్షల మంది చొప్పున, నాగార్జునసాగర్‌లో 35లక్షల మంది వస్తారని అధికారులు భావిస్తున్నారు. గత పుష్కరాల సమయంలో అయితే సాగర్‌కు 15లక్షలు, వాడపల్లికి 10 లక్షలు, మఠంపల్లికి 9లక్షల మంది భక్తులు వచ్చారు. కానీ, ఈసారి మాత్రం సాగర్ కన్నా వాడపల్లి, మఠంపల్లికే ఎక్కువ మంది భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. అయితే, కృష్ణానదిలో నీరు రాకుండా సాగర్ ఇదే స్థాయిలో వెలవెలబోతే మాత్రం మఠంపల్లి, వాడపల్లి ఘాట్‌లకు జిల్లా వాసులు ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, హైదరాబాద్ నుంచి సాగర్‌కు వస్తారని భావిస్తున్న భక్తులంతా మహబూబ్‌నగర్‌లోని బీచుపల్లి ఘాట్‌కు ఎక్కువగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీచుపల్లి జాతీయ రహదారి మీద ఉండడం, కేవలం రెండు గంటల సమయంలోనే హైదరాబాద్ నుంచి చేరుకునే అవకాశం ఉండడంతో అందరూ బీచుపల్లి దారి పడుతారని, అప్పుడు జిల్లాకు పుష్కర భక్తుల సంఖ్య తగ్గిపోతుందని అంచనా. అయితే, వర్షాలు కురిసి, కృష్ణమ్మ పరవళ్లు తొక్కితే మాత్రం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌తో పాటు కృష్ణా– మూసీ సంగమ క్షేత్రమైన వాడపల్లి పుణ్యక్షేత్రం, లక్ష్మీనారసింహుడు కొలువుదీరిన మట్టపల్లి క్షేత్రాలు భక్తులతో చిన్నపాటి సముద్రాన్ని తలపించనున్నాయి.
Advertisement
Advertisement