పుష్కర పనులపై ఆర్డీఓ సమీక్ష
కోదాడ : కృష్ణా పుష్కరాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయడంతో పాటు పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూర్యాపేటSఆర్డీఓ నారాయణరెడ్డి కోరారు. మంగళవారం కోదాడ తహసీల్దార్ కార్యాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కోదాడ రూరల్ సీఐ మధుసూదన్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీదేవి హజరయ్యారు. సూర్యాపేట డివిజన్ పరిధిలోని మేళ్లచెరువు మండలంలో ఉన్న ఘాట్ల వివరాలు, వాటికి చేరుకునే మార్గాలను, ఘాట్ల వద్ద ప్రస్తుత పరిస్థితులను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. డివిజన్ పరిధిలో మేళ్ల చెరువు మండలంలోనే పుష్కరాలు ఉన్నందున వాటిని విజయవంతం చేయడానికి అధికారులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఆయన కోరారు. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు, ఖమ్మం జిల్లాకు చెందిన భక్తులు కోదాడ మీదుగా మేళ్ల చెరువు వద్ద ఉన్న కృష్ణా నది వద్దకు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణపై రూరల్ సీఐ ఆర్డీఓకు మ్యాప్‌ల ద్వారా వివరించారు.