హాలీవుడ్‌ ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌! | Back in Action OTT Review in Telugu | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌ ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌!

Jan 31 2025 4:14 AM | Updated on Jan 31 2025 4:14 AM

Back in Action OTT Review in Telugu

ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో హాలీవుడ్‌ చిత్రం బ్యాక్‌ ఇన్‌ యాక్షన్‌(Back in Action) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.

హాలీవుడ్‌ సినిమాలన్నీ ఏదైనా ఒక జోనర్‌కి సంబంధించనవి మాత్రమే ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ఓ యాక్షన్‌ జోనర్‌ని ఫ్యామిలీతో కలిపి హాలీవుడ్‌లో సినిమా రావడమంటే అదో వింత. అదే ‘బ్యాక్‌ ఇన్‌’ యాక్షన్‌ సినిమా. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమ్‌ అవుతోంది. తెలుగు వెర్షన్‌ కూడా లభ్యమవుతోంది. ఈ సినిమాకి సేత్‌ గార్డన్‌ దర్శకుడు . కేమరన్‌ డియాజ్, జెమీ ఫాక్స్‌ వంటి ప్రముఖ నటులతో పాటు జేమ్స్‌ బాండ్‌ సినిమాలలో సుపరిచితురాలైన గ్లెన్‌ క్లోజ్‌ ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించడం విశేషం. ఇక కథ విషయానికొస్తే... అమెరికాలోని ప్రముఖ సీఐఎ సంస్థలో ప్రతినిధులుగా పని చేస్తున్న ఎమిలీ, మాట్‌ ప్రేమించుకుంటుంటారు. వారి ప్రేమకు ఫలితంగా ఎమిలీ గర్భవతి అవుతుంది. ఆ విషయాన్ని ఓ ఆపరేషన్‌లో భాగంగా మాట్‌కు చెబుతుంది ఎమిలీ. ఆ ఆపరేషన్‌ ఏంటంటే ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్య మరియు ప్రభుత్వ అధికార యంత్రాంగానికి సంబంధించిన ఓ డేటా డ్రైవ్‌ను తీసుకురావడం. ఈ దశలో ఇద్దరూ ఓ ఘోర విమాన ప్రమాదం నుండి తప్పించుకుంటారు. అలా తప్పించుకున్నవాళ్లు ఇక ప్రపంచానికి తమ ఉనికి తెలియకుండా దూరంగా పుట్టబోయే పిల్లలతో సంతోషంగా ఉండాలనుకుంటారు. అందుకే వాళ్లిద్దరూ 12 ఏళ్ళ దాకా అటు సీఐఎకి ఇటు ప్రపంచానికి తమ అసలు ఉనికి తెలియకుండా జాగ్రత్త పడతారు. ఈ 12 ఏళ్లలో వాళ్లకి ఇద్దరు పిల్లలు పుడతారు. తమ పిల్లలకు కూడా తమ అసలు ఐడెంటిటీ తెలియనివ్వరు. అయితే ఏ ఆపరేషన్‌ కోసం వీళ్లిద్దరూ అజ్ఞాతానికి వచ్చారో ఆ ఆపరేషన్‌ వల్లే మళ్లీ కథ మొదలవుతుంది. ఆ ఆపరేషన్‌లో శత్రువులకు దొరకకుండా ఉండాలని మాట్‌ తనతో పాటు ఆ డేటా డ్రైవ్‌ని ఎమిలీకి కూడా తెలియకుండా దాస్తాడు. ఆ డ్రైవ్‌ కోసం విలన్స్ వీళ్లిద్దరినీ మళ్లీ ట్రాక్‌ చేసి ఎటాక్‌ చేస్తారు. మరి విలన్స్ ఆ డ్రైవ్‌ చేజిక్కించుకుంటారా? తమ పిల్లలకు, సమాజానికి తమ ఐడెంటీటీని దాచి పెట్టిన ఎమిలీ, మాట్‌ విలన్స్ ఎటాక్‌ నుండి తప్పించుకున్నారా? లేదా అన్నది సినిమాలోనే చూడాలి. పైన చెప్పుకున్నట్టు ఇదో చక్కటి ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. మంచి స్టంట్స్, విజువల్స్‌తో పాటు చక్కని కామెడీని ఈ సినిమాలో చూసి ఎంజాయ్‌ చేస్తారు. మరింకెందుకు ఆలస్యం... గ్రాబ్‌ యువర్‌ రిమోట్‌ టు ‘బ్యాక్‌ ఇన్‌ యాక్షన్‌’ ఫర్‌ వాచింగ్‌ దిస్‌ వీకెండ్‌.
– ఇంటూరు హరికృష్ణ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement