
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ఆంబర్ అలర్ట్(Amber Alert) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
అమెరికా దేశానికి సంబంధించి పిల్లల కిడ్నాప్ సమయంలో తరచుగా వాడే పదం ఆంబర్ అలర్ట్. ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు ఇస్తే, వాళ్లు చెప్పే ఆనవాళ్లను బట్టి ఆ సమయంలో, ఆప్రాంతంలో ఉన్న ప్రతి వాహనదారుడికి ఈ ఆంబర్ అలర్ట్ మెసేజ్ వాళ్ల ఫోనులకు పంపించడం జరుగుతుంది. ఇది అమెరికా ప్రభుత్వం 1996 నుండి చేపడుతున్న అధికారిక చర్య.
దీని వల్ల పిల్లల కిడ్నాప్‌కు ఉపయోగించే వెహికల్‌ను త్వరగా కనుక్కోగలుగుతారు. ‘ఆంబర్ అలర్ట్’ (2024) సినిమా నేపథ్యం కూడా అదే. 2012లో కూడా ఇదే పేరు, నేపథ్యంతో ఓ సినిమా విడుదలైంది. గత ఏడాది విడుదలైన ‘ఆంబర్ అలర్ట్’ వాస్తవ సంఘటనల ఇతివృత్తంగా రూపోందిన సినిమా. ఈ సినిమా కథ విషయానికొస్తే... పార్కులో ఆడుకుంటున్న షార్లెట్ అనే చిన్న పాపను ఓ ఆగంతకుడు కార్లో వచ్చి కిడ్నాప్ చేసుకుని తీసుకువెళతాడు.
పాప పార్కులో ఆడుకునేటపుడు వాళ్ల అమ్మ తీసిన వీడియో వల్ల కిడ్నాపర్ కారు కొంచం వీడియోలో పడుతుంది. మరో పక్క షేన్ అనే క్యాబ్ డ్రైవర్ తన డ్యూటీ ముగించుకొని ఇంట్లో తన కోసం వేచి ఉన్న తన కొడుకు బర్త్ డే పార్టీకి త్వరగా వెళ్లబోతుంటాడు. అదే సమయంలో జాక్ అనే లేడీ తాను బుక్ చేసుకున్న క్యాబ్ వెళ్లిపోవడంతో షేన్‌ని తనను దారిలో వదలమని బ్రతిమాలుకుంటుంది.
ఇద్దరూ తమ ప్రయాణం ప్రారంభించాక సడెన్‌గా ఇద్దరి ఫోన్‌లకు షార్లెట్ ఆంబర్ అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఇంతలో కిడ్నాపర్ డ్రైవ్ చేస్తున్న కారు వీళ్ల కంటబడుతుంది. ఆ తరువాత ఏం జరిగిందనేది ఓటీటీ వేదికగా ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ‘ఆంబర్ అలర్ట్’ మూవీలోనే చూడాలి. కెర్రీ బెల్లెస్సా దర్శకత్వంలో రూపోందిన ఈ సినిమా గ్రిప్పింగ్ అండ్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఓ మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం ‘ఆంబర్ అలర్ట్’ చూడొచ్చు. – ఇంటూరు హరికృష్ణ