ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం డేంజరస్ వాటర్స్ (Dangerous Waters)ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
జీవితమన్నది క్షణభంగురం. ఏ క్షణానికి ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కాబట్టి అనుక్షణం అప్రమత్తత అవసరం. ఈ నేపథ్యంలోనే రూ΄పొందిన హాలీవుడ్ సినిమా ‘డేంజరస్ వాటర్స్’(Dangerous Waters ). ఇదో పూర్తి థ్రిల్లర్ జోనర్ మూవీ. సినిమా మొత్తం ఓ మూడు పాత్రలతో 90 శాతం సముద్రంలోనే జరిగిన కథ. సినిమాలో ఉన్నది మూడు పాత్రలే అయినా మంచి స్క్రీన్‌ప్లేతో చూసే ప్రేక్షకులను మాత్రం కట్టిపడేసే ప్రయత్నం చేశారు దర్శకుడు జాన్ బర్.
ఈ సినిమా లయన్స్ గేట్ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. ఇది పెద్దవాళ్లు మాత్రమే చూసే సినిమా. ఇక ఈ చిత్రకథ విషయానికొస్తే... అల్మా తన కూతురు కోసం ఓ సూపర్ వెకేషన్ ప్లాన్ చేస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ డెరెక్‌తో కలిసి కూతురుతో పాటు బోట్‌లో బెర్ముడా వరకు ట్రావెల్ చేసి, సముద్రం మధ్యలో తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవాలన్నది ప్లాన్. దీనికి కూతురు రోజ్ అయిష్టంగానే ఒప్పుకుంటుంది. ప్రయాణం మొదలైనపుడు అంతా బాగానే ఉంటుంది. దారి మధ్యలో వేరే ఒక బోట్ వీళ్లకు ఎదురుగా వచ్చి అల్మాను చంపేసి డెరెక్‌ను గాయపరుస్తారు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో నడి సంద్రంలో రోజ్ ఒంటరిదైపోతుంది.
దాడి చేయడానికి వచ్చినవాళ్లు బోట్‌లోని రేడియోను అలాగే బోట్ ఇంజన్‌ను ధ్వంసం చేసి వెళతారు. చుట్టూ నీళ్లు తప్ప ఏమీ లేని ఆ ప్రాంతం నుండి రోజ్ ఎలా బయటపడిందనేది సినిమాలోనే చూడాలి. ఈ సినిమా చాలా నెమ్మదిగా ప్రారంభమై, ఉత్కంఠభరితంగా సాగుతూ ఊహకందని క్లైమాక్స్ ట్విస్టులతో అద్భుతంగా ముగుస్తుంది. గంటా నలభై నిమిషాల నిడివితో సాగే ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. థ్రిల్లర్ జోనర్ ఇష్టపడేవాళ్లకి ఇదో సూపర్ సినిమా. మరింకేం... ఈ వీకెండ్ ‘డేంజరస్ వాటర్స్’లోకి మీరూ ట్రావెల్ చేయండి. – ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment