చూసి తెలుసుకోదగ్గ డాక్యుమెంటరీ | Bollywood Movie The Roshans ott review in telugu | Sakshi
Sakshi News home page

చూసి తెలుసుకోదగ్గ డాక్యుమెంటరీ

Feb 2 2025 12:36 AM | Updated on Feb 2 2025 11:41 AM

Bollywood Movie The Roshans ott review in telugu

ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో బాలీవుడ్‌ చిత్రం ది రోషన్స్‌ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.

ఈ జీవితమనే చక్రంలో కొందరి వంతు వస్తుంది, కొందరి వంతు ముగుస్తుంది. ముగిసిన వారి జ్ఞాపకాలు మన మనసులో పదిలంగా ఉంటాయి. వారిలో ఎందరో మహానుభావులుంటారు. వారి జ్ఞాపకాలైతే మనం నెమరువేసుకోవచ్చేమో కానీ ఆ కాలంలో వారు పడ్డ కష్టం, ఆనందం కానీ మనకు తెలియవు. అటువంటి వారి జీవిత చక్రానికి వెండితెర రూపమిస్తే మన ఆనందం అవధులు దాటుతుంది.

ఆ కోవకు చెందినదే నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమ్‌ అవుతున్న ‘ది రోషన్స్’ టీవీ షో. ఇదో డాక్యుమెంటెడ్‌ మినీ సిరీస్‌.  ఒకే కుటుంబానికి చెందిన నలుగురి జీవిత చక్రాలకు తెర రూపమే ఈ షో. బాలీవుడ్‌ దిగ్గజ రోషన్‌ కుటుంబానికి చెందిన నాటి సంగీత కళాకారులు రోషన్‌ లాల్‌ నాగ్రత్‌ 
నుండి నేటి తరం నటుడు హృతిక్‌ రోషన్‌(Hrithik Roshan) వరకు... వారి జీవిత ప్రయాణాన్ని ఎంతో అందంగా చూపించారు.

ఈ డాక్యుమెంటరీలో. ఓ రకంగా చెప్పాలంటే మనం ఈ షో ద్వారా నాలుగు తరాలు ప్రయాణిస్తాం. ముందుగా రోషన్‌ కుటుంబం నుండి రోషన్‌ లాల్‌ నాగ్రత్‌ సంగీత ప్రయాణంతో ఈ షోప్రారంభమై ఆ పై అతని కొడుకు రాజేష్‌ రోషన్‌ బాలీవుడ్‌ ప్రయాణంతో సాగి, ఆ తరువాత ఆయన కొడుకు రాకేశ్‌ రోషన్‌ నటనా ప్రయాణంతో పాటు ప్రోడ్యూసర్‌గా ఎలా రాణించారు? అన్నది చూపిస్తూ నేటి తరం కథానాయకుడు హృతిక్‌ రోషన్‌ బాలీవుడ్‌ ప్రయాణంతో షో ముగుస్తుంది.

ఈ షో ద్వారా నాటి బాలీవుడ్‌ సంగీతం నుంచి నేటి తరం సినిమాల వరకు మనకు తెలియని ఎన్నో రహస్యాలతో పాటు హిందీ చిత్ర పరిశ్రమలోని అప్పటి ఒడిదుడుకులను ఇప్పటి పట్టు విడుపులను సవివరంగా చూపించారు. ఈ రోషన్‌ కుటుంబానికి బాలీవుడ్‌ పరిశ్రమలో ఉన్న నాటి, నేటి దిగ్గజాలు తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రేక్షకులకు చెప్పడం మరింత బావుంది. అందుకే ‘ది రోషన్స్’ చూసి నేర్చుకోదగ్గ, తెలుసుకోదగ్గ డాక్యుమెంటరీ. ఇది ప్రతి సినిమా ప్రేక్షకుడు తమ వ్యక్తిగత లైబ్రరీలో భద్రపరుచుకోదగ్గ డాక్యుమెంటెడ్‌ మినీ సిరీస్‌. వర్త్‌ఫుల్‌ టు వాచ్‌.  – ఇంటూరు హరికృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement