అన్న రిక్త హస్తం
అన్న రిక్త హస్తం
Published Thu, Aug 3 2017 11:19 PM | Last Updated on Sun, Sep 17 2017 5:07 PM
ఆసక్తి చూపని బాలింతలు, గర్భిణులు
అమలు చేయలేమంటున్న అంగన్‌వాడీలు
ఆలమూరు : అన్న అమృత హస్తం పథకం అన్న రిక్తహస్తంగా మారింది. ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా హడావుడిగా అమల్లోకి తీసుకురావడంతో జిల్లాలో ఎక్కడా సక్రమంగా అమలు కావడం లేదు. జిల్లాలోని కొన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టులతో అన్న అమృత హస్తం అరకొరగా అమలు చేస్తుంటే మరికొన్ని ప్రాజెక్టుల్లో సౌకర్యాలు లేవంటూ పథకాన్ని పూర్తిగా నిలిపివేశారు. ఈ పథకంపై సరైన పర్యవేక్షణ లేకపోవడమూ నిరాదరణకు కారణమైంది. ప్రభుత్వానికి సరిౖయెన ప్రణాళిక లేకపోవడం, కనీస వసతుల లేమి, అధికారుల నిర్లిప్తత వల్ల పథకం ప్రారంభించిన నెలరోజులకే అభాసుపాలైంది. అంగన్‌వాడీ కేంద్రాల వద్ద వండించిన నాసిరకం సరకులతో తయారు చేసిన పౌష్టికాహారాన్ని తినలేమని మహిళలు చెప్తున్నారు. జూలై ఒకటిన అట్టహాసంగా ప్రారంభమైన పథకం అంతలోనే విఫలమైంది. జిల్లాలో 28 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా 5546 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 3.46 లక్షల మంది చిన్నారులు, 33,184 మంది బాలింతలు, 39,657 మంది గర్భిణులు ఉన్నారు. తొలి రోజు ప్రజా ప్రతినిధుల ఒత్తిడితో గర్భిణులు, బాలింతలు ఆ మరుసటి రోజు నుంచి రావడం, తినడం మానేశారు. ఈ పరిస్థితిపై ఐసీడీఎస్ ఆందోళనలో పడింది.
ఎలా వండాలి–ఎలా భుజించాలి?
సుదూర ప్రాంతాల్లో ఉండే అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రతి రోజు నడిచి వెళ్లి అక్కడ ఆహారాన్ని భుజించలేమని గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు చెబుతున్నారు. అయితే బాలింతలు కూడా నాసిరకమైన ముతక బియ్యం, వంటనూనెలతో వండుతున్న అహారం తినలేమంటున్నారు.
అంగన్‌వాడీల సహాయ నిరాకరణ
జిల్లాలోని అంగన్‌వాడీలు ఈ పథకం అమలులో సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో సుమారు 15 సెక్టార్ల పరిధిలోని అంగన్‌వాడీలు తమకు కనీస సౌకర్యాలు, నిధులు మంజూరు చేయకుండా విధి విధానాలు ఖరారు కాకుండా పథకాన్ని కొనసాగించలేమంటూ నిస్సహాయత వ్యక్తంచేస్తున్నారు. వంట పాత్రలు, గ్యాస్ కనెక్షన్, గ్లాసులు, ప్లేట్లు లేకుండా పథకాన్ని అమలు చేయలేమంటూ తమ నిరసనలను తెలియజేస్తున్నారు. ఇదే డిమాండుతో కలెక్టరేట్, ఐసీడీఎస్ ప్రాజెక్టులను మట్టడించినా ఫలితం లేకపోయింది.
రేషన్ లేదు–పౌష్టికాహారం లేదు
అన్న అమృత హస్తం పథకం కింద కొన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టులతో పౌష్టికాహార పంపిణీ అమలు చేయడం కాని, రేషన్ సరకుల పంపిణీ కాని జరగడం లేదు. దీనిపై ఐసీడీఎస్ శాఖ ఏవిధమైన చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉండటం వల్ల లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆయా ప్రాజెక్టుల్లో అన్న అమృత హస్తం అమలులోని కేంద్రాల్లో రేషన్ పంపిణీకి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇకనైనా ప్రభుత్వం సత్వరమే స్పందించి గతంలో మాదిరిగా రేషన్‌ను పంపిణీ చేయాలని బాలింతలు, గర్భిణులు కోరుతున్నారు.
సౌకర్యాలు కల్పించాకే అమలు చేస్తాం
అంగన్‌వాడీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు అమలు చేస్తే అన్న అమృత హస్తం పథకాన్ని అమలు చేసేందుకు ఇబ్బంది లేదు. బాలింతలు, గర్భిణులకు ముందుగా ఈ పథకంపై అవగాహన కల్పించి పౌష్టికాహారానికి అవసరమైన సరుకులను సమకూర్చాలి.
యు.సుశీల, మండల అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అధ్యక్షురాలు, ఆలమూరు.
సమర్థంగా అమలు చేస్తాం
అన్న అమృత హస్తం పథకం సక్రమంగా అమలయ్యేందుకు అంగన్‌వాడీ కేంద్రాల్లో తగిన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నాం. జిల్లాలో కొన్నిచోట్ల పథకం అమలు కాని విషయం దృష్టికి వచ్చింది. అలాంటి చోట్ల తప్పని పరిస్థితుల్లో రేషన్ పంపిణీకి చర్యలు చేపడతాం. తొలి వారంలో అన్ని ప్రాజెక్టుల అధికారులు, యూనియన్లతో సమావేశం నిర్వహిస్తాం
టి.శారదాదేవి, ఐసీడీఎస్ పీడీ, కాకినాడ
Advertisement