కొత్త నోట్లకూ నకిలీ మకిలి
కొత్త నోట్లకూ నకిలీ మకిలి
Published Sun, Mar 26 2017 10:58 PM | Last Updated on Tue, Sep 5 2017 7:09 AM
అమలాపురంలో తండ్రీ కొడుకుల నకిలీలలు
రూ.500, రూ.2000 నోట్ల కలర్ జిరాక్సుతో మోసాలు
నిందితుల అరెస్ట్ ..
84 నకిలీ నోట్లు, కలర్ జిరాక్సు మిషన్ స్వాధీనం
అమలాపురం టౌన్ : నల్ల ధనాన్ని...నకిలీ నోట్ల సమస్యను పరిష్కరిస్తాంటూ పెద్ద నోట్లను రద్దు చేసినప్పటికీ జిల్లాలో పల చోట్ల రూ.500, రూ.2000 నోట్లకు నకిలీ మకిలి తప్పడ లేదు. నకిలీలతో ప్రజలు మోసపోవడం జిల్లాలో మొదలైంది. అమలాపురంలో తండ్రీ కొడుకులు నకిలీ నోట్ల తయారీ, మార్పిడి చేస్తూ ఇప్పటికే పట్టణంతో పాటు పలు గ్రామీణ ప్రాంతాల్లో మోసాలకు ఒడిగట్టారు. రూ.500, రూ.2000 అసలు నోట్లను కలర్ జిరాక్సు మిషన్ ద్వారా అచ్చు గుద్దినట్టుగా జిరాక్సు నోట్లు సృష్టించి మార్కెట్‌లో చలామణి చేస్తున్నారు. అమలాపురంలో ఇటీవల కాలంలో నకిలీ నోట్ల బాధితులు లబోదిబో అనడం,..తీగ లాగితే డొంక కదిలినట్టు ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోతుగా దర్యాప్తు చేస్తే పట్టణంలో తండ్రీ, కొడుకు ఈ నకిలీ నోట్ల మార్పిడికి పాల్పడుతున్నట్టు గుర్తించారు. అల్లవరం మండలం తుమ్మలపల్లికి చెందిన వడ్డి మట్టయ్య అతని కొడుకు వడ్డి రాజేష్‌లు ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలటంతో వారిద్దరినీ పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ ఆదివారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. వారి వద్ద నుంచి రూ.500 నోట్ల జిరాక్సులు 33, రూ.2వేల నోట్ల జిరాక్సులు 51, కలర్ జిరాక్సు మిషన్, అందుకు ఉపయోగించే కెమికల్ కలర్స్ బాటిల్స్ (క్యాట్రిడ్జ్‌లు) స్వాధీనం చేసుకున్నారు. అమలాపురం డీఎస్పీ లంక అంకయ్య, సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ ఆదివారం ఉదయం స్థానిక పట్టణ పోలీసు స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు.
బీకాం కంప్యూటర్స్ చదివి..
వడ్డి మట్టయ్య అమలాపురంలో ఓ ఆస్పత్రిలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. కొడుకు రాజేష్ అమలాపురంలోని ఓ కళాశాలలో ఇటీవలే బీకాం కంప్యూటర్స్ చదివాడు. వీరి కుటుంబం కొంత కాలంగా స్థానిక సూర్యనగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. రాజేష్ తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానంతో నకిలీ నోట్ల తయారీ, మార్పిడికి పథకం పన్నాడు. అందులో తన తండ్రిని కూడా భాగస్వామిని చేశాడు. ఇంట్లో ఆధునిక కలర్ జిరాక్సు ద్వారా కొత్త రూ.500, రూ.2000 అసల నోట్లను జిరాక్సు తీస్తున్నాడు. వాటిని తన తండ్రికి ఇచ్చి బిజీగా ఉండే వ్యాపార కూడళ్లు, అమ్మకాలు జోరుగా ఉండే పెట్రోలు బంకులు, సినిమా హాళ్లు, హోటళ్లు తదితర వ్యాపార దుకాణాలు , సంస్థల్లో మార్చుతున్నారు. నెల రోజుల కిందట పట్టణంలోని ఓ చికెన్ సెంటర్‌లో నకిలీ రూ.500 నోటు ఇచ్చి మాంసాన్ని విక్రయించాడు. ఆ సెంటర్ యాజమానికి ఆ నోటు తర్వాత నకిలీదని లబోదిబో అన్నాడు. ఆ బాధతుని ఆవేదనను అప్పట్లో ’సాక్షి’ పత్రికలో కథనం కూడా ప్రచురితమైంది. ఇదిలా ఉండగా ఈ నెల 23 ఉదయం 11.30 గంటల సమయంలో స్థానిక ఎర్రవంతెన వద్ద పెయ్యల అర్జునరావు షాపింగ్ కాంప్లెక్సు ఎదురుగా రోడ్డు పక్కన ద్రాక్ష పండ్లు విక్రయించే దార మాధవరావు వద్ద వడ్డి మట్టయ్య అర కిలో ద్రాక్ష పండ్లు కొన్నాడు. రూ.500 నకిలీ నోటు ఇవ్వగా దుకాణదారుడు రూ.40 తీసుకుని మిగిలిన రూ.460 మట్టయ్యకు తిరిగి ఇచ్చాడు. తర్వాత మాధవరావుకు అది నకిలీ నోటు అని తెలియడంతో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాడు చేశాడు. తనకు నకిలీ నోటు ఇచ్చిన వ్యక్తి ఆనవాళ్లు చెప్పడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. మట్టయ్య, అతడి కుమారుడు రాజేష్ పట్టణంలో ఇటీవల కాలంలో నకిలీ నోట్లు మార్పిడి చేస్తునట్టు తెలిలింది. తండ్రీ కొడుకులు ఆదివారం ఉదయం స్థానిక ఈదరపల్లి వంతెన వద్ద నకిలీ నోట్లు మార్చేందుకు ప్రయత్నిస్తుండగా సీఐ శ్రీనివాస్, క్రైం పార్టీ హెడ్ కానిస్టేబుళ్లు అయితాబత్తుల బాలకృష్ణ, బత్తుల రామచంద్రరావు వ్యూహాత్మకంగా పట్టుకున్నారు. కొత్త నోట్లు అమల్లోకి వచ్చాక ఇన్ని నకిలీ నోట్లు వెలుగు చూడడ... ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయటం జిల్లాలో ఇదే ప్రథమం.
Advertisement