శంకరగిరితండాలో మిర్చి నారు నాటుతున్న రైతులు
- 170 ఎకరాల్లో మిర్చి తోట తొలగింపు
- దిక్కుతోచని స్థితిలో గిరిజన రైతులు
- ఆదుకోవాలని వేడుకోలు
- కౌలు రైతుల కంటతడి..
నేలకొండపల్లి : గిరిజన రైతుల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని మిర్చి విత్తన కంపెనీలు నట్టేట ముంచాయి. పూత, కాత రాని విత్తనాలను వారికి అంటగట్టి సొమ్ము చేసుకుని, రైతుల జీవితాల్లో కారం చల్లారు. దీంతో మండలంలో దాదాపు 170 ఎకరాల్లో మిర్చి తోటను తీసివేసి తిరిగి కొత్తగా మిర్చినారును నాటుతున్నారు. కొత్తగా పెట్టుబడి కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఖమ్మం జిల్లా, పాలేరు నియోజవర్గంలోని నేలకొండపల్లి మండలంలో శంకరగిరితండా, మోటాపురం గ్రామాల్లో నకిలీ విత్తనాలు కొని రైతులు మోసపోయాయి. శంకరగిరితండా గ్రామానికి చెందిన 110 మంది రైతులు దాదాపు 150 ఎకరాలకు ముదిగొండ మండల కేంద్రంలోని ఓ దుకాణంలో మిర్చి విత్తనాలను కొనుగోలు చేశారు. ప్యాకెట్ రూ.300 చొప్పున ఎకరానికి 12 ప్యాకెట్లను కొనుగోలు చేశారు. ఆగస్టు 21న విత్తనాలు నాటారు. ఇప్పటి వరకు ఎకరానికి రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టారు. తీరా మిర్చి మొక్క ఎదిగిన తరువాత పూత, కాత రాకుండా ఉంది. మరికొన్ని మొక్కలు ఎదుగుదల లోపించి ఉన్నాయి. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి సాగుచేసిన మిర్చి విత్తనాలు నకిలీ అని గుర్తించారు. పంట చేతికొచ్చే సమయంలో మిర్చితోట ఇలా ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులంతా ఒకే కంపెనీకి చెందిన విత్తనాలు నాడటంతో ఊరంతా మిర్చి తోటలది ఇదే పరిస్థితి.
ఇక కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. తండాలోని బాణోత్ రంగా అనే రైతు రూ.1.30 లక్షలతో కొంత భూమి కౌలుకు తీసుకున్నాడు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్డాడు. ప్రస్తుతం పంటను మొత్తం పీకేశాడు. తిరిగి కొత్తనారు కోసం ఎకరానికి రూ.10 వేల వరకు ఖర్చు పెట్టి తెచ్చాడు. కూలీలకు రూ.5 వేలు ఇవ్వాల్సి ఉంటుందని రైతు తెలిపాడు. ఇలా ప్రతి రైతు బోరున విలపిస్తున్నాడు. మండలంలోని మోటాపురం గ్రామానికి చెందిన 8 మంది రైతులు మరో 20 ఎకరాలు సాగు చేశారు. ఇక్కడ అదే పరిస్థితి నెలకొంది.