పతనమవుతున్న పత్తి ధర
పతనమవుతున్న పత్తి ధర
Published Sat, Oct 22 2016 8:44 PM | Last Updated on Mon, Sep 4 2017 6:00 PM
ఆదోని: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వారం రోజులుగా పత్తి ధర తగ్గుతూ వస్తోంది. సోమవారం క్వింటాలు రూ.4039–5961 పలకగా మోడల్ ధర రూ.5241 గా నమోదైంది. వారాంతం శుక్రవారం క్వింటాలు రూ.4011–5590 పలకగా మోడల్ ధర రూ.5340 గా అధికారులు నిర్ణయించారు. ఐదు రోజుల్లో రోజు రూ. వంద చొప్పున తగ్గుతూ వచ్చింది. దసరా పండగకు ముందు క్వింటాలు రూ.4500–6600 వరకు పలికింది. తర్వాత రోజు రోజుకు ధరలు తగ్గుతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ధర మరింత తగ్గక ముందే విక్రయించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఐదు రోజుల్లో 98,563 క్వింటాలు పత్తి యార్డుకు అమ్మకానికి రావడం అదేకారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో దూది ఖండి (356 కేజీలు)పై రూ.వెయ్యి వరకు ధర తగ్గగా పత్తి గింజలు క్వింటాలుపై రూ.150 వరకు తగ్గిందని ప్రముఖ పత్తి వ్యాపారి ఆర్.సోమశేఖర్ గౌడ్ తెలిపారు.
పత్తి వ్యాపారానికి విరామం
యార్డులో శనివారం పత్తివ్యాపారం జరగలేదు. పత్తికొనుగోలు దారుల సంఘం సమావేశం ఉన్నందున వ్యాపారులు టెండర్లలో పాల్గొనలేదు. మూడు రోజుల క్రితమే ఈ విషయాన్ని యార్డు అధికారులకు లేఖ ద్వారా తెలిపారు. అయితే ఈ విషయం తెలియని చాలామంది రైతులు వెంటనే పత్తిని అమ్ముకోవాలని ఆశించి మార్కెట్‌కు తెచ్చారు. వ్యాపారం లేదని తెలిసి కమీషన్ ఏజెంట్ గోదాములో నిల్వచేసి నిరాశగా వెనుదిరిగారు. కనీసం పత్రిక ప్రకటన ఇచ్చినా తాము పత్తిని యార్డుకు తెచ్చేవారం కాదని పలువురు రైతులు పేర్కొన్నారు.
Advertisement