అక్రమ కేసులకు చంద్రబాబుదే బాధ్యత
Published Fri, Oct 14 2016 1:32 AM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
తణుకు అర్బన్ : ఆక్వా పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమించిన వారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలోకి నెట్టడం, తుందుర్రు, పరిసర గ్రామాల ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడటం వంటి దురాగతాలకు చంద్రబాబు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందాకరత్ పేర్కొన్నారు. తణుకు సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తుందుర్రు ఆక్వా పార్క్ బాధితురాలు ఆరేటి సత్యవతిని బృందాకరత్ గురువారం పరామర్శించారు. అనంతరం జైలు బయట విలేకరులతో మాట్లాడుతూ ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం పెట్టుబడిదారుల పక్షాన నిలబడి అమాయకులపై హత్యానేరం కేసులు మోపి జైళ్లలో పెట్టడం దారుణమన్నారు. తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల ప్రజలు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా.. వారిని భయభ్రాంతులకు గురిచేసేలా పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తున్న తీరు బా«ధాకరమన్నారు. ఆక్వా పార్క్ నిర్మాణం వల్ల నీరు, గాలి కలుషితమవుతాయనే భయంతో ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. వారి అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా తుందుర్రు పరిసర గ్రామాలను పోలీసు చట్రంలో నిర్బంధించి పరిశ్రమ నిర్మిస్తున్న తీరు ఎన్నో అనుమానాలకు తావిస్తోందన్నారు. తక్షణమే నిర్మాణాలను నిలుపుదల చేయాలని, లేకుంటే ఈ సమస్యను జాతీయ స్థాయికి తీసుకువెళ్తానని హెచ్చరించారు. ఆమె వెంట ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె.స్వరూపారాణి, కార్యదర్శి రమాదేవి, తణుకు డివిజన్ సీపీఎం కార్యదర్శి పీవీ ప్రతాప్, ఆల్ ఇండియా లాయర్స్ యూని యన్ జిల్లా కమిటీ సభ్యుడు కామన మునిస్వామి, ఐద్వా తణుకు డివిజన్ కార్యదర్శి కె.నాగరత్నం, నాయకులు గార రంగారావు, బీఎస్పీ జిల్లా మాజీ అధ్యక్షుడు పొట్ల సురేష్, జేఎస్‌పీ నాయకుడు అనుకుల రమేష్, ఎల్‌ఐసీ ఏజెంట్ల యూనియన్ నాయకుడు పీఎల్ నరసింహరావు ఉన్నారు.
Advertisement
Advertisement