బాధిత కుటుంబాలకు అన్ని విధాలా న్యాయం
ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ
బిఉప్పులూరు(కొలిమిగుండ్ల): పాణ్యం మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్ సమీపంలో దారుణ హత్యకు గురైన ధారా ఓబులేసు, లక్ష్మయ్య కుటుంబాలకు అన్ని విధాలా న్యాయం జరిగేలా చూస్తానని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ హామీ ఇచ్చారు. కోర్టు వాయిదాకు వచ్చి వెళుతుండగా మంగళవారం అన్నదమ్ములిద్దరు హత్యకు గురైన విషయం తెలిసిందే. పోస్ట్‌మార్టం అనంతరం బుధవారం మృతదేహాలను స్వగ్రామం బి.ఉప్పులూరుకు తీసుకొచ్చారు. కలెక్టర్ సీహెచ్ విజయ్‌మోహన్,ఎస్పీ ఆకే రవికృష్ణతో కలిసి చైర్మన్ గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. దోషులను ఎప్పటిలోగా పట్టుకుంటురో చెప్పాలని ఎస్పీని చైర్మన్ కోరారు. పథకం ప్రకారం జరిగిన ఈ హత్యను పోలీసులు ముందుగానే పసిగట్టలేకపోయారా అని అసహనం వ్యక్తం చేశారు. ఎస్సీ కాలనీ వాసులకు గట్టి భద్రత కల్పించాలని పోలీస్ అధికారులకు సూచించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి తక్షణ సాయంగా రూ.6.50 లక్షలు అందించాలని కలెక్టర్‌ను కోరారు. ఓబులేసు, లక్ష్మయ్య భార్యలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. జంట హత్యను జిల్లా యంత్రాంగం తీవ్రంగా పరిగణిస్తోందని కలెక్టర్ విజయ్‌మోహన్ చెప్పారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా గట్టిగా వ్యవహరిస్తామని తెలిపారు. హత్యకు పాల్పడిన నిందితులను నాలుగు రోజుల్లో అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ అన్నారు. కార్యక్రమంలో నంద్యాల ఆర్డీఓ సుధాకరరెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ వినోద్‌కుమార్, ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వరరెడ్డి, కోవెలకుంట్ల, శిరివెళ్ల, ఆళ్లగడ్డ సీఐలు పీటీ కేశవరెడ్డి, ప్రభాకరరెడ్డి, ఓబులేసుతో పాటు సర్కిల్ పరిధిలోని ఎస్‌ఐలు, ఎస్సీ, ఎస్టీ సెల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.