నాన్నా.. మాకెందుకీ శిక్ష?
- మనస్పర్థలతో వేర్వేరుగా ఉంటున్న దంపతులు
- తమను చదివించాలని తండ్రిని కోరిన పిల్లలు
- తండ్రి ఇంటి ముందు బిడ్డల బైఠాయింపు
- రాత్రంతా చలిలో... ఇంటి ముందే నిద్రించిన వైనం
- పోలీసుల జోక్యంతో నిరసన విరమించిన పిల్లలు
నాన్నా.. మేమేం పాపం చేశాం. మమ్మల్ని కనమని అడిగామా..లేదే. మరి మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్లిపోయావ్? మా ఈడు పిల్లల్లాగే మాకూ చదువుకోవాలని ఉంది. బోలెడన్ని కబుర్లు నీతో చెప్పాలని ఉంది. ఇంకా వస్తావని ఎదురు చూశాం. నువ్వేమో వచ్చేలా లేవు. కనీసం మా భవిష్యత్తు గురించైనా ఆలోచించే ఓపిక నీకు లేనట్టుంది. మా గురించి నువ్వే పట్టించుకోకపోతే.. ఇక ఎవరు పట్టించుకుంటారు నాన్నా.. మాకు చదివిస్తానని మాటిచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ ఓ ఇద్దరు చిన్నారులు తండ్రి ఇంటి ముందు రాత్రంతా చలిలో దీక్షకు కూర్చోవడం సంచలనం సృష్టించింది. చివరకు పోలీసుల జోక్యంతో వారు దీక్ష విరమించారు.
- అనంతపురం సెంట్రల్
అనంతపురం భైరవనగర్ మొదటి క్రాస్‌లో నివాసముంటున్న మిలటరీ ఉద్యోగి(డిఫెన్స్) రామాంజనేయరెడ్డి ఇంటి ముందు ఆయన కుమార్తె సుకృత(13), పవన్‌కుమార్‌రెడ్డి(10) గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు నిరసనకు దిగారు. తమకు చదివించాలని, తమ భవిష్యత్తుకు దారి చూపాలని ఆ చిన్నారులిద్దరూ ఇలా రాత్రంతా చలిలో ఒణకుతూ ఆందోళన కొనసాగించడం అందరికీ కన్నీళ్లు తెప్పించింది.
ఎందుకీ పరిస్థితి వచ్చిందంటే..
రామాంజనేయరెడ్డి దంపతుల మధ్య రెండేళ్ల కిందట మనస్పర్ధలు తలెత్తాయి. అప్పటి నుంచి దంపతులు విడిపోయి ఎవరికి వారు వేర్వేరుగా బతుకుతున్నారు. పిల్లలిద్దరూ తల్లి వద్దే ఉంటున్నారు. పాపా తొమ్మిదో తరగతి, బాబు ఏడో తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ ఓ ప్రైవేటు పాఠశాలలో చదివేవారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారమైన నేపథ్యంలో ఫీజు చెల్లించలేక పాఠశాల మానుకున్నారు. కనీసం టీసీ ఇమ్మని అడిగినా పాఠశాల యాజమాన్యం అంగీకరించడం లేదని తెలిపారు. ఫీజు బకాయిలు కట్టేంత వరకు టీసీలు ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి.
ఈ పరిస్థితుల్లో ఆ చిన్నారులిద్దరూ తమ చదువుకు సహకరించాల్సిందిగా కోరేందుకు గురువారం తండ్రి ఇంటి వద్దకు వెళ్లారు. అయితే అతను ఇంట్లోకి రానివ్వకపోవడంతో చిన్నారులిద్దరూ తండ్రి ఇంటి ముందే బైఠాయించారు. రాత్రి పొద్దుపోయేంత వరకూ కూడా వారి సమస్య తెగలేదు. దీంతో ఆ పిల్లలు అక్కడే నిద్రపోయారు. ఒకవైపు తుంపర పడుతుండగా, మరోవైపు చలిలోనే వారు నరకయాతన అనుభవించారు. ఆ చిన్నారులు పడుతున్న కష్టాన్ని చూసిన ఇరుగు పొరుగు ప్రజలు శుక్రవారం ఉదయాన్నే వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు
వెంటనే పోలీసులు రామాంజనేయరెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆందోళన కొనసాగిస్తున్న అతని పిల్లలిద్దరితో మాట్లాడారు. వారి సమస్య అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు వస్తే మాట్లాడుదామంటూ నచ్చజెప్పి పిల్చుకెళ్లారు. ఆస్తిపాస్తులున్నా పిల్లలను చదివించుకోలేని పరిస్థితి ఏర్పడిందని తల్లి వాపోయారు. కాగా దంపతుల మధ్య తలెత్తిన విభేదాలకు సంబంధించిన కేసు న్యాయస్థానంలో నడుస్తున్నందున తామేమీ జోక్యం చేసుకోలేమని పోలీసులు చెప్పారు.
కొసమెరుపు: కుటుంబంలో దంపతుల మధ్య తలెత్తిన విభేదాలు ఏ పాపం ఎరుగని వారి చిన్నారులపై ఎలాంటి ప్రభావం చూపుతోందో ఈ ఉదంతం ఈ ఉదంతం తెలుపుతోంది. అమ్మా.. నాన్నా.. ఇకనైనా ఆలోచించండి. పంతాలు, పట్టింపులకు వెళ్లి మీ పిల్లల జీవితాలతో చెలగాటమాడొద్దండి.