‘కుటుంబ సమస్యలతో చనిపోతున్నా’
-
సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న కేదారిలంక వీఆర్‌ఓ
-
కపిలేశ్వరపురంలోని తన ఇంటిలోనే ప్రాణాలు తీసుకున్న వైనం
-
దుర్వాసన వస్తుండడంతో తలుపులు తెరిచిన స్థానికులు
కపిలేశ్వరపురం :
మండలంలోని కేదారిలంకలో వీఆర్‌ఏగా పనిచేస్తున్న కపిలేశ్వరపురానికి చెందిన మాతా రాంబాబు (30) తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర దుర్వాసన రావడంతో మంగళవారం కుటుంబ సభ్యులు, స్థానికులు తలుపులు తెరిచి చూడగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ‘‘కుటుంబ సమస్యల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టడంతో దీనిని ఆత్మహత్యగా అంగర ఎస్సై కె.దుర్గాప్రసాద్ కేసును నమోదు చేశారు. ఎస్సై దుర్గాప్రసాద్, కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం...
రాంబాబు కపిలేశ్వరపురంలోని చిన్న వంతెన వద్దగల తన ఇంటిలో నివాసం ఉంటూ విధి నిర్వహణ కోసం కేదారిలంకకు వెళ్లి వస్తున్నాడు. భార్య దీపిక తన అమ్మగారి ఊరైన బిక్కవోలు మండలం కాపవరంలోనే తన ఇద్దరి కుమారులతో ఉంటూ అంగన్‌వాడీగా పనిచేస్తోంది. ఇదిలా ఉండగా ఈ నెల 14న కపిలేశ్వరపురంలోని తన గదిలో రాంబాబు ఉరి వేసుకున్నాడు. రాంబాబుతో మనస్పర్థలు రావడంతో సోదరులు అతడిని కొంతకాలంగా పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆత్మహత్య విషయాన్ని ఎవరూ గమనించలేకపోయారు. మంగళవారం గది నుంచి తీవ్ర దుర్గంధం రావడంతో బంధువులు, స్థానికులు తలుపులు తెరిచి చూడగా.. రాంబాబు శరీరం ఉబ్బి వేలాడుతూ కనిపించింది.
స్థానికులు గ్రామ వీఆర్వో టి.సత్యనారాయణకు తెలియపర్చగా అతను అంగర ఎస్సై కె.దుర్గాప్రసాద్‌కు సమాచారమిచ్చారు. శవపంచనామా నిర్వహించారు. తాను కుటుంబ సమస్యలు కారణంగా జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటునాన్నంటూ రాసి ఉన్న లెటర్‌ను ఎస్సై స్వాధీనపర్చుకున్నారు. దాని ఆధారంగా ఆత్మహత్యగా కేసును నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ‘‘నన్ను, పిల్లల్ని అనాథలను చేసి వెళ్లిపోయావా! అంటూ భార్య దీపిక రోధిస్తున్న తీరు చూపరులను కంట తడిపెట్టించింది.