vro suicide
-
వీఆర్ఓ ఆత్మహత్య
నార్కట్‌పల్లి: పని ఒత్తిడి భరించలేక ఓ వీఆర్ఓ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం నెమ్మాని గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పంగ కృష్ణయ్య (46) కట్టంగూర్ మండలం పరడ గ్రామంలో వీఆర్ఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. పాసు పుస్తకాలు అందడం లేదని, రైతుబంధు పథకానికి దూరమవుతున్నామని పలువురు రైతులు ఇటీవల కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్.. రైతుల సమస్యలను పరిష్కరించాలని ఇన్చార్జి తహసీల్దార్ మహ్మద్ అలీని ఆదేశించారు. దీంతో ఈ నెల 7న కృష్ణయ్యతో పాటు మరో ఐదుగురికి చార్జీ మెమోలు జారీ చేశారు. పని ఒత్తిడితో పాటు మెమో రావడంతో మనస్తాపానికి గురైన కృష్ణయ్య.. తన పొలం వద్ద పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కల రైతులు గమనించి వెంటనే నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. పని ఒత్తిడితోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని భార్య పుష్పలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపారు. బదిలీ చేయాలని విజ్ఞప్తి గ్రామంలో పని ఒత్తిడి తీవ్రంగా ఉందని, తనను బదిలీ చేయాలని కృష్ణయ్య.. తహసీల్దార్‌ను కోరగా, ఈ నెల 20వ తేదీ తర్వాత చేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈలోపే అతను ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
ఉసురు తీశారు!
కోవెలకుంట్ల: జిల్లాలో ఉద్యోగులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించలేని పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పార్టీ నాయకుల వేధింపులు, ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో కొందరు అనారోగ్యానికి గురై చనిపోతున్నారు. అలాగే బలవన్మరణాలకూ పాల్పడుతున్నారు. కోవెలకుంట్ల మండలం బిజనవేముల గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్ఓ) హాజీవలి అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల నేపథ్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోనే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. చుక్కల భూమి వ్యవహారానికి రాజకీయ ఒత్తిళ్లు తోడు కావడంతో తన తమ్ముడు బలవన్మరణానికి పాల్పడ్డాడని హాజీవలి సోదరుడు మహబూబ్‌బాషా తెలిపాడు. పొరపాటున చేసిన ఒక సంతకం కారణంగా గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు, అధికార పార్టీ నాయకులు తన తమ్ముణ్ని భయభ్రాంతులకు గురి చేసినట్లు చెప్పాడు. ‘మంగళవారం ఎమ్మెల్యే ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. బంజరు భూమికి సంబంధించిన వ్యవహారంపై తీవ్రస్థాయిలో మందలించారు. ఈ ఒత్తిళ్లు భరించలేను. ఆత్మహత్య చేసుకుంటా’నంటూ తన తమ్ముడు రాత్రి స్వయంగా ఫోన్ చేసి వాపోయాడంటూ మహబూబ్‌బాష కన్నీటి పర్యంతమయ్యాడు. తాను రాత్రి వచ్చి ఉంటే తమ్ముణ్ని బతికించుకునే వాడినని, ఉదయం(బుధవారం) వస్తానని చెప్పి ఫోన్ పెట్టేసిన 12 గంటల వ్యవధిలోనే విగతజీవిగా మారాడని విలపించాడు. హాజీవలి గత ఏడాది పాణ్యం మండలం గోరుకల్లు నుంచి బదిలీపై బిజనవేముల వీఆర్ఓగా వచ్చారు. గత ఏడాది పెద్దకుమార్తె ఉసేన్బీకి వివాహం చేశారు. రెండో కుమార్తె ఇసాన్బీ కోవెలకుంట్ల పట్టణంలోని సప్తగిరి పాఠశాలలో ఏడో తరగతి, కుమారుడు హాజీబాష ఇదే పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నారు. బిజనవేముల గ్రామానికి చెందిన శ్రీనివాసరావుకు 1996వ సంవత్సరంలో 2.24 ఎకరాల బంజరు భూమిని అధికారులు ఇచ్చారు. ఆ వ్యక్తి సాగులో లేకపోవడంతో ఇదే గ్రామానికి చెందిన పుల్లయ్య అనే వ్యక్తి అనుభవంలో ఉంచుకున్నాడు. అతను అధికార పార్టీ అండదండలతో ఇటీవలే ఆ భూమికి పట్టాదారు పాసుపుస్తకం పొందాడు. ఒకరి పేరున ఉన్న పట్టాను రద్దు పరచకుండా మరొకరికి పాసుపుస్తకం ఎలా ఇస్తారంటూ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు వీఆర్ఓను బెదిరించారు. దీనిపై ఉన్నతాధికారులకూ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం పెద్దది కావడంతో పట్టాదారు పాసుపుస్తకాన్ని రద్దు చేసేందుకు వీఆర్ఓ సిద్ధపడ్డారు. ఇది తెలిసి పుల్లయ్య అధికార పార్టీ నాయకులతో ఫోన్ చేయించి.. వీఆర్ఓను తిట్టించాడు. బెదిరింపులు, ఒత్తిళ్లు తట్టుకోలేక హాజీవలి నాలుగు రోజుల పాటు సెలవు ఇవ్వాలని పై అధికారులను కోరారు. అయితే.. సెలవు మంజూరు కాలేదు. ఇదే తరుణంలో ఒత్తిళ్లు తీవ్రం కావడంతో మనస్తాపానికి గురై.. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని వీఆర్ఓల విశ్రాంతి గదిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజకీయ నాయకుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని,, తమకు న్యాయం చేయాలంటూ వీఆర్ఓ మృతదేహంతో కుటుంబ సభ్యులు స్థానిక గ్రామ పంచాయతీ సర్కిల్లో రోడ్డుపై బైఠాయించారు. వేధింపులకు గురి చేసి పొట్టన పెట్టుకున్నారని, తండ్రిని పోగొట్టుకున్న ముగ్గురు పిల్లల పరిస్థితి ఏమిటని వారు వాపోయారు. విషయం తెలిసిన వెంటనే నంద్యాల ఆర్డీఓ రామసుందర్‌రెడ్డి, బనగానపల్లె నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కర్రా హర్షవర్ధరెడ్డి, వీఆర్ఓల సంఘం నాయకులు ఇమాంబాష, హసన్, హరి, ప్రసాదరెడ్డి, సంజీవయ్య తదితరులు ఆసుపత్రికి చేరుకుని మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. కాల్ డేటా ఆధారంగా విచారణ జరపాలి వీఆర్ఓ హాజీవలి ఆత్మహత్య ఘటనకు సంబంధించి కాల్‌డేటా ఆధారంగా విచారణ చేపట్టాలని ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గువ్వల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఆసుపత్రి ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వీఆర్ఓను కొందరు వ్యక్తులు ఫోన్లో బెదిరించడం వల్లే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. మంగళవారం వీఆర్ఓకు వచ్చిన ఫోన్ కాల్స్ డేటాను బయటకు తీస్తే వాస్తవాలు తెలిసే ఆస్కారం ఉందన్నారు. ప్రత్యేక కమిటీ వేసి ఆత్మహత్యకు గల కారణాలను వెలికితీసి.. ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. -
‘కుటుంబ సమస్యలతో చనిపోతున్నా’
సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న కేదారిలంక వీఆర్ఓ కపిలేశ్వరపురంలోని తన ఇంటిలోనే ప్రాణాలు తీసుకున్న వైనం దుర్వాసన వస్తుండడంతో తలుపులు తెరిచిన స్థానికులు కపిలేశ్వరపురం : మండలంలోని కేదారిలంకలో వీఆర్ఏగా పనిచేస్తున్న కపిలేశ్వరపురానికి చెందిన మాతా రాంబాబు (30) తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర దుర్వాసన రావడంతో మంగళవారం కుటుంబ సభ్యులు, స్థానికులు తలుపులు తెరిచి చూడగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ‘‘కుటుంబ సమస్యల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టడంతో దీనిని ఆత్మహత్యగా అంగర ఎస్సై కె.దుర్గాప్రసాద్ కేసును నమోదు చేశారు. ఎస్సై దుర్గాప్రసాద్, కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం... రాంబాబు కపిలేశ్వరపురంలోని చిన్న వంతెన వద్దగల తన ఇంటిలో నివాసం ఉంటూ విధి నిర్వహణ కోసం కేదారిలంకకు వెళ్లి వస్తున్నాడు. భార్య దీపిక తన అమ్మగారి ఊరైన బిక్కవోలు మండలం కాపవరంలోనే తన ఇద్దరి కుమారులతో ఉంటూ అంగన్వాడీగా పనిచేస్తోంది. ఇదిలా ఉండగా ఈ నెల 14న కపిలేశ్వరపురంలోని తన గదిలో రాంబాబు ఉరి వేసుకున్నాడు. రాంబాబుతో మనస్పర్థలు రావడంతో సోదరులు అతడిని కొంతకాలంగా పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆత్మహత్య విషయాన్ని ఎవరూ గమనించలేకపోయారు. మంగళవారం గది నుంచి తీవ్ర దుర్గంధం రావడంతో బంధువులు, స్థానికులు తలుపులు తెరిచి చూడగా.. రాంబాబు శరీరం ఉబ్బి వేలాడుతూ కనిపించింది. స్థానికులు గ్రామ వీఆర్వో టి.సత్యనారాయణకు తెలియపర్చగా అతను అంగర ఎస్సై కె.దుర్గాప్రసాద్‌కు సమాచారమిచ్చారు. శవపంచనామా నిర్వహించారు. తాను కుటుంబ సమస్యలు కారణంగా జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటునాన్నంటూ రాసి ఉన్న లెటర్‌ను ఎస్సై స్వాధీనపర్చుకున్నారు. దాని ఆధారంగా ఆత్మహత్యగా కేసును నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ‘‘నన్ను, పిల్లల్ని అనాథలను చేసి వెళ్లిపోయావా! అంటూ భార్య దీపిక రోధిస్తున్న తీరు చూపరులను కంట తడిపెట్టించింది. -
రైలు కింద పడి వీఆర్వో ఆత్మహత్య
టెక్కలి: శ్రీకాకుళం జిల్లాలో ఓ వీఆర్వో బలవన్మరణానికి పాల్పడ్డాడు. టెక్కలి మండలం చాకిపల్లి వీఆర్వోగా పనిచేస్తున్న సాంబమూర్తి కుటుంబసభ్యులకు చెప్పకుండా రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సోమవారం నౌపడా రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలపై గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సాంబమూర్తి కుటుంబసభ్యులు మంగళవారం మృతదేహాన్ని గుర్తించటంతో ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.