
హాజీవలి మృతదేహం వద్ద విలపిస్తున్న కుమార్తె, కుమారుడు
కోవెలకుంట్ల: జిల్లాలో ఉద్యోగులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించలేని పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పార్టీ నాయకుల వేధింపులు, ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో కొందరు అనారోగ్యానికి గురై చనిపోతున్నారు. అలాగే బలవన్మరణాలకూ పాల్పడుతున్నారు. కోవెలకుంట్ల మండలం బిజనవేముల గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్‌ఓ) హాజీవలి అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల నేపథ్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోనే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. చుక్కల భూమి వ్యవహారానికి రాజకీయ ఒత్తిళ్లు తోడు కావడంతో తన తమ్ముడు బలవన్మరణానికి పాల్పడ్డాడని హాజీవలి సోదరుడు మహబూబ్‌బాషా తెలిపాడు. పొరపాటున చేసిన ఒక సంతకం కారణంగా గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు, అధికార పార్టీ నాయకులు తన తమ్ముణ్ని భయభ్రాంతులకు గురి చేసినట్లు చెప్పాడు.
‘మంగళవారం ఎమ్మెల్యే ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. బంజరు భూమికి సంబంధించిన వ్యవహారంపై తీవ్రస్థాయిలో మందలించారు. ఈ ఒత్తిళ్లు భరించలేను. ఆత్మహత్య చేసుకుంటా’నంటూ తన తమ్ముడు రాత్రి స్వయంగా ఫోన్ చేసి వాపోయాడంటూ మహబూబ్‌బాష కన్నీటి పర్యంతమయ్యాడు. తాను రాత్రి వచ్చి ఉంటే తమ్ముణ్ని బతికించుకునే వాడినని, ఉదయం(బుధవారం) వస్తానని చెప్పి ఫోన్ పెట్టేసిన 12 గంటల వ్యవధిలోనే విగతజీవిగా మారాడని విలపించాడు. హాజీవలి గత ఏడాది పాణ్యం మండలం గోరుకల్లు నుంచి బదిలీపై బిజనవేముల వీఆర్‌ఓగా వచ్చారు. గత ఏడాది పెద్దకుమార్తె ఉసేన్‌బీకి వివాహం చేశారు. రెండో కుమార్తె ఇసాన్‌బీ కోవెలకుంట్ల పట్టణంలోని సప్తగిరి పాఠశాలలో ఏడో తరగతి, కుమారుడు హాజీబాష ఇదే పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నారు. బిజనవేముల గ్రామానికి చెందిన శ్రీనివాసరావుకు 1996వ సంవత్సరంలో 2.24 ఎకరాల బంజరు భూమిని అధికారులు ఇచ్చారు. ఆ వ్యక్తి సాగులో లేకపోవడంతో ఇదే గ్రామానికి చెందిన పుల్లయ్య అనే వ్యక్తి అనుభవంలో ఉంచుకున్నాడు.
అతను అధికార పార్టీ అండదండలతో ఇటీవలే ఆ భూమికి పట్టాదారు పాసుపుస్తకం పొందాడు. ఒకరి పేరున ఉన్న పట్టాను రద్దు పరచకుండా మరొకరికి పాసుపుస్తకం ఎలా ఇస్తారంటూ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు వీఆర్‌ఓను బెదిరించారు. దీనిపై ఉన్నతాధికారులకూ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం పెద్దది కావడంతో పట్టాదారు పాసుపుస్తకాన్ని రద్దు చేసేందుకు వీఆర్‌ఓ సిద్ధపడ్డారు. ఇది తెలిసి పుల్లయ్య అధికార పార్టీ నాయకులతో ఫోన్ చేయించి.. వీఆర్‌ఓను తిట్టించాడు. బెదిరింపులు, ఒత్తిళ్లు తట్టుకోలేక హాజీవలి నాలుగు రోజుల పాటు సెలవు ఇవ్వాలని పై అధికారులను కోరారు. అయితే.. సెలవు మంజూరు కాలేదు. ఇదే తరుణంలో ఒత్తిళ్లు తీవ్రం కావడంతో మనస్తాపానికి గురై.. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని వీఆర్‌ఓల విశ్రాంతి గదిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
రాజకీయ నాయకుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని,, తమకు న్యాయం చేయాలంటూ వీఆర్‌ఓ మృతదేహంతో కుటుంబ సభ్యులు స్థానిక గ్రామ పంచాయతీ సర్కిల్‌లో రోడ్డుపై బైఠాయించారు. వేధింపులకు గురి చేసి పొట్టన పెట్టుకున్నారని, తండ్రిని పోగొట్టుకున్న ముగ్గురు పిల్లల పరిస్థితి ఏమిటని వారు వాపోయారు. విషయం తెలిసిన వెంటనే నంద్యాల ఆర్డీఓ రామసుందర్‌రెడ్డి, బనగానపల్లె నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కర్రా హర్షవర్ధరెడ్డి, వీఆర్‌ఓల సంఘం నాయకులు ఇమాంబాష, హసన్, హరి, ప్రసాదరెడ్డి, సంజీవయ్య తదితరులు ఆసుపత్రికి చేరుకుని మృతుని కుటుంబాన్ని పరామర్శించారు.
కాల్ డేటా ఆధారంగా విచారణ జరపాలి
వీఆర్‌ఓ హాజీవలి ఆత్మహత్య ఘటనకు సంబంధించి కాల్‌డేటా ఆధారంగా విచారణ చేపట్టాలని ఏపీ ఎన్‌జీఓ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గువ్వల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఆసుపత్రి ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వీఆర్‌ఓను కొందరు వ్యక్తులు ఫోన్‌లో బెదిరించడం వల్లే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. మంగళవారం వీఆర్‌ఓకు వచ్చిన ఫోన్ కాల్స్ డేటాను బయటకు తీస్తే వాస్తవాలు తెలిసే ఆస్కారం ఉందన్నారు. ప్రత్యేక కమిటీ వేసి ఆత్మహత్యకు గల కారణాలను వెలికితీసి.. ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

వీఆర్‌ఓ మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న బనగానపల్లె నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త కాటసాని రామిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment