అన్నదాతకూ అగచాట్లు | farmars also struggle to currecy effect | Sakshi
Sakshi News home page

అన్నదాతకూ అగచాట్లు

Published Mon, Nov 21 2016 11:19 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

అన్నదాతకూ అగచాట్లు - Sakshi

అన్నదాతకూ అగచాట్లు

 కష్టాల ముంగిట వ్యవసాయం
 ధాన్యం అమ్మినా చేతికందని డబ్బు
 పంట కోత, రబీ పెట్టుబడులకు తప్పని ఇబ్బందులు
 
వీరవాసరం మండలం పంజావేమవరం గ్రామానికి చెందిన ఈ రైతు పేరు గంటా సుబ్రహ్మణ్యం. భీమవరం మండలం తాడేరులో ఏడు ఎకరాల్లో వరి సాగు చేశారు. పంటంతా కోతకొచ్చింది. నాలుగు ఎకరాల్లో కోత కోసే పనిని కూలీలకు కాంట్రాక్ట్‌కు ఇచ్చారు. ఎకరాకు రూ.2 వేల చొప్పున మొత్తం రూ.8 వేలు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. 22 మంది కూలీలొచ్చి పని పూర్తి చేశారు. వారికి కూలి డబ్బులు చెల్లించేందుకు సుబ్రహ్మణ్యం బ్యాంకుకు వెళ్లి నగదు తీసుకుంటే రూ.2 వేల నోట్లు ఇచ్చారు. వాటిని కూలీలకు ఇవ్వగా, పెద్దనోట్లు ఇస్తే తాము ఎలా పంచుకోవాలని ప్రశ్నించారు. చిల్లర నోట్లు ఇవ్వాలని పట్టుబట్టారు. ఏంచేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఈ రైతు చిల్లర నోట్ల కోసం రెండు రోజులుగా తెలిసిన వాళ్ల చుట్టూ తిరుగుతుంటే.. కూలి డబ్బులు చేతికి అందక కూలీలు బేలచూపుతు చూస్తున్నారు. ఈ పరిస్థితి సుబ్రహ్మణ్యం ఒక్కరికే పరిమితం కాదు.
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
పెద్ద నోట్ల రద్దు రైతన్నలకు కష్టాలు తెచ్చిపెట్టింది. వరి కోత, మాసూళ్లు చేసుకోవడం కష్టతరంగా మారింది. కొత్త పంట వేయడం సంగతి దేవుడెరుగు.. కోతకొచ్చిన పంటను ఒబ్బిడి చేసుకునే పరిస్థితి లేక రైతుల బిత్తరచూపులు చూస్తున్నారు. ధాన్యం అమ్మినా నగదు చేతికి అందక ఆందోళన చెందుతున్నారు. కష్టాలకోర్చి మాసూళ్లు పూర్తిచేసి కమీషన్‌దారులకు ధాన్యం అమ్మినా బదులు చెక్కులు ఇస్తున్నారు. చెక్కుల క్లియరెన్స్‌ కోసం 10 రోజులకు పైగా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ సొమ్ము చేతికొచ్చినా రూ.2 వేల నోట్లు ఇస్తుండటంతో వాటిని మార్చుకోలేని పరిస్థితి. మరోవైపు ధాన్యం వ్యాపారుల్లో కొందరు రూ.500, రూ.1000 నోట్లు అంటగడుతున్నారు. ఽవీటిని మార్చుకోవడం కోసం రైతులు బ్యాంకుల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది. 
కూలి డబ్బులు సైతం ఇవ్వలేక..
కోత, నూర్పిడి, ధాన్యాన్ని బస్తాలకు ఎక్కించడం వంటి పనులు చేసిన కూలీలకు సొమ్ములు ఇచ్చేందుకు చిల్లర నోట్లు లేక రైతులు నానా తంటాలు పడుతున్నారు. మరోవైపు రబీ సీజన్‌ మొదలవుతుండటంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి అవసరమైన పెట్టుబడి అందుబాటులో లేకుండా పోయింది. దీంతో ఎరువుల అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి. పొగాకు పంటకు, రాబోయే రబీ పంటకు ఎరువులు కొనుగోలు చేయాల్సి ఉంది. ఏటా ఈ సీజన్‌లో జరిగే వ్యాపారంతో పోలిస్తే పదో వంతు కూడా ఎరువుల అమ్మకాలు సాగడం లేదు.  రద్దు చేసిన నోట్లను వ్యాపారులు తీసుకోవడం లేదు. 
మెట్టలోనూ ఇక్కట్లే
వ్యాపారులు చెక్కులు ఇచ్చినప్పటికీ బ్యాంకుల్లో వారానికి రూ.20 వేలకు మించి ఇవ్వకపోవడంతో రైతు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మెట్ట ప్రాంతంలో ఇప్పటికే పత్తి పంట చేతికి రాగా, దానిని విక్రయించేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. పత్తి వ్యాపారులు కొంత మందికి చెక్కులు, మరికొంత మందికి పాత నోట్లు ఇస్తున్నారు.  మరోవైపు సరైన ధర రావడం లేదు. పత్తి ఏరిన కూలీలకు డబ్బులు చెల్లించే పరిస్థితి లేకుండాపోయిందని సాగుదారులు వాపోతున్నారు.
 
ఆంక్షలు సడలించినా..
బ్యాంకుల నుంచి నగదు తీసుకునే విషయంలో విధించిన ఆంక్షలను రైతుల విషయంలో కొంతమేర సడలించినా కష్టాలు తీరడం లేదు. పంట రుణం పొందిన, కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ఉన్న రైతు తన ఖాతా నుంచి వారానికి రూ.25 వేల నగదు తీసుకోవచ్చని, పంట అమ్మగా వచ్చిన డబ్బు ఆర్‌టీజీఎస్‌ లేదా చెక్కు ద్వారా తన ఖాతాలోకి వచ్చి ఉంటే అదనంగా వారానికి మరో రూ.25 వేఽలు డ్రా చేసుకోవచ్చని చెబుతున్నా బ్యాంకు అధికారులు అంత నగదు ఇవ్వడం లేదు. రబీ సీజన్‌ మొదలైన నేపథ్యంలో పెట్టుబడులు, ఎరువులు, ఇతర ఖర్చుల నిమిత్తం రైతులకు గరిష్టంగా రూ.50 వేలు డ్రా చేసుకునే అవకాశం ఉన్నా బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా రూ.10 వేల నుంచి రూ.20వేల లోపు మాత్రమే ఇస్తున్నారు. 
 
ఎరువులు కొనాలంటే కష్టంగా ఉంది
ఎరువులు కొనుక్కోవాలంటే కష్టంగా ఉంది. పెద్దనోట్లు మారకపోవడంతో పంటలకు పెట్టుబడి పెట్టలేక ఇబ్బందులు పడుతున్నాం. గేదెలకు మినరల్‌ మిక్చర్‌ కొనడానికి కూడా డబ్బులు ఉండటం లేదు.
  పల్లపోతు శ్రీనివాసరావు అప్పనవీడు, పెదపాడు మండలం
 
కూలీలకు డబ్బులివ్వలేదు
ధాన్యం మాసూళ్లు చేసిన కూలీలకు డబ్బులివ్వాలి. కోసిన ధాన్యమంతా పొలంలోనే ఉంది. పాత నోట్లు తీసుకోమంటే మాకొద్దని కూలీలు, కోత యంత్రాల వాళ్లు అంటున్నారు. టౌన్‌కు వెళ్లిరావాలంటే కష్టంగా ఉంది. అక్కడ బ్యాంకుల చుట్టూ తిరిగే సమయం లేదు. వెళ్లినా అవసరమైనన్ని నోట్లు ఇస్తారనే ఆశలేదు. బ్యాంకుల వల్ల రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలి.
 సారిక సుబ్బారావు, కౌలు రైతు, మారంపల్లి
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement