విద్యుదాఘాతంతో రైతు మృతి
Published Mon, May 8 2017 11:01 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
ఎమ్మిగనూరు రూరల్: పార్లపల్లి గ్రామంలో ఓ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన కుమ్మరి ఉరుకుందు(49)కు ఎకరా పొలం ఉంది. ఆదివారం రాత్రి వీచిన గాలులకు ఇతని పొలం పక్కనే విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. విద్యుత్ సరఫరా అవుతుండటంతో కుక్క, పిల్లి మృతి చెందాయి. సోమవారం ఉదయం పొలానికి వెళ్తున్న ఉరుకుందు మృతి చెందిన కుక్క, పిల్లిని గమనిస్తూ పక్కనే ఉన్న తీగను గుర్తించలేక పోయాడు. చూడకుండా విద్యుత్ తీగపై కాలు పెట్టడంతో విద్యుదాఘాతానికి గురై కేకలు వేశాడు. అటుగా వెళ్తున్న రైతులు అతడిని కాపాడే ప్రయత్నం చేసి విఫలం చెందాడు. అప్పటికే ఉరుకుందు మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారులు బీమేష్, రామాంజనేయులు ఉన్నారు.
సమాచారం తెలుసుకున్న రూరల్ ఎస్‌ఐ వేణుగోపాల్, పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకొని ప్రమాద తీరును పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. తెగిపడిన విద్యుత్ తీగలను సిబ్బంది గుర్తించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
Advertisement