అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
త్రిపురారం
కాలం కలిసిరాక వ్యవసాయంలో సరైన దిగుబడి రాలేదు. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక తీవ్ర మనస్తాపానికి గురైన ఓ రైతు ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని బడాయిగడ్డలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బడాయిగడ్డ గ్రామానికి చెందిన ఇస్లావత్ తులస్యా(42) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తనకున్న నాలుగు ఎకరాల పది గుంటల వ్యవసాయ భూమిలో గత కొన్ని ఏళ్ళుగా వరి సాగు చేస్తున్నాడు. రెండేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటలు పండలేదు. చేసిన అప్పులు పెరగడంతో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని అమ్ముకున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసేందుకు అప్పుతెచ్చి 10 గుంటల వ్యవసాయలో రెండు నెలల క్రితం రెండు బోర్లు వేసిన నీళ్లు పడలేదు. చేసేందుకు కొంత అప్పు తెచ్చాడు. వడ్డీ, అసలు కలిపి సుమారు రూ.5లక్షల అప్పు పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం ఉదయం ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఇస్లావత్ తులస్యాను చికిత్స నిమిత్తం వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు, మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యాలాద్రి తెలిపారు.