క‌ల‌సి రాని సాగు కాటికి త‌రిమింది | farmer sucide | Sakshi
Sakshi News home page

క‌ల‌సి రాని సాగు కాటికి త‌రిమింది

Published Wed, Jul 26 2017 11:54 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

క‌ల‌సి రాని సాగు కాటికి త‌రిమింది - Sakshi

క‌ల‌సి రాని సాగు కాటికి త‌రిమింది

అప్పులు తీర్చలేక కౌలురైతు ఆత్మహత్య
వీకే రాయపురం (సామర్లకోట) : తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండల పరిధిలో వీకే రాయపురం గ్రామానికి చెందిన ఒక కౌలు రైతు అప్పులు తీర్చలేక, దాతలకు ముఖం చూపలేక పురుగుల మందు తాగి మంగవారం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన మలిరెడ్డి సూరిబాబు (33) 10 ఏళ్లుగా సుమారు 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నాడు. ప్రకృతి వైపరీత్యాలతో తరచూ పంట నష్టం జరుగుతుండడంతో రైతులు కౌలు చెల్లించలేక సుమారు రూ.6 లక్షలు అప్పులపాలయ్యాడు. దీంతో మంగళవారం పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పొలంలో పడి ఉన్న సూరిబాబును అతని బంధువులు గమనించి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. సూరిబాబుకు భార్య, ఐదేళ్ల కుమారుడు, ఏడాది కుమార్తె ఉన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ న్యాయం చేయాలని గ్రామ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. కౌలు రైతులకు రుణాలు, ప్రభుత్వ నుంచి అందే సహాయం సక్రమంగా అందక పోవడంతోనే తరుచూ ఇటువంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.  సూరిబాబు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసి ఇంద్రపాలెం ఎస్సై డి.రామారావు దర్యాప్తు చేస్తున్నారు.
పంట నష్టాలే ముంచాయి..
కుటుంబానికి పెద్ద అయిన తండ్రి గంగరాజు చని పోవడం, తమ్ముడు వీర్రాజుకు పెళ్లి కాకుండానే చని పోవడంతో కుటుంబంలో అప్పులు తీర్చలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు మానసిక దౌర్బల్యానికి గురవడం, గ్రామానికి చెందిన ఐదుగురి నుంచి తీసుకున్న సుమారు రూ.ఆరు లక్షలు అప్పు తీర్చలేని పరిస్థితి ఏర్పడింది. వారి నుంచి ఎటువంటి ఒత్తిడీ లేకపోయినా వారికి ముఖం చూపలేక ఇబ్బందిపడేవాడని బంధువులు, భార్య సత్యగౌరి తెలిపారు. కౌలు రైతులకు నేరుగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందక పోవడం, తరుచూ పంట నష్టం జరగడంతో అప్పులు పెరిగి పోయాయని కుటుంబ సభ్యులు తలారి దొరబాబు, అడబాల శివయ్యనాయుడు తెలిపారు. గత ఆరు నెలల క్రితం కౌలు కార్డు తీసుకున్నా గ్రామంలో ఉన్న బ్యాంకు అప్పు ఇవ్వక పోవడంతో బయట వ్యక్తుల నుంచి అప్పులు చేసి పంటకు పెట్టుబడి పెట్టాల్సి వచ్చిందని వారు తెలిపారు. సూరిబాబు ఆత్మహత్యతో భార్య సత్య గౌరిని ఓదార్చడం కుటుంబ సభ్యులకు కష్టంగా మారింది. ఇంటిలో అందరూ కంట తడి పెట్టుకోవడంతో ఏం జరిగిందో తెలియక కుమారుడు రిషాల్, కుమార్తె వైష్టవి మహాలక్ష్మీ బిత్తర చూపులు చూడడం స్థానికుల హృదయాలను కదిలించింది.
పోలీసుల విచారణ..
కౌలు రైతు సూరిబాబు పురుగుల మందు తాగి చనిపోవడంతో ఇంద్రపాలెం పోలీసులు బుధవారం రాత్రి గ్రామానికి వచ్చి బాధితుని కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. మృతుని కుటుంబ సభ్యులకు ఎటువంటి ఆధారం లేదని ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు తెలిపారు.
26పీటీపీ53: సూరిబాబు మృతితో రోదిస్తున్న కుటుంబ సభ్యులు
 
26పీటీపీ46: కుటుంబ సభ్యులతో మలిరెడ్డి సూరిబాబు (పాత చిత్రం)
 
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement