పురుగుల మందులు
బోనకల్ :
మండలంలోని గోవిందాపురం (ఎల్) గ్రామంలో అప్పుల బాధతో పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరడకు చెందిన కంచెం వెంకన్న (40) బతుకుతెరువు కోసం గోవిందాపురం (ఎల్) గ్రామానికి మూడేళ్ల క్రితం వలస వచ్చాడు. నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిరప సాగు చేశాడు. ఖాళీ సమయాల్లో కూలీ పనులకు వెళ్లేవాడు. కాలం కలిసి రాకపోవడంతో పెట్టిన పెట్టుబడులు కూడా పూడక రూ.3 లక్షల వరకు అప్పులయ్యాయి. వీటిని ఎలా తీర్చాలనే బెంగతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకన్నకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని స్వగ్రామం నేరడకు తీసుకెళ్లారు.