హద్దు రాళ్లను తొలగిస్తున్న రైతులు
-
భూ సేకరణను అడ్డుకున్న దివిటిపల్లి రైతులు
-
హద్దురాళ్లు, జెండాలను తొలగించిన రైతులు
-
భూమికి భూమి, ఇంటికో ఉద్యోగం
-
డబుల్ బెడ్‌రూంల డిమాండ్
మహబూబ్‌నగర్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాల, జిల్లా జైలు, డబుల్ బెడ్‌రూంల నిర్మాణానికి గాను మహబూబ్‌నగర్ మండలం ఎదిర గ్రామపంచాయతీ పరిధిలోని దివిటిపల్లి గ్రామ రైతుల నుండి సేకరించతలపెట్టిన భూసేకరణను ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు. ఎదిర, దివిటిపల్లి గ్రామాల్లో సుమారు 112 ఎకరాల అసైన్డు భూములను సేకరించడానికి అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా ఇదివరకు సేకరించిన భూమి చుట్టూ హద్దు రాళ్లను, జెండాలను ఏర్పాటు చేశారు.
ఇందిర హయాంలో భూ పంపిణీ
1969లో సర్వేనంబర్లు 423, 417, 425, 372లలో దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హయాంలో 36 మంది రైతులకు 97 ఎకరాల అసైన్డు భూమిని పంపిణీ చేసి 1972లో పట్టాలు ఇచ్చారు. ప్రస్తుతం ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వీరికి సమాచారం ఇవ్వకుండానే జెండాలు, హద్దు రాళ్లను పాతడం, భూములను స్వాధీనం చేసుకోవడం పట్ల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 36 మంది రైతులకు సంబంధించి 97 ఎకరాల భూమిని సర్వే చేసి సరిహద్దు రాళ్లను పాతి వెళ్లారు.
హద్దు రాళ్లను తొలగించిన రైతులు
రైతులు మంగళవారం తమ భూముల్లో అధికారులు పాతిన హద్దు రాళ్లు, జెండాలను తొలగించారు. భూ సేకరణ జరిపే ముందు తమకు సమాచారం అందించాలని, భూమికి భూమి ఇవ్వాలని, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్‌రూంల నిర్మాణాలలో భూములు కోల్పోతున్న రైతులందరికీ అవకాశం కల్పించాలని, అలా చేయని పక్షంలో భూసేకరణను అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. భూములు కోల్పోతున్న తమకు డబుల్ బెడ్‌రూంల నిర్మాణాలలో అవకాశం ఇవ్వకుండా ఇతరులకు తమ భూముల్లో ఇళ్లు కట్టిస్తామని పేర్కొనడంతో వారిలో ఆవేశాన్ని రగిల్చింది. తమకే డబుల్ బెడ్‌రూంలు నిర్మించి ఇవ్వాలని, తమ డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకోవాలని, కలెక్టర్ స్వయంగా వచ్చి తమకు హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
అఖిలపక్ష పార్టీల నాయకుల మద్దతు
దివిటిపల్లి గ్రామ రైతుల ఆందోళనకు అఖిలపక్ష పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. తమ ఆందోళనకు రాజకీయ పార్టీల నాయకుల మద్దతు తోడు కావడంతో రైతులు ఉద్యమాన్ని తీవ్రరూపం చేయడానికి సిద్ధమవుతున్నారు.
నానా కష్టాలు పడ్డాం
1969లో నానా తిప్పలు పడి భూమిని సంపాదించుకున్నాం. చస్తే కూడా బొందలు పెట్టుకోవడానికి మాకు స్థలం లేదు. ప్రాణం పోయినా సరే భూములను వదలం.
– నర్సింహులు, రైతు
అన్యాయం చేస్తుండ్రు
గుట్టలు, చెట్లు చదును చేసుకొని ప్రభుత్వం ఇచ్చిన భూమిలో పంట లు సాగు చేసున్నాం. అధికారులు అన్యాయంగా భూమిని లాక్కుంటున్నారు. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం.
– బాలాజి, రైతు
రాళ్లు, రప్పలు తొలగించాం
45 ఏళ్లుగా ఖాస్తు చేస్తున్నా. రూ. 8 లక్షలు ఖర్చు పెట్టి రాళ్లు, రప్పలు తొలగించి సాగుచేస్తున్నా. ఐదు బోర్లు వేస్తే అందులో మూడు పోయాయి. ప్రస్తుతం పొలంలో వరి నాట్లు వేయాల్సి ఉంది. బయపడి కూలీలు రావడంలేదు.
– జంగయ్య, రైతు