ఈ–నామ్ అమలుపై రైతుల కన్నెర్ర
-
పొదలకూరు యార్డులో నిరసన
పొదలకూరు : స్థానిక నిమ్మమార్కెట్ యార్డులో మంగళవారం ఈ–నామ్(నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్) విధానం అమలుపై రైతులు నిరసన వ్యక్తం చేశారు. మార్కెట్‌ను ఆన్‌లైన్ చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వర్షంలోనే మార్కెట్‌ను సుమారు గంట సేపు స్తంభింపజేశారు. ఈ నెల 5వతేదీ నుంచి యార్డులో ఈ–నామ్ విధానాన్ని అమలు చేస్తామని రాపూరు మార్కెట్ కమిటీ సెక్రటరీ ఎం.శ్రీనివాసులు ప్రకటించారు. ముందుగా ఆన్‌లైన్ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు సిబ్బందితో ఆయన యార్డుకు చేరుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న రైతులు ఏఎంసీ సెక్రటరీతో గొడవకు దిగారు. ఈ–నామ్ విధానంతో రైతులకు లాభం చేకూరడంతో పాటు, దేశంలో నిమ్మకాయల ధరలు ఏ ప్రాంతంలో ఎంత ఉన్నది తెలుసుకుని అమ్ముకోవచ్చునని సెక్రటరీ వారికి వివరించారు.
లైసెన్సులు ఇస్తే గిట్టుబాటు ధరలు లభించవు
యార్డు వెలుపల కాయలను కొనుగోలు చేస్తున్న వ్యాపారులకు లైసెన్సులు ఇస్తే వారు కూడా లైసెన్సు కలిగిన వ్యాపారులతో కలసి తమకు గిట్టుబాటు ధర దక్కకుండా చేస్తారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్ని ఇబ్బందులు ఉన్నా అమలు
ఈ–నామ్ విధానం అమలులో ఎన్ని ఇబ్బందులు తలెత్తినా అమలు చేస్తామని ఏఎంసీ సెక్రటరీ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉందని చెప్పారు. యార్డులో భవనాన్ని నిర్మించి కంప్యూటర్లు, ఫర్నీచరును సిద్ధం చేసినట్లు వివరించారు. నిమ్మయార్డుపై సమగ్ర నివేదికను కమిషనర్‌కు అందజేస్తామన్నారు.