
మంగళవారం నాటి వడ్డితాండ్ర దీక్షల్లో కూర్చున్న మత్స్యకారులు
సంతబొమ్మాళి: పొట్ట నింపుతున్న కన్న తల్లిలాంటి తంపర భూములను కాపాడుకోవడం కోసం మత్స్యకారులు, రైతులు రక్తం చిందించి బుధవారం నాటికి ఏడేళ్లు పూర్తికానున్నాయి. అయినా ‘థర్మల్’ మంటలు రగులుతూనే ఉన్నాయి. తమకు జీవనాధారమైన తంపర భూముల్లో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించొద్దని ఉద్యమం హోరున సాగింది. ఈ క్రమంలోనే 2011 ఫిబ్రవరి 28న ఇదే డిమాండ్‌తో రోడ్డెక్కిన థర్మల్ వ్యతిరేకులపై పోలీసులు బుల్లెట్ల వర్షం కురిపించారు. తూటా లకు ముగ్గురు నేలకొరిగారు. వందలాది మంది గాయపడ్డారు. వడ్డితాండ్రలో సుమారు 60 ఇళ్లు, వందలాది ఎకరాల వరిచేలు కుప్పలు బూడిదయ్యారు. ఈ ఘటన అనంతరం థర్మల్ పోరాట ఉద్యమ నాయకులతో పాటు మరి కొందరు అమాయకులు జైలుపాలయ్యారు. నేటికీ కొందరు కేసులంటూ కోర్టులచుట్టూ తిరుగుతున్నారు.
ఆ రోజు ఏం జరిగిందంటే... !
సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజు... మిట్ట మధ్యాహ్నం... ఉద్యమకారుల లక్ష్యాన్ని నెరవేరనివ్వకుండా చేసేందుకు ప్రభుత్వ ఆదేశాలతో వందలాది మంది పోలీసు బలగాలు పోతునాయుడుపేట జంక్షన్ వద్ద మోహరించారు. థర్మల్ ప్లాంట్ వద్దంటూ ఆకాశలక్కవరం, గొదలాం, హనుమంతునాయుడుపేట, పోతునాయుడుపేట, సీరపువానిపేట, కొల్లిపాడు, మేఘవరం తదితర గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. థర్మల్ ప్లాంట్ వద్దంటూ శాంతియుతంగా నిరసన తెలియజేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఉద్యమకారులపై తొలుత పోలీసులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తర్వాత విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. వజ్రా వాహనం నుంచి పొంగబాంబుల వర్షం కురిపించారు. అప్పటి ఎస్పీ గోపాలరావు నేతత్వంలో ఓఎస్‌డీ తివిక్రమ్‌వర్మ, ఏఎస్పీ శ్యామసుందర్, డీఎస్పీలు ప్రసన్నకుమార్, సాగర్ తదితరులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. పోలీసుల చర్యలకు నిరసనగా ఉద్యమకారులంతా ఉవ్వెత్తున తరలివచ్చి పోలీస్ వాహనాన్ని దగ్ధం చేసి ప్లాంటు పరిసర ప్రాంతాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. సహనం కోల్పోయిన పోలీసులు తుపాకీలకు పని చెప్పారు. తూటాల వర్షం కురిపించారు.
దీంతో బుల్లెట్లు దూసుకుపోవడంతో జీరు నాగేశ్వరరావు (ఆకాశలక్కవరం), సీరపు యర్రయ్య (సీరపువానిపేట)లు అక్కడికక్కడే కన్నుమూశారు. బత్తిన బారికివాడు (గూళ్లవానిపేట) శరీరంలోనుంచి బుల్లెట్ దూసుకుపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ 2011 మే 26వ తేదీన ప్రాణాలు వదిలాడు. వందలాది మంది గాయాల పాలయ్యారు. ఇక్కడ బాంబుల మోత మోగుతుండగానే, మరో వైపు వడ్డితాండ్రలో పోలీస్ బలగాలు అత్యుత్సాహంతో మత్స్యకారులు, స్థానికుల ఇళ్లను తగులబెట్టి వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ రణరంగానికి సరిగ్గా మూడు రోజులు ముందు నుంచే (2011 ఫిబ్రవరి 24 రాత్రి నుంచి) పోలీస్ బలగాలు థర్మల్ పరిసర ప్రాంతాలైన వడ్డితాండ్ర, పోతునాయుడుపేట తదితర గ్రామాలను చుట్టు ముట్టారు. ఇదే ఉత్సాహంతో వడ్డితాండ్ర, హనుమంతునాయుడుపేటల వద్ద థర్మల్ ప్లాంటుకు వ్యతిరేకంగా ఉద్యమ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షా, సహాయ నిరాకరణ శిబిరాలను పోలీస్ బలగాలు పూర్తిగా ధ్వంసం చేశాయి.
చల్లారని ఉద్యమ స్ఫూర్తి
పోలీసుల తూటాలకు ముగ్గురు ఉద్యమకారులు బలైనా ఉద్యమ స్ఫూర్తి మాత్రం తగ్గలేదు. వడ్డితాండ్రలో థర్మల్‌కు వ్యతిరేకంగా 2010 ఆగస్టు 15 నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ దీక్షలను అప్పటి ఎమ్మెల్సీ ఎంవీఎస్.శర్మ ప్రారంభించారు. మంగళవారం నాటికి వడ్డితాండ్ర దీక్షలు 3,116వ రోజుకు చేరుకున్నాయి. ప్లాంటు ఆగేంత వరకు దీక్షలు ఆగవని ఉద్యమకారులు తేల్చి చెప్పారు. థర్మల్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఉద్యమకారులను, నాయకులను 400 మందిని అరెస్టు చేయగా 1800 మందికి పైగా కేసులు నమోదు చేశారు. పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలను 2011 మార్చి 2వ తేదీన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పరామర్శించారు.
అలాగే మార్చి 3న సీపీఐ, సీపీఎం అప్పటి రాష్ట్ర కార్యదర్శులు నారాయణ, రాఘవులు పర్యటించి ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అలాగే మార్చి 7న వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి థర్మల్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఓదార్చారు. తాము అధికారంలోకి వస్తే థర్మల్ ప్లాంటును రద్దు చేస్తామని ప్రకటించారు. థర్మల్‌కు వ్యతిరేకంగా మొదటి నుంచి ఇప్పటి వరకు వైఎస్‌ఆర్ సీపీ పోరాటం కొనసాగిస్తూనే ఉంది. కాకరాపల్లి కాల్పులపై 2011 డిసెంబర్ 14, 21 తేదీల్లో టెక్కలి ఆర్డీవో కార్యాలయంలో అప్పటి జేసీ శ్రీధర్ మెజిస్ట్రేరియల్ విచార ణ జరిపారు. మెజిస్ట్రేరియల్ విచారణ వలన న్యాయం జరగదని జుడీషయల్ విచారణ చేపట్టాలని థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఏది ఏమైనప్పటికీ కాకరాపల్లి తంపరలో ఈస్టుకోస్టు థర్మల్ ప్లాంటు నిలుపుదల అయ్యేంత వరకు పోరాటం కొనసాగిస్తామని పోరాట కమిటీ కన్వీనర్ అనంతు గన్నూరావు స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment